బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి: ఆర్ కృష్ణయ్య

బీసీలకు రూ.20 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, బీసీ మంత్రులు, ప్రజావూపతినిధులు కృషి చేయాలని కోరారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. గతేడాదిగా బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలని ఉద్యమిస్తుంటే ఏ ఒక్క బీసీ మంత్రి నోరు మెదపడంలేదని ఆరోపించారు. బీసీ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకొని భరతం పడతామని హెచ్చరించారు. ప్రపంచీకరణ వల్ల కులవృత్తులు నాశనమైపోయాయని వాటినే నమ్ముకుని బతుకుతున్న వారికి ఉపాధి లేకుండాపోయిందని, ఫలితంగా ఆకలి చావులకు గురవుతున్నారని తెలిపారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ కార్పొరేషన్, 17 ఫెడరేషన్‌లకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఒకోక్కరికి 10 నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని, ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే 8వ విడత భూ పంపిణీలో బీసీలకు భూములు కేటాయించాలని కోరారు. బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుర్రం శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పీ హరీశ్‌కుమార్‌లకు ఆర్ క్రిష్ణయ్య నియామక పత్రాలను అందజేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.