బీసీలకు పైసల్లేవ్

-బడ్జెట్ కేటాయింపులకే పరిమితమైన బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ నిధులు
-కార్పొరేషన్‌కు రూ.120కోట్లు ఇస్తే ఒక్కరికీ రుణాలు మంజూరు కాలేదు
-ఫెడరేషన్లకు కాగితాలపై కోట్లు చూపినా… ఒక్క పైసా విడుదల కాలేదు
-ఆరు నెలలు గడుస్తున్నా… ఫెడరేషన్లకు పాలకమండళ్లే లేవు
-సభ్యత నమోదు పూర్తయినా పాలకమండళ్ల ఏర్పాటుపై సర్కారు మొద్దు నిద్ర
-చేతివృత్తులు కనుమరుగుతున్నా… ఆత్మహత్యలు చేసుకుంటున్నా… నిధుల విడుదలకు నో
రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్ల జనాభాలో 60 శాతం ఉన్న బీసీలపై ప్రతి ప్రభుత్వం చూపిన కపట ప్రేమనే ఈ సర్కారు చూపింది. కాగితాలపై కోట్లు చూపించి… చేతల్లో అణాపైసలు కూడా వేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాగితాల్లో చూపిన కోట్లను ప్రతి మీటింగ్‌లోనూ పెద్దపెద్ద మైకుల్లో చెప్పుకునే నేతలు… వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్న నిజాన్ని దాచిపెడుతున్నారు. గత ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం బీసీలపై తీరని వివక్షత చూపుతోందని బీసీలు మండిపడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు జరిగి 7నెలలు అవుతున్నా…. ఒక్క రూపాయి కూడా బీసీలకు ఇచ్చేందుకు కృషి చేయలేదు. లక్షన్నర కోట్ల బడ్జెట్ అని గర్వంగా చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు 60 శాతం ఉన్న బీసీలకు ఒక్క రూపాయిని కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

బీసీలకు ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 3,045కోట్లు చూపించారు. ఇందులో కార్పొరేషన్, ఫెడరేషన్లు, ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు ఇలా రకరకాల వాటి కోసం ఈ నిధులను చూపించారు. బీసీల చేతి వృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యలో బీసీలకు వ్యక్తిగత రుణాలు, గ్రూప్ రుణాలు ఇచ్చేందుకు కార్పొరేషన్‌కు గత బడ్జెట్‌లో రూ.120 కోట్ల కేటాయింపులు చేశారు. ఇలా 12కులాలకు చెందిన ఫెడరేషన్లకు కూడా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.

ఒక్కరికీ రుణమందలేదు
చేతివృత్తులు కోల్పోయిన, అల్పదాయ వర్గ బీసీలకు రుణం ఇచ్చేందుకు బీసీ కార్పొరేషన్ ఉంది. దీనికి ఈ సంవత్సరం రూ.120 కోట్లు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయలేదు. మొత్తం రుణంలో లబ్ధిదారుడిది 10శాతం వాటా, బ్యాంక్ రుణం 60శాతం, కార్పొరేషన్ నుండి 30శాతం సబ్సిడీ బ్యాంక్‌కు వెళ్తుంది. ఇలా మొత్తం రుణం పొందాలంటే ఈ ముగ్గరి ప్రమేయం ఉంటుంది. కానీ గత సంవత్సరం అతి తక్కువ మందికి రుణాలు ఇచ్చినా… బ్యాంకులకు కార్పొరేషన్ల నుండి సబ్సిడీ మొత్తం అందలేదు. దీంతో బ్యాంకులు ముందు కార్పొరేషన్ నుండి సబ్సిడీ రుణం వస్తుందని చూపిస్తేనే రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. కానీ కార్పొరేషన్‌కు బడ్జెట్ రిలీజ్ అయినా దీనికంటూ ఒక వ్యవస్థ లేకపోవడంతో కార్పొరేషన్‌లో ఉండే ఉన్నతాధికారులు రుణాలు మంజూరు చేసేందుకు సిద్ధపడటం లేదు. దీంతో 2012-13 బడ్జెట్ సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సీఎం ప్రతి సమావేశంలోనూ బీసీలకు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశామని చెప్పుకుంటున్నారు తప్పా… వాస్తవంలో ఉన్న పరిస్థితిపై ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రూ.120కోట్ల బడ్జెట్‌లో ఒక్క రూపాయిని కూడా ఇప్పటికి రుణంగా ఇవ్వలేదంటే రాష్ట్రంలో ఉన్న బీసీలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కుల వృత్తులను నాశనమవుతున్న తరుణంలో బ్రతుకు వెళ్లదీసేందుకు బీసీలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని జిల్లాల్లో చేసుకోవడానికి పనులు లేక బీసీలు ఆత్మహత్యలకు కూడాపాల్పడ్డారని బీసీ నేతలంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు తామే ‘అతి’ ఎక్కువ న్యాయం చేసినట్లు చెప్పుకుంటూ ప్రతి జిల్లాలోనూ సమావేశాలు పెట్టి మరీ ఢంకా బజాయిస్తోందని మండిపడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు చేసి దాదాపు 7నెలలు గడుస్తున్నా… రుణాలు మంజూరు చేయకపోవడంపై బీసీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

ఫెడరేషన్లు ఉన్నట్లా…. లేనట్లా…
బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వమే బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఈ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు చేయడం, అవి వినియోగించకపోవడం శరామామూలే. కానీ ప్రతి సంవత్సరం కేటాయింపులు ఒక్కొక్కదానికి కోటికి మించకపోయేవి. కానీ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఫెడరేషన్‌కు రూ.5కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేసింది. ముఖ్యంగా రజక, నాయి బ్రహ్మణ ఫెడరేషన్లకు అయితే దాదాపు రూ. 93కోట్లు విడుదల చేసింది. అయితే ఈ కోట్లన్ని కేవలం కాగితాల్లోనే మూరుగుతున్నాయి.

పైసలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు…. అనూహ్య పరిణామాల మధ్య ప్రభుత్వంఒక వేల ఇచ్చినా… వాటిని ఖర్చు చేసేందుకు ఫెడరేషన్లకు పాలకమండళ్లే లేవు. మరి ఈ కేటాయింపులు ప్రతియేటా బీసీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల గురించి చెప్పుకోవడానికేనా… అని విమర్శలొస్తున్నాయి. కులాల వారీగా ఏర్పాటు చేసిన ఫెడరేషన్లకు నిధుల కేటాయింపు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రతియేటా నిధులు కేటాయింపు జరగడం, వాటిని ఖర్చు చేయలేదన్నట్లుగా చూపించడం ఫెడరేషన్లకు పరిపాటిగా మారిందని తెలుస్తోంది. వాస్తవానికి కులాల వారీగా ఉన్న ఫెడరేషన్లకు వచ్చిన నిధులను ఖర్చు చేసేందుకు ఫెడరేషన్లకు పాలకమండళ్లు ఉండాలి. అప్పుడే నిధులు ఖర్చు సాధ్యం అవుతుంది.

వచ్చిన దరఖాస్తులపై పాలకమండలి నిర్ణయం తీసుకుని రుణాలు మంజూరు చేస్తుంది. కానీ కొన్నేళ్లుగా ఈ ప్రక్రియే ఫెడరేషన్లలో జరగడం లేదు. కులాల వారీగా సభ్యత నమోదు కూడా అయినందున ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రభుత్వమే ఫెడరేషన్లకు నామినేటెడ్ పద్ధతిలో సభ్యులను, ఛైర్మన్‌ను నియమించాలని వారు కోరుతున్నారు. అలా కాకుండా అటు ఎన్నికలు నిర్వహించక… నామినే పదవులతోనైనా పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన ఆరు నెలల కాలంలోనైనా కార్పొరేషన్‌కు, ఫెడరేషన్లకు ఇచ్చిన నిధులను ఖర్చు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని బీసీలు కోరుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.