బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాల్సిందే

– పాలకులు బీసీల పట్ల వివక్షను వీడాలి
– బీజేపీ మహాదీక్ష ప్రారంభంలో పలువురు వక్తలు
– దీక్షలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, యెండల, లక్ష్మణ్

బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ సహా పలువురు సోమవారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజుల మహాదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ బీసీ సబ్‌ప్లాన్ కమిటీ ఇన్‌చార్జీ లక్ష్మణ్ మాట్లాడుతూ పాలకులు బీసీలపట్ల అన్ని రంగాల్లో వివక్షతను చూపుతున్నారని మండిపడ్డారు. 65శాతం బీసీలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని, నూటికి 70శాతం మంది బీసీలు వ్యవసాయ కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాని అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు సీహెచ్ విద్యాసాగర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, శాంతారెడ్డి, పీ చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ ఆచారి, కార్యదర్శి కాసం వెంక తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ అల్జాపూర్ శ్రీనివాస్, కో-చైర్మన్ సీ అశోక్‌కుమార్‌యాదవ్, గ్రేటర్ అధ్యక్షుడు బీ వెంకట్‌రెడ్డి, బీసీ సంఘాల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.