బీజేపీ పాలన ఉత్తమమైనది: నరేంద్రమోడీ

పుణె: బీజేపీ పాలన అత్యంత ఉత్తమమైనదని, సమర్థవంతమైన పాలన అందిస్తోందని బీజేపీ ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ మాట్లాడుతూ…ఈ దేశం పలు రకాల పాలనా విధానాలను చూసిందని, 2014లో ప్రజలు తాము కోరుకున్న పాలనను చూస్తారని స్పష్టం చేశారు. ఎన్‌డీఏ, జనతా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై యూపీఏ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు.

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసినా ప్రజలు తమకే ఓటేశారని తెలిపారు. అధికారమిస్తే వంద రోజుల్లో సాధిస్తామని కాంగ్రెస్ నేతలు వాగ్దానం చేసినా వాటిని నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 65 శాతం మంది యువత ఉన్నారని, వారికి ఉపాధి కల్పించడంలో యూపీఏ విఫలమైందని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వారి ఆత్మహత్యలపై ఎందుకు స్పందించదని నిలదీశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.