బేత మీదకువచ్చినం.. ఇక గెలుపు మనదే

బేత (గీత) మీదకు వచ్చినం. ఎంతమంది పట్టుకున్నా కూడా గెలుపు మనదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు. ఈ అంశంపై తెలంగాణవాదులు దిగులు చెందవద్దు’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య (టీఎఫ్‌టీయూ) ఆవిర్భావ సభ జరిగింది.
Tftuu

ఈ సభకు కాచం సత్యనారాయణగుప్తా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడి ఎలా గెలిచామో, రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అదే స్థాయిలో పోరాడి గెలుపొందాలన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి ఢిల్లీ వారెవరని ఆంధ్రా పాలకులు ప్రశ్నిస్తున్నారని, మరీ తెలంగాణ ప్రజల హక్కులపై మాట్లాడటానికి చిత్తూరు వాడెవడని కోదండరాం ప్రశ్నించారు. బలంగా ఉన్న ఆంధ్రా పాలకులకు సంఘం అవసరం లేదని, బలహీనంగా ఉన్న తెలంగాణ వారికే సంఘం అవసరమని తెలిపారు.

పెట్టుబడులు పెడితేనే దేశం బతుకుతుందని చంద్రబాబు కొత్త సిద్ధాంతం చెప్పారని, అయితే కార్మికులు కష్టపడితేనే దేశానికీ, పెట్టుబడిదారులకు బతుకు ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా కార్మికలోకం చెబుతున్న విషయం ఆయనకు తెలియడం లేదని విమర్శించారు. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేస్తేనే అసంఘటిత రంగానికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కానీ హైదరాబాద్‌లో ఆంధ్రవాళ్లు ఉత్పత్తిరంగంపై పెట్టుబడులు పెట్టలేదన్నారు. వాళ్లు ఆస్పవూతులు, స్కూళ్లు, కాలేజీలు, సినిమారంగం, స్టూడియోలపైనే పెట్టుబడులు పెట్టారని దీనివల్ల సంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఆంధ్ర పారిశ్రామికవేత్తల వల్ల అసంఘటిత రంగం కుదేలయిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలే ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించారని తెలిపారు. తమ ఆదాయాలను పెంచుకునేందుకు పెట్టుబడులు పెట్టిన ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌పై మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరూ బతకలాంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నియంత్రణలో ఉండాలని అన్నారు. రాష్ట్రంలో సరళీకరణ విధానాలు చంద్రబాబు హయంలోనే అమలయ్యాయని,దీనివల్ల ఒక్క హైదరాబాద్‌లోనే 25వేల మంది కార్మికులు ,సింగరేణి బొగ్గు గనుల్లో 25 వేలు ఉపాధి కోల్పోయారన్నారు.

అంకితభావం గల కార్మిక నాయకత్వం అవసరం: మల్లేపల్లి
ప్రభుత్వాల చేత విస్మరించబడిన లెక్కలోకి రాని కార్మికుల సమస్యలే ఎజెండా పోరాటాలే చేయడం ప్రస్తుత చారిత్రక అవసరమని సీనియర్ జర్నలిస్ట్, టీజేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. త్యాగం, నిజాయితీ, అంకితభావం కలిగిన నాయకత్వం లేక కార్మిక రాజకీయాలు పలుచబడ్డాయన్నారు. అర్జున్ గుప్తా కమిషన్ సిపారసులను అమలు చేయడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుడి పనిగంటలు 8 గంటలు పోయి 24 గంటలయ్యాయని, జీతాల ఉద్యమం కాకుండా జీవితాల ఉద్యమంగా కార్మికుల ఉద్యమాలు రూపాంతరం చెందాయని అభివర్ణించారు.

ముళ్లబాటను స్వీకరిస్తాం: కాచం సత్యనారాయణ
కార్మిక సంఘాలను ఐక్యం చేయడం, ఏకతాటి మీదికి తీసురావడం అంటే కత్తిమీద సాములాంటి విషయమని తెలిసే.. ముళ్లబాటను రాచబాటగా స్వీకరించడానికి ఈ ముందడుగేశామని తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఇన్‌చార్జి కాచం సత్యనారాయణ తెలిపారు. టీఎఫ్‌టీయూ ఆవిర్భావ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికులను భాగస్వామ్యం చేయడం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడానికే ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 30 రంగాల కార్మికుల సమస్యలపై అధ్యయనం చేశామని, ఆయా రంగాల కార్మికులను సంఘటితం చేసి వాటి పరిష్కారానికి పాటుపడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పదాలు వినిపించకూడదని, వాటిని నిషేధించాలన్నదే తమ ప్రథమ డిమాండ్ అన్నారు.

సామాజిక న్యాయం కేంద్రంగా తెలంగాణ : గోవర్థన్
సామాజిక న్యాయం కేంద్ర బిందువుగానే తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత గోవర్థన్ సూచించారు. తెలంగాణ రావడంతోనే సమస్యలు పరిష్కారం కావని, మార్గాలను ఇక్కడి చైతన్యవంతమైన, మేధోవంతమైన నాయకత్వం చేపట్టాలని సూచించారు.118 శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు డప్పులు, ఆటాపాటలతో భారీ ర్యాలీగా టీఎఫ్‌టీయూ కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సభలో టీఎఫ్‌టీయూ ప్రధానకార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్, తెలంగాణ సీపీఎం కన్వీనర్ ఎండీ మహమూద్, టీ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ బీవీ కోటయ్య, టీఎఫ్‌టీయూ ప్రతినిధులు కాసం రాజు, బీఎస్ రెడ్డి, బీ గంగన్న, బాదం రవికుమార్, బండి రవిగౌడ్, ఎం ఆనంద్, ఎం కోటేశ్వరరావు, డాక్టర్ పీ యాదగిరి, కుసుమ జగదీశ్‌నేత, జీఎస్ గోపి, బీ కృష్ణయ్య, వీ శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.

ఆత్మహత్యలు, ఆకలికేకలు లేని ఆకుపచ్చ తెలంగాణే కావాలి: ఈటెల
భౌగోళికంగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం తమకు అవసరం లేదని, ఆత్మహత్యలు, ఆకలికేకలు లేని ఆకుపచ్చ తెలంగాణే కావాలని టీఆర్‌ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడగానే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తాను భావించడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి మరో పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కార్మికుల హక్కులను చంద్రబాబే కాలరాశారని మండిపడ్డారు. సమస్యలపై ప్రశ్నించే అధికారం తెలంగాణ గడ్డపై ఏర్పడిందని, అందువల్లనే తెలంగాణవ్యాప్తంగా అన్ని రంగాల్లో జేఏసీలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఒకప్పుడు నిర్వేదంతో ఉన్న కార్మిక వర్గానికి తెలంగాణ ఉద్యమంతో మళ్లీ కదం తొక్కాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ గడ్డ మీది బాధలు తీరే ఏకైక మార్గం ప్రత్యేక రాష్ట్ర ఏర్పా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ పార్టీ 13 ఏళ్లుగా ఉద్యమిస్తోందని, కోదండరాం ఆధ్వర్యంలో ఎన్నో జేఏసీలు కలిసి ఉద్యమం చేశాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అందరి కష్టాలు తీర్చేందుకు అందరూ కూర్చొని ఆలోచించాల్సి అవసరముందని, ఏ వర్గానికి నష్టం వాటిల్లకుండా సమన్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సకల సమస్యలకు పరిష్కారమన్నారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు మన సమస్యలను పరిష్కారించలేకపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత వీరందరికీ భద్రత, భరోసా కల్పించేందుకు పూనుకోవాల్సి అవసరముందన్నారు.

ఆర్టికల్ 371 డీను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు: ఎంపీ వివేక్
తెలంగాణ ఏర్పాటుకు ఆర్టికల్ 371 (డీ) అడ్డుగా ఉంటుందని సీమాంవూధులు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ఎంపీ వివేక్ తెలిపారు. ఉద్యోగాలు, విద్య, సీట్ల కోసమే 371 (డీ) అనే చట్టం చేశారని తెలిపారు. రాష్ట్రాల్లో ఏదైన ప్రత్యేకంగా కల్పించాలంటే ఆర్టికల్ 371 ద్వారా పార్లమెంటులో చట్టం చేస్తారని తెలిపారు. ఇటీవల కాలంలో 371 (ఎఫ్) అని కర్ణాటక రాష్ట్రానికి కూడా చట్టం చేశారని గుర్తుచేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ అభివూపాయం కోసమే తెలంగాణ బిల్లును పంపిస్తారని తెలిపారు. అసెంబ్లీతో సంబంధం లేకుండా పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లును పెట్టవచ్చునని చెప్పారు. కాంట్రాక్టు వ్యవస్థ తెలంగాణలో ఉండదన్నారు. కార్మికులు సంతోషంగా ఉంటేనే ఆ కంపెనీ బాగా నడుస్తుందన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు మరిన్ని కార్మిక చట్టాలు రావాల్సి ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.