మగాడివైతే ముందుకు రా.. బాబుకు కేటీఆర్ సవాల్

అమెరికా నుంచి కుక్కలతో మాట్లాడించడం కాదు..

ktr
-తప్పుడు ఆరోపణలని తేలితే నా కాళ్లు పట్టుకుంటావా?
-చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కేటీఆర్
-ఏ విచారణకైనా సిద్ధమేనని స్పష్టీకరణ
-ఎల్లుండి ఏబీఎన్‌పై పరువు నష్టందావా
-టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చానల్ తనపై చేసిన ఆరోపణలపై ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు సవా ల్ విసిరారు. సీబీఐ, ఎఫ్‌బీఐ సంస్థలతో విచారణ చేపట్టినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలను బయటపెడితే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. తనపై టీడీపీ అనుబంధ పత్రిక ఆంధ్రజ్యోతి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఈ కథనాలను చంద్రబాబు ఆదేశాల మేరకే ప్రసారం చేశారని ఆరోపించారు.

‘ఆరోపణలు తప్పని రుజువైతే నా కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తావా? దమ్మూ ధైర్యం ఉంటే.. మగాడివైతే ముందుకు రా. అమెరికా నుంచి ఫోన్ చేసి నీ కుక్కలతో మాట్లాడించడం కాదు’ అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే.. శాశ్వతంగా అమెరికాలోనే ఉండాల్సి వస్తుందని చంద్రబాబును కేటీఆర్ హెచ్చరించారు. బాబులాగా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ప్రయత్నం తాము చేయబోమని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు పనికిమాలిన కొందరి ద్వారా ఆరోపణలు చేయిస్తారా? అని మండిపడ్డారు. ‘నీ పెంపుడు కుక్కలు, జంతువులతో మాట్లాడిస్తావా? నీ జీవితంలో ఏనాడైనా నిజం మాట్లాడావా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులతో పాటు.. సీఎం కావడానికి ముందు చంద్రబాబుకు ఉన్న ఆస్తులు.. సీఎం అయిన తర్వాత ఉన్న ఆస్తులపైనా విచారణకు సిద్ధం కావాలని సవాలు చేశారు. చంద్రబాబుపై సోమవారం పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. క్రిమినల్, సివిల్ కేసులు కూడా పెడతామని స్పష్టం చేశారు. ‘అదో పచ్చ పత్రిక. ఏదో కారణాలతో రాస్తే దాన్ని పట్టుకొని ఆరోపణలు చేస్తారా? నా ముఖం చూపిస్తూ 14 గంటలు ప్రసారం చేసిన రాధాకృష్ణకు.. నా వివరణ తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదా?’ అని ప్రశ్నించారు. బోధన్‌లో దొంగనోట్లు, కిరోసిన్‌ను అమ్ముకున్న చరిత్ర రాధాకృష్ణదని విమర్శించారు. ‘సాధారణ విలేకరిగా పనిచేసిన నువ్వు.. పత్రికకు, చానల్‌కు అధిపతి ఎలా అయ్యావు? పాత సైకిల్‌పై అసెంబ్లీ రాలేదా? నీ చరిత్ర ఎవరికీ తెలియదు?’ అంటూ మండిపడ్డారు.

సోమవారం పరువు నష్టం దావా
తనపై నిరాధార వార్తలు ప్రసారం చేసిన ఏబీఎన్-ఆంవూధజ్యోతి చానల్‌పై సోమవారం పరువు నష్టం దావా వేయాలని కేటీఆర్ నిర్ణయించారు. సోమవారం వరకు లాయర్లతో మాట్లాడి, దావా వేస్తామని ఆయన టీ మీడియాకు తెలిపారు. ఏ మాత్రం ఆధారాలు లేకుండా.. బట్టకాల్చి మీదేసే విధంగా ఏబీఎన్ చానల్ తనపై అసత్య ప్రసారాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
టీడీపీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు స్పీకర్‌కు శుక్రవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో శ్రీనివాసరావు అనే వ్యక్తిని కేటీఆర్ కిడ్నాప్ చేసినట్లు, అతని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపిస్తూ శుక్రవారం అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై కేటీఆర్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్‌కు అందజేశారు. తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ నోటీసు ఇచ్చారని స్పీకర్‌కు తెలిపారు. ‘ఇవి పూర్తిగా అసత్య, అర్థంలేని ఆరోపణలు. వాస్తవాలు తెలియకుండానే రూల్ 63 నిబంధనల కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనవసరం. వీళ్లదగ్గర ఎలాంటి సాక్ష్యాలు, రికార్డులు ఏమీ లేకుండానే నాపై నిరాధార ఆరోపణలు గుప్పించారు. రాజకీయంగా నేను పెంచుకున్న ప్రతిష్ఠను దీని ద్వారా భగ్నం చేసేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారు. తీర్మానంలో పేర్కొన్న ఆరోపణలు కేవలం పరువునష్టానికి సంబంధించినవి మాత్రమే కావు. ఇవన్నీ కూడా అవాస్తవాలను అవాస్తవాలు చేసే ప్రయత్నాలు.

శాసనసభ్యుడిగా నాకున్న హక్కులను ఉపయోగించుకోకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రజలకు జవాబు చెప్పాల్సిన విధానాలపై కూడా దాడి చేస్తున్నారు. న్యాయపరంగా వ్యక్తిగా, శాసనసభ్యుడిగా నేను చేయాల్సిన విధులకు, బాధ్యతలకు, కర్తవ్యానికి అడ్డుపడుతున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేని పరిస్థితులు కల్పిస్తున్నారు’ అని తన నోటీసులో కేటీఆర్ తెలిపారు. తన హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తూ, నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్ఠను భగ్నం చేస్తున్న ఆయా శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని, ఒక శాసనసభ్యుడిగా తనకున్న హక్కులను కాపాడాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.