భగ్గుమన్న మణిపూర్

ఓ వైపు గ్యాంగ్ రేప్ ఘటనపై ఢిల్లీ అట్టుడుకుతుండగానే.. మరో వైపు మణిపూర్‌లో అలాంటి మరో సంఘటనకు నిరసనగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఆ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడటంతో ఆదివారం ఓ వీడియో జర్నలిస్టు మృతి చెందాడు. దీనిపై జర్నలిస్టులు భగ్గుమన్నారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో పాటు దాని పరిసర జిల్లాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

అసలేం జరిగింది..?
మహిళా సంఘాలకు నిధులు సేకరించే నిమిత్తం ఈనెల 18న చాందెల్ జిల్లాలో ఓ సంగీత విభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో సినీ నటి మొమొకో(20) అతిథిగా హాజరయ్యారు. అక్కడే ఉన్న నాగా మిలిటెంట్ నేత ఒకరు అందరూ చూస్తుండగానే నటిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిలదీసినందుకు ఆమె ముఖంపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువ నటుడిపై కాల్పులు జరిపాడు. మిలిటెంట్ నేత ప్రవర్తనను నిరసిస్తూ రెండురోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్ బంద్‌కు మణిపూర్ ఫిల్మ్ ఫోరం(ఎంఎఫ్‌ఎఫ్) పిలుపునిచ్చింది. శనివారం నుంచి బంద్ కొనసాగుతోంది. శనివారం నాడు బంద్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీంతో నలుగురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.

కవరేజీకి వెళ్తే.. కాల్చి చంపారు!
నాగా మిలిటెంట్ తీరుకు నిరసనగా ఆదివారం ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. నటిపై అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇంఫాల్‌తో పాటు పశ్చిమ, తూర్పు జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి. ఇంఫాల్‌లోని థాంగ్‌మేబంద్‌లో ఆందోళనలను కవరేజీ చేసేందుకు ‘ప్రైమ్ టైం’ టీవీ చానల్ వీడియో జర్నలిస్టు నానో సింగ్(29) వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం నిరసనకారులను చెదరగొ పోలీసులు కాల్పులు జరిపారు. వీడియో చిత్రీకరిస్తున్న నానో సింగ్‌కు రెండు బుల్లెట్లు తగిలాయి. ఓ బుల్లెట్ ఛాతిలోకి దూసుకెళ్లడంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. సహచరులు హుటాహుటిన రిజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పవూతికి తరలించగా.. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే నానో సింగ్ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మణిపూర్ లోయ, ఇంఫాల్, తూర్పు, పశ్చిమ జిల్లాలు అట్టుడుకుతున్నాయి. పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, నానో సింగ్ నుంచి కెమెరాను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. నిరసనల నేపథ్యంలో ఇంఫాల్ తదితర ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగనుంది. నిరసనకారులు నాలుగు వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్ర హోం మంత్రి గైఖాన్‌గమ్ ఆస్పవూతిని సందర్శించి.. నానో సింగ్ మృతదేహానికి నివాళులర్పించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిలిటెంట్‌ను పట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందోని చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.