బీఏసీలో తెలంగాణం

అసెంబ్లీ సభా వ్యవహారాల సభా సంఘం(బీఏసీ) సమావేశంలో తెలంగాణ అంశంపైనే చర్చ జరిగింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రానున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బుధవారం జరిగిన ఈ సమావేశంలో సమావేశాలను కేవలం మూడు రోజులు మాత్ర మే నిర్వహించి మమ అనిపించుకునే ప్రయత్నం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకత్వం చేసింది. సీమాంధ్ర టీడీపీ నాయకులు కూడా మద్దతు పలికారు. సభా నాయకుడి హోదాలో హాజరైన డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహా వారం పనిదినాలు సభ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. మంత్రి ఆనం మూడు రోజులు నిర్వహిస్తే చాలని అనడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. సీఎం లేనపుడు డీప్యూటీ సీఎం మాత్ర మే సభా నాయకుడని, ఆయన చెప్పిందే ఫైనల్ అని సభ్యులంతా అనడంతో ఆనం మౌనంగా ఉండిపోయారు. వారం పనిదినాలు అసెంబ్లీని నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. సభా నాయకుడి హోదాలో ఈ సమావేశానికి రావాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ గైర్హాజరు అయ్యారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం టీడీఎల్ పీ ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని, దీనిపై సభలో చర్చించాలన్నారు. హరీశ్ వెంటనే జోక్యం చేసుకొని అంతా ఫిక్స్ అయ్యా రా? అని తెలంగాణ టీడీపీ ఫోరం ఎర్రబెల్లి దయాకర్‌రావునుదేశించి అన్నారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు మన పార్టీ సమావేశంలో నిర్ణయించుకున్నదేమిటి? మీరు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నదేమిటని గాలిని ప్రశ్నించారు.

తెలంగాణ వాళ్లు తెలంగాణ గురించి , సీమాంధ్ర వాళ్లు సీమాంధ్ర గురించి మాట్లాడాలని అనుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ కోరారు. మొదట తెలంగాణపై తీర్మానం చేసింది, ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి సోనియాకు వినతి పత్రం ఇప్పించింది మీ ఆయనేనని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్‌ఎస్ సభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలంగాణపై తీర్మానం చేయాలనగా సీపీఐ శాసన సభా పక్ష నేత గుండా మల్లేష్ బిల్లు వచ్చినప్పుడు తెలంగాణ విషయాలు మాట్లాడుదామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మినారాయణ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు చర్చించాలన్నారు. స్పీకర్ నాదెండ్ల జోక్యం చేసుకొని తెలంగాణ బిల్లు వస్తే సభకు తెలియజేసి, బీఏసీ సమావేశం నిర్వహించాక చర్చ చేపడతామన్నారు. సమావేశం అనం తరం టీడీఎల్‌పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తాము తుఫాన్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, అధిక ధరలు చర్చించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశామని ఈటెల రాజేందర్ చెప్పారు.అసెంబ్లీలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీష్‌రావు చెప్పారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ అంశంపై పోరాటం చేసిందన్నారు.

543
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.