బెంగళూరు జాతీయ రహదారిపై.. 21 సడక్ బంద్

 

21-sadak– మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్
– బైండోవర్లు, వేధింపులు ఆపండి
– జేఏసీ నేతలు లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, దేవీవూపసాద్ డిమాండ్

తెలంగాణపై వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 21వ తేదీన బెంగళూరు జాతీయ రహదారిపై సడక్ బంద్‌ను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. శనివారం జేఏసీ కార్యాలయంలో అంతర్గతంగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత నెల 24న నిర్వహించాల్సిన సడక్ బంద్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు సడక్ బంద్ తరువాత విజయవాడ జాతీయ రహదారిపై సడక్ బంద్ తేదీలను ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న బెంగళూరు రహదారిపై సడక్ బంద్‌ను విజయవంతం చేయాలని టీ జేఏసీ కో చైర్మన్లు మల్లెపల్లి లక్ష్మయ్య, వీ శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్ తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ అంతర్గత సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సడక్ బంద్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఉద్యమకారులను బైండోవర్ చేయడాన్ని వెంటనే ఆపాలని, ఉద్యమకారులను వేధింపులకు గురిచేయొద్దని వారు డిమాండ్ చేశారు. బైండోవర్లు, ముందస్తు అరెస్టులకు భయపడేది లేదన్నారు. సడక్ బంద్‌ను విజయవంతం చేసేందుకు గతంలో చేసిన ఏర్పాట్లను కొనసాగిస్తామన్నారు.

శంషాబాద్ నుంచి ఆలంపూర్ చౌరస్తా వరకు 11 పాయింట్లను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయిస్తామన్నారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టవద్దని, ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానంపై ఒత్తిడిని పెంచాలని, లేదంటే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి కలిసి రావాలన్నారు. సడక్‌బంద్‌కు ముందే నిర్ణయాన్ని తీసుకోవాలని వారు టీ ఎంపీలకు సూచించారు. ఈ నెల 21న టీజేఏసీ నిర్వహించతలపెట్టిన సడక్ బంద్‌కు టీఆర్‌ఎస్ సంపూర్ణంగా మద్దతునిస్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ తెలిపారు. సడక్ బంద్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నితే దాన్ని ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కనకమామిడి స్వామిగౌడ్, టీజేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, అధికార ప్రతినిధులు సీ విఠల్, అద్దంకి దయాకర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాజేందర్‌డ్డి, నల్లపు ప్రహ్లాద్, రసమయి బాల్‌కిషన్, వెంక ఆనందం, డాక్టర్ శ్రీధర్, ఎంబీ కృష్ణయాదవ్, మామిడి నారాయణ, డా. సురేష్‌చంద్ర, బీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.