బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్

అరవై యేండ్ల వలసాధిపత్యానికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రజలు స్వయం పాలనకు, ఆత్మగౌరవం, అభివద్ధి, పునర్నిర్మాణ నినాదానికి పట్టం కట్టారు. మొదటిసారిగా సంపూర్ణమైన రాజకీయాధికారం తెలంగాణకు దక్కింది. ప్రభుత్వం స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కొట్లాడిన వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తెలంగాణకు బంగారు బాటలు ఎట్లా వేసుకోవాలో ఆలోచించాలి. దశాబ్దాలుగా తెలంగాణ సాధనకు తమ శక్తి, యుక్తుల్ని ధారబోసిన వారికి, ముల్కీ ఉద్యమం మొదలు నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రాణాల్ని బలిపెట్టిన బిడ్డలకు నివాళి అర్పిస్తూనే కర్త వ్య నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. తెలంగాణ రాష్ర్ట సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు జరిగేలా చూసుకోవాలి.
ఇప్పటివరకు ఒక అంకం ముగిసింది. ముందున్నది మరింత కష్టసాధ్యమైన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు ఇప్పటికన్నా ఎక్కువగా శ్రమించాలి. టీఆర్‌ఎస్ బంగారు తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఈ బంగారు తెలంగాణ సామాజిక న్యాయం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. వ్యక్తులకు పదవులు కట్టబెట్టినంత మాత్రాన మొత్తం ఆ సమాజానికి మేలు జరుగుతుందనే అపోహ ఇప్పటి వరకూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఫలానా వ్యక్తికి ఫలానా పదవి ఇవ్వాలి. లేదంటే ధర్నాలు చేస్తాం, దాడులు తప్పవు అంటూ కొంతమంది బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు తమ స్వీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. క్రైవ్‌ు, పొలిటిక్స్, క్యాపిటలిజవ్‌ు కలగలిసి ఇప్పటికే కొంత లుంపెన్ సెక్షన్ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తు న్నది. వీరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గానికే ఎక్కువ అన్యాయం చేస్తున్నారు.

ఆకలిచావులు లేని, ఆత్మగౌరవంతో బతికేందు కు, ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివద్ధి కార్యక్రమంలో సమాజంలోని అట్టడుగు వర్గాలను, విస్మత శ్రేణులను కలుపుకొనిపోయే సమ్మిళిత (ఇన్‌క్లూజివ్) తెలంగాణ కావాలి. జనాభా దామాషా ప్రకారం ఆ యా వర్గాల అభ్యున్నతికి నిధులు కేటాయించాలి. ప్రగతిలో వారికి భాగస్వామ్యం కల్పించాలి. ఎస్సీ సబ్‌ప్లాన్‌తో పాటుగా బీసీ సబ్‌ప్లాన్‌ని కూడా సమర్థంగా అమలుజేయాలి. హైదరాబాద్ కేంద్రంగా కాకుండా సమతుల్యంగా మొత్తం తెలంగాణ అభివ ద్ధి అయ్యే ప్రణాళికలు రచించాలి. వీటన్నిటికీ ప్రాతిపదిక సామాజిక తెలంగాణ కావాలి. జనాభాలో 80శాతం ఉన్న అణగారిన వర్గాల వారికి మేలు జరిగే పథకాలు కావాలి.ఈ వర్గాల నుంచి వచ్చే నాయకత్వమే సామాజిక తెలంగాణను పటిష్టమైన పునాదులపై నిర్మిస్తుంది. ఇప్పటికే ఎదిగొచ్చిన అలాంటి నాయకత్వం ప్రజల మన్ననలందుకుంటోంది.

చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం గత 62 యేండ్లుగా
దక్కలేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ తమ బహిరంగ మద్దతు ప్రకటించాలి. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ఆయా వర్గాల వారికిప్రాతినిధ్యం లేనట్లయితే వారికి శాసనమండలిలో సభ్యత్వం కల్పించాలి.

ఈ ఎన్నికల్లో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన బహుజనసమాజ్ పార్టీ మొత్తం అక్కడ పోటీ చేసిన 80 సీట్లలో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది. కాని వారికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఊరట కలిగింది. ఆ పార్టీ తరపున మొదటిసారిగా నిర్మల్ నుంచి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప శాసనసభకు ఎన్నికయ్యిండ్రు. ఇందులో ఒకాయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాగా మరో అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. బహుజన రాజ్యాధికారం అంటే ఇదేనా? వీళ్ళిద్దరి వల్ల ఆ పార్టీకి మేలు జరుగుతుం దా? కీడు జరుగుతుందా అనేది కాలమే తేలుస్తుంది.

ఇక టీఆర్‌ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ దళిత ముఖ్యమంత్రి అంశంపై ఎన్నికలకు ముందే వెనక్కి వెళ్ళిం ది. ఈ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ఇంకా చిన్నాచితకా పార్టీలన్నీ ఇదే విషయాన్ని ప్రధా న ఎజెండాగా ముందుకు తీసుకొచ్చింది. అయినప్పటికీ అది ఎలాంటి ప్రభావం చూపలేదు. 17 శాతం ఉన్న దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే మరి 50శాతానికి పైగా ఉన్న బీసీలు అందుకు అనర్హులా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యింది. అన్ని వర్గాల వారిని సమన్వయపరిచి పదవులు పంచాలి. 2009లో బీసీ ఎంపీలు తెలంగాణ నుంచి ఐదుగురుంటే ఈ సారి ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. అలాగే ఈసారి టీఆర్‌ఎస్ నుంచి 14 మంది బీసీలు, 13 మంది దళితులు, ఐదుగురు ఎస్టీలు ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి శాసనసభకు ఎన్నికయ్యిండ్రు. అంటే మొత్తం ఎన్నికయిన 63 మందిలో 33 మంది అణగారిన జాతులకు సంబంధించిన వారున్నారు. 30 మందిలో రెడ్లు, వెలమలు, వైశ్య, బ్రాహ్మణ కులాల వాండ్లున్నారు. అయితే ఇప్పటికీ ఖమ్మం, నల్లగొండ జిల్లా నుంచి చట్టసభల్లో ఒక్క బీసీకి ప్రాతినిధ్యం లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా ఈ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల వారే గెలుపొందారు. ఈ లోటుని పూడ్చుకోవడానికి శాసనమండలికి ఆయా వర్గాల వారిని టీఆర్‌ఎస్ పార్టీ నామినేట్ చెయ్యాలి.

కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని ఉన్న ముద్ర ను చెరిపేసుకోవడం కోసం ఎన్నికల ముందు పిసిసి అధ్యక్ష పదవి బీసీ అయిన పొన్నాలకు కట్టబెట్టి పెత్త నం మాత్రం ఉత్తవ్‌ుకుమార్ రెడ్డి చేతిలో పెట్టిండ్రు. సీట్ల కేటాయింపు అంతా ఆంధ్ర వెలమాయిన కెవిపి రామచందర్‌రావు కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు కొంతమంది కొత్తరాగం అందుకుండ్రు బీసీ లక్ష్మయ్యకు చేతగాకనే పరిస్థితి చేయి దాటిపోయిందని. బీసీలకే ముఖ్యమంత్రి పదవి అని ఊదరగొట్టిన టీడీపీ టికెట్లు మాత్రం అత్యల్పంగా బీసీలకిచ్చింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు బీసీలు గెలిచిండ్రు. అయితే ఇప్పుడు ఇచ్చిన మాటకుకట్టుబడి ఆర్.కష్ణయ్యను టీడీపీ శాసనసభ నాయకుడిగా నియమిస్తారా? లేదా అగ్రకులాల లాబీకి తలొగ్గుతాడా? అనేది తేలాల్సి ఉంది. ముషీరాబాద్ నుంచి గెలిచిన లక్ష్మణ్‌ను బిజేపి శాసనసభాపక్ష నాయకుడిగా నియమించాలనే డిమాండ్ వస్తోంది.

అలాగే దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి రావాలని కూడా బీసీలు కోరుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ మినహా మిగతా అన్ని పార్టీలు ఆంధ్రా వారి చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నాయి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలులు కావడమే గాకుండా, ఏ నిర్ణయం తీసుకుం ఆంధ్రాబాసులకు ఎక్కడ కోపమొస్తుందో అని ఆలోచిస్తుండ్రు. సీపీఐ తెలంగాణకు ఎంత మద్దతిచ్చి నా ప్రాంతేతరుడైన నారాయణను ఓడించి ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గ ప్రజలు తమ అసంతప్తిని ప్రకటించిండ్రు. ఇన్ని ఒడిదొడుకుల మధ్యన స్వీయ అస్తిత్వం కోసం తెలంగాణ కొట్లాడుతూనే ఉంది. బీసీ అస్తిత్వ చైతన్యాన్ని విస్తతం చేసేందుకు వివిధ సంఘాలు, సంస్థలు కషి చేస్తున్నాయి. యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, లాయర్లు, టీచర్లు ఇందులో భాగస్వాములవుతున్నారు.

తెలంగాణ కల సాకారం కావడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ మొదలు జయశంకర్ సార్ వరకు ఎందరో కషి చేసిండ్రు. వారి కషి చిరస్థాయిలో నిలిచి పోయే విధంగా బాపూజీ నివసించిన, టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన జలదశ్యంని తెలంగాణ మ్యూజియంగా తీర్చి దిద్దాలి. ఇందులో 60 యేండ్ల పోరాటానికి సంబంధించిన చిత్రాలు, డాక్యుమెం ట్లు, పోర్ట్రయిట్స్, పాటల సీడీలు, వీడియోలు, క్లిప్పింగ్‌లు, తెలంగాణకు జరిగిన ప్రతి అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పే చరిత్రకాంశాల్ని నిక్షిప్తం చేయాలి. అలాగే జయశంకర్ సార్ పరిశోధన కేంద్రా న్ని ఏర్పాటు చేసి సార్ రచనలే గాకుండా ఇప్పటి వరకు తెలంగాణపై వచ్చిన పరిశోధనలను ప్రచురించాలి. అలాగే కొత్తగా పరిశోధన చేసే వారికి దిశానిర్దే శం చేసే విధంగా ఈ కేంద్రం ఉండాలి. ప్రతి జిల్లాలో జయశంకర్ సార్ పేరిట ఐఎఎస్, గ్రూప్ వన్ పరీక్షా విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సెంటర్ తరపున ప్రతి సంవత్సరం తెలంగాణ ఐఎఎస్‌లను తయారు చేసుకోవాలి.

చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం గత 62 యేండ్లుగా దక్కలేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ తమ బహిరంగ మద్దతు ప్రకటించాలి. జనాభా దామాషా ప్రకారం చట్టసభ ల్లో ఆయా వర్గాల వారికి ప్రాతినిధ్యం లేనట్లయితే వారికి శాసనమండలిలో సభ్యత్వం కల్పించాలి. అలాగే కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వంలో పాత అన్యాయాలు కొనసాగకుండా ఉండాలంటే కొత్తగా ఏర్పడే మంత్రి మండలిలో కనీసం సగం మంది బీసీలకు స్థానం కల్పించాలి. అలాగే విద్య, రెవెన్యూ, హోం మంత్రి పదవులు కూడా కచ్చితంగా బీసీలకే ఇవ్వాలి. 1969 ఉద్యమంలో పోలీసు తూటాలకు బలైన అమరుల కుటుంబాలను ఆదుకోవడమే గాకుండా ప్రస్తుత ఉద్యమంలో ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి, యాదయ్యలతో సహా అందరికీ ప్రతి యేటా ప్రభుత్వం తరపున నివాళి అర్పించాలి.

-సంగిశెట్టి శ్రీనివాస్
(ఫోరం ఫర్ కన్సర్న్‌డ్ బీసీస్)
This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.