బిల్లులో మార్పులు చేయండి-రాష్ట్రపతికి కేసీఆర్ వినతి

తెలంగాణ బిల్లులో పలు మార్పులు చేయాలని ప్రణబ్‌ముఖర్జీకి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. మీ ఆశీస్సులు ఉంటే ఈ చారిత్రక సన్నివేశం ప్రజాస్వామ్యయుతంగా పూర్తవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపినందుకు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిది కోసం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రణబ్‌ముఖర్జీని కేసీఆర్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు గురువారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా పది పేజీల లేఖను రాష్ట్రపతికి వారు అందించారు. తెలంగాణ బిల్లుపై తమకు ఉన్న అభ్యంతరాలను రాష్ట్రపతికి వివరించారు. విశాల ప్రజా ప్రయోజనాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలను గుర్తించి బిల్లులో అనేక అంశాలపై సవరణలు చేయాల్సి ఉందని ఆయనకు విన్నవించారు.

దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలే 29వ రాష్ట్రంగా ఏర్పాటుకానున్న తెలంగాణకు వర్తించాలని ప్రణబ్‌కు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారని, వారి ఆకాంక్షను గుర్తించాలని కోరారు. అనేక అంశాలపై తెలంగాణ ప్రజలకున్న అభ్యంతరాలను కేసీఆర్ లేఖలో రాష్ట్రపతి ముందుంచారు. ఆలిండియా సర్వీస్‌లకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ఏపీలో పనిచేసి రిటైర్ అయితే హైదరాబాద్ ట్రెజరీ నుంచే పెన్షన్లు పొందుతారని, వారి స్థానికత ఆధారంగా పెన్షన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పని చేయదల్చుకున్నారో ఆప్షన్లు ఇస్తూ బిల్లులో పేర్కొన్నారని, దానిని సమూలంగా సవరించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణలో పనిచేస్తున్నవారిలో మూడొంతుల మంది సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని చెప్పారు. గిర్‌గ్లానీ సహా అనేక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయని లేఖలో ప్రస్తావించారు.
ప్రణబ్‌కు ఇచ్చిన లేఖలోని ముఖ్యాంశాలు
ఉద్యోగాల్లో ఉల్లంఘనలు:
-ప్రాంతీయ అధికారులను హెచ్‌వోడీలుగా గుర్తించి, ఇతర ప్రాంతాలకు లోకల్ క్యాడర్‌లలో నియామకాలు చేశారు.
-డిప్యుటేషన్ విధానం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారు.
-20, 30, 40 శాతం ఓపెన్ కోటాలో పూర్తిగా స్థానికేతరులను నియమించారు.
-జోనల్ పోస్టులను స్టేట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసి సీమాంధ్రులతో భర్తీ చేశారు.
-అర్బన్, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో ప్రాధమిక పదోన్నతుల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు.
-నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చి స్థానికుల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టారు.
-హెచ్‌వోడీల సంఖ్యను పెంచి స్థానిక ఉద్యోగాల రిజర్వేషన్లను కొల్లగొట్టారు.
ఉమ్మడి రాజధాని
-దేశంలో 28 రాష్ట్రాల్లో లేని విధంగా కొత్త రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని, గవర్నర్‌కు శాంతి భద్రతల అప్పగింత వంటి అంశాలు ప్రవేశపెట్టడం సబబు కాదు. ఈ క్లాజును మార్చాలి. గవర్నర్ పరిధిలో శాంతి భద్రతలు ఉంటే ప్రభుత్వాల ప్రాధమిక విధులను, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను అగౌరవ పర్చినట్లే.
ఉమ్మడి హైకోర్టు
-తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ప్రజలు కోరుకుంటున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఆర్టికల్ 214 ప్రకారం ఏర్పాటు చేయాలి.
-ఉమ్మడి కోర్టు వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. గతంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాల్లో కొత్త హైకోర్టుల ఏర్పాటు తక్షణమే జరిగింది.
గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు:
-గవర్నర్‌కు విశేష అధికారాలు కల్పించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత, స్వేచ్చా స్వాతంత్రాలను కాపాడుతుంది. కనుక ముసాయిదా బిల్లులోని సెక్షన్ 8లో పేర్కొన్న అంశాలను తొలగించాలి.
ఉద్యోగులు, పెన్షనర్ల విభజన:
-ముసాయిదా బిల్లులో పేర్కొన్న విధంగా జనాభా ఆధారంగా పెన్షనర్లను పంపిణీ చేయటం సరికాదు. ఈ విధానం అక్రమ ఉద్యోగులను అధికారికం చేసినట్లవుతుంది. ఈ విధానంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాపై పెన్షనర్ల భారం పడుతుంది. తెలంగాణలో 58,972 మంది అక్రమ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు 1985లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆ మేరకు 610 జీవో ద్వారా వారిని స్వస్థలాలకు పంపించాలన్న నిర్ణయం ఇంకా అమలు కాలేదు. వారందరికీ తెలంగాణ ఖజానా నుంచి పెన్షన్లు చెల్లించటం న్యాయమా? వారి స్థానికత ఆధారంగానే ఆయా ప్రభుత్వాలు వేతనాలు, పెన్షన్లు చెల్లించేలా చూడాలి.
విద్యుత్ రంగం:
-తెలంగాణకు ప్రత్యేకంగా విద్యుత్‌రంగంలో కలిగే అన్యాయాలను తొలగించాలి. ఈ బిల్లులో పవర్ కార్పొరేషన్ వివరాలు లేవు. కేంద్రం ప్రత్యేక పవర్ కార్పొరేషన్లు తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ విధానాలను అనుసరించాలి.
అప్పుల పంపకం, ఇతర ఆస్తులు:
-రాష్ట్ర విభజనతో ఆప్పుల భారం రాష్ట్రంపై పడనుంది. ఇందుకు ఆస్తులపై వెచ్చించిన పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవాలి. సీమాంవూధలోని డ్యామ్‌లు, కాలువలు, పవర్ స్టేషన్లు, రోడ్లు, హౌసింగ్‌లకు వెచ్చించిన నిధులను లెక్కించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతో తలసరి అప్పు పెరిగింది. 1956కు ముందు 20% నిధులు ఇరిగేషన్ ప్రాజెక్టులకు 20% నీటిపారుదల రంగానికి, 30% విద్యుత్‌కు, 35% నిధులు పేదరిక నిర్మూలనకు వెచ్చించారు. తెలంగాణలో మొత్తంగా 29%గా ఉన్న లోటును బిల్లులో 42%గా చూపారు.
నీటి వనరుల నిర్వహణ:
-కృష్ణా బేసిన్‌లో తెలంగాణవాటాకు గండి కొడుతూ నీటిని తరలించుకు పోయేందుకు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు. వాటిని నిలువరించాలి. గోదావరి నదీ జలాల నిర్వహణకు ప్రత్యేక బోర్డు అవసరం లేదు. నదీ జలాల నిర్వహణను సీడబ్ల్యుసీ చూసుకుంటుంది. ప్రాణహిత చేవెళ్లకు తక్షణమే జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలి. కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు. వాటిని నిలువరించాలని కోరారు.
-తెలంగాణ ప్రజల అస్తిత్వం, స్వయం పాలన కోసం ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో చరిత్రాత్మకంగా అహింసాయుత ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకుంటున్నాం. మా నినాదం నీళ్ళు, నిధులు, నియామకాలు. మా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు మీరు అశీస్సులు అందజేస్తూ.. పైన వెల్లడించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులో అవసరమైన మార్పులు చేయాలి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.