బిల్లు ప్రతులను చించేయడం అప్రజాస్వామికం- దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్య

ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు ప్రతులను అసెంబ్లీలో చించివేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. అది అప్రజాస్వామికమైన చర్యగా పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా బిల్లుపై బీఏసీ చర్చించి నిర్ణయిస్తుందన్నారు.

బిల్లుపై అంశాలవారీగా అసెంబ్లీ చర్చించి తిప్పిపంపిన అనంతరం పార్లమెంటులో బిల్లును భారత ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ముసాయిదా బిల్లు విషయంలో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారమంతా సరిగ్గానే ఉందన్నారు. వైఎస్సార్సీపీ నేత జగన్‌ది కాంగ్రెస్ డీఎన్‌ఏ అన్నందుకు తనపై పరుషంగా స్పందిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ తేలికగా తీసుకున్నారు. ‘జగన్ నాకు కొడుకులాంటి వాడు’ అని స్పష్టం చేశారు. ఎన్డీఎతో చంద్రబాబు పొత్తు కొత్తదేం కాదన్నారు. గతంలో కూడా ఆయన బీజేపీతో పొత్తుపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.