బిల్లు ఆమోదం అయ్యేదాక అప్రమత్తంగా ఉండాలె: కేసీఆర్

తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అన్నరు. తెలంగాణ విజయం తీరాలకు చేరడం ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగబోదని, విజయ తీరాలకు చేరడం ఖాయమని అన్నారు. ఇవాళ ఆయన నాంపల్లిలోని గహకల్పలో ఏర్పాటు చేసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఎన్నో ఆటుపోట్లకు ఓర్చుకొని శ్రీనివాస్‌గౌడ్ టీజీవో సంఘాన్ని ముందుండి నడిపించారని కితాబిచ్చారు. ఇలాంటి సభలు చూసినప్పుడు కళ్లలో ఆనందభాష్పాలు వస్తుంటాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆవిర్భావమే నిదర్శనమని కేసీఆర్ అన్నారు.
సీమాంధ్ర పార్టీలు రంగులు మార్చినయి: కేసీఆర్
తెలంగాణ ఏర్పాటును సీడబ్ల్యూసీ ప్రకటించగానే సీమాంధ్ర పార్టీలు రంగులు మార్చాయని కేసీఆర్ విమర్శించాయి. ప్రకటన రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, వైఎస్ విజయలక్ష్మిలు మాట మార్చారని దుయ్యబట్టారు. సీమాంధ్రలో రోజుకు నాలుగు వందల కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని అన్నారు. ఇదేనా కలిసుందామనే నీతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫేస్ బుక్‌లో యుద్ధమే: కేసీఆర్
ఫేస్ బుక్‌లో కూడా తెలంగాణ-ఆంధ్రా యుద్దమే జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. ఫేస్ బుక్‌ను తాను చూసినపుడు తెలంగాణ, ఆంధ్రా యుద్ధ వ్యాఖ్యలే కనిపిస్తున్నాయని అన్నారు. ఆంధ్రాప్రాంతంలో ఒక్క మేధావైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు. విభజన రభసలో మతలబేంటో కనిపెట్టాలని చెప్పారు.

నష్టపోయిన వారికి కూడా పరిహారమివ్వాలి: కేసీఆర్
నష్టపోయిన వారికి కేంద్రం పరిహారం ఇవ్వదలచుకుంటే నష్టపోయిన వారికి కూడా ఇవ్వాలి అని కేసీఆర్ అన్నారు. 57 ఏళ్ల సీమాంధ్రుల పాలనలో నష్టపోయిందెవరని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో తాను మాట్లాడిందాంట్లో తప్పేమీలేదని స్పష్టం చేశారు. ‘తెలంగాణపై ప్రకటన వచ్చింది కాబట్టి గంభీరంగా ఉన్నాం. మాకు మాటలు రాకకాదు, చెప్పలేక కాదు’ అని అన్నారు. ఇక్కడ ఇరవై వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉంటే అంత మంది టూరిస్టులు ఉన్నట్టే లెక్క అని తెలిపారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు లొల్లి చేస్తున్నారని విమర్శించారు. ‘మేం తలుచుకుంటే హైదరాబాద్ పొలిమేరల్లో కూడా అడుగుపెట్టే వారుకాదు’ అని సీమాంధ్ర ఉద్యోగులనుద్దేశించి అన్నారు.

కానిస్టేబుల్‌ను చితకబాదడం సంస్కారమా?: కేసీఆర్
ఎన్జీవోల సమైక్యాంధ్ర సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌ను చితకబాదడం సీమాంధ్ర సంస్కృతా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసుందామనే నీతి ఇదేనా అని నిలదీశారు. సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర అంటే తెలంగాణ ఉద్యోగిగా శ్రీనివాస్ జైతెలంగాణ అన్నాడని, అది ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించారు. ‘మేం ఒప్పుకున్నాం కాబట్టే సభ జరిగింది. మేం తలచుకుంటే హైదరాబాద్ పొలిమేరల్లోకి కూడా అడుగు పెట్టేవారు కాదు’ అని హెచ్చరించారు. సీమాంధ్రులు ఓ వైపు కవ్విస్తూ, మరోవైపు పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతి ఆప్యాయంగా ఉంటుందని తెలిపారు. ‘ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే రాయే అన్నా తిందాం అని అంటాం. కానీ ఆంధ్రోళ్లు ఏమండి భోజనం చేసొచ్చారా?’ అని అంటారు. ఇదే వాళ్ల సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు.

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలి: కేసీఆర్
తెలంగాణ ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అది కూడా ఎలాంటి షరతులులేని హైదరాబాద్ కావాలని అన్నారు. వేరే ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించేదిలేదని పేర్కొన్నారు. పోరాటం అప్పుడే అయిపోలేదని ఇంకా ఉందని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.