బొగ్గు కేసులో సీబీఐ విచారణకు సిద్ధం

 బొగ్గు గనుల కేటాయింపులపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, దేశంలోని చట్టాలకు తాను అతీతుడినేమీ కాదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలు తలెత్తితే మంత్రుల బృందం పరిష్కార మార్గాలు చూపుతుందన్నారు.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎలాంటి ఆపదరాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, దేశంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడుతాయని జోస్యం చెప్పారు. చైనా పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి వస్తూ, మార్గమధ్యంలో ప్రత్యేక విమానంలో మీడియాతో ప్రధాని ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో 10 రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన తొలిసారిగా మౌనం వీడారు. తాను చట్టానికి అతీతుడినేమీ కాదన్నారు. సీబీఐగానీ మరే సంస్థ అయినా బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. ఇందులో దాచడానికి ఏమీ లేదన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, ఇందులో ప్రధాని పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తెలిసిందే. గనుల కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా ప్రధానినుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపుల్లో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే..

తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్రదారుడేనని పేర్కొన్నారు. ఆ శాఖను నిర్వహించిన ప్రధానిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న వ్యక్తులపై కేసు నమోదు చేసే ముందు సీబీఐ కనీస జాగ్రత్తలు తీసుకోదన్న విమర్శలు వచ్చాయని, మరి సీబీఐకి పూర్తిస్థాయిలో స్వయం ప్రతిపత్తి ఇస్తే, రేపు సీబీఐ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి ప్రధానిని విచారణ చేసే అవకాశం లేదా..? అని విలేకరులు ప్రధానిని ప్రశ్నించగా కోర్టు పరిశీలనలో ఉన్న అంశాలపై స్పందించడం సముచితంకాదని సమాధానమిచ్చారు. కుంభకోణాలు, సీబీఐ కేసులు ప్రధాని పదవికి ఎసరు తెస్తున్నాయని భావిస్తున్నారా..? అని ప్రశ్నించగా మన్మోహన్ తీవ్రంగా స్పందించారు. దానికి చరిత్ర మాత్రమే సమాధానం చెబుతుందన్నారు. పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నా, ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదన్నారు. తాను పదవులకోసం ఆశపడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.

పరిష్కారం దిశగా జీవోఎం
తెలంగాణ అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజనతో తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ అంశం క్లిష్టమైనదేనని, మంత్రుల బృందం పరిష్కార మార్గం దిశగా పయనిస్తున్నదన్నారు. త్వరలోనే ఆమోదయోగ్య పరిష్కారం వెలువడుతుందని చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందా..? అని అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానాన్ని దాటవేశారు. ‘రాష్ట్ర విభజన వల్ల తలెత్తే అన్ని సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ అంశం ప్రస్తుతం జీవోఎం సమక్షంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు తలెత్తితే జీవోఎం పూర్తిస్థాయిలో పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం ఉంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

రాహుల్ భద్రతకు అన్ని చర్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎలాంటి ఆపద రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కొంతమంది నాయకులు స్వార్థపూరిత రాజకీయాలకోసం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని నాతో సహా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతకు ప్రభుత్వం ముందునుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వలేదు’ అని పేర్కొన్నారు. తనకు ప్రాణాపాయం ఉందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రధాని పైవిధంగా స్పందించారు.

షరీఫ్ తీరుపై ప్రధాని అసంతృప్తి
పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో గత నెల జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చడం లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను ఇప్పటికైనా నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇరుదేశాలు మంచిది కాదని అన్నారు. 2003లో పదేళ్లపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రస్తుతం దానిని కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం
వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని.. దేశంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడుతాయని ప్రధాని మన్మోహన్ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచార రేసులో ముందున్నారని మీడియా ప్రశ్నించగా, బీజేపీ ముందస్తుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. ఆచితూచి అడుగులు వేస్తే విజయం సాధ్యమని, కాస్త వెనుక ప్రచారం మొదలుపెట్టినా 2014 ఎన్నికల్లో గెలిచేది తామేనని ఘంటాపథంగా చెప్పారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ఐదు రోజుల రష్యా, చైనా పర్యటనలో చర్చలు ఫలవూపదంగా ముగిశాయని చెప్పారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.