బీహార్ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ గరంగరం

బీహార్ సీఎం నితీశ్‌కుమార్-గుజరాత్ సీఎం నరేంవూదమోడీ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. మోడీని ఉద్దేశించి జేడీయూ కార్యవర్గ సదస్సులో నితీశ్‌కుమార్ చేసిన విమర్శలపై బీజేపీ నేతలు గరంగరమవుతున్నారు. మోడీని ప్రధానిగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని నితీశ్‌కుమార్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. గుజరాత్ అభివృద్ధి నమూనా కూడా దేశవ్యాప్తంగా పనిచేయబోదని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన బీహార్ బీజేపీ నేతలు సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. నితీశ్‌కుమార్ వ్యవహారశైలిపై ఆయనకు ఫిర్యాదు చేశారు. బీహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలో జేడీయూ-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

బీహార్ బీజేపీలో అసమ్మతి నేతలుగా, మోడీ వీరవిధేయులుగా ముద్రపడిన రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ సీపీ థాకుర్, మంత్రులు అశ్వనీ చౌబే, గిరిరాజ్ సింగ్, చంద్రమోహన్‌రాయ్.. రాజ్‌నాథ్‌ను కలిశారు. మోడీపై జేడీయూ నేతలు ఇదే రకంగా దాడి కొనసాగిస్తే సహించబోమని వారు పార్టీ సారథికి స్పష్టంచేసినట్టు తెలిసింది. జేడీయూతో పొత్తు వల్ల బీహార్‌లో బీజేపీ పుంజుకోలేకపోతున్నదని, ఆ పార్టీతో పొత్తు కొనసాగించడానికి తాము వ్యతిరేకమని వారు పేర్కొన్నారు. మరోవైపు బీహార్ బీజేపీ నేతలు కూడా జేడీయూ తీరును తప్పుబడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. తమ మోడీని విమర్శిస్తే అంగీకరించబోమని, జేడీయూ తీరు సరికాదని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు మంగల్ పాండే స్పష్టంచేశారు. కాగా, మోడీని ఉద్దేశించి పరోక్షంగా జేడీయూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.