బిల్లుపై ఇవీ తెలంగాణ ఆందోళనలు

ఎట్టకేలకు తెలంగాణ వచ్చేస్తున్నదన్న సంతోషాల నడుమే.. కోరుకున్న స్థాయిలో సంపూర్ణ తెలంగాణ రావడం లేదన్న ఆందోళన తెలంగాణ ప్రాంత నాయకత్వంలో, ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రజలు కోరుకున్న అనేక అంశాలను బిల్లులో పొందుపర్చలేదని తెలంగాణ ప్రాంత నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను దీర్ఘకాలంలో దెబ్బతీసే పలు ప్రమాదకర అంశాలు కేబినెట్ ఆమోదించిన బిల్లులో ఉండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల ఉద్యమం సాగింది సంపూర్ణ తెలంగాణ కోసమేనని వారు స్పష్టం చేస్తున్నారు.

savaranlu ఒక సమస్యను పరిష్కరిస్తూనే మరికొన్ని పరిష్కారం కాలేని సమస్యలను సృష్టించేటట్లు కేంద్రం వ్యవహరిస్తోందని పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. అదే సందర్భంలో తెలంగాణకు రావాల్సినవి సాధించుకునేందుకు మరోసారి ఉధృత స్థాయి ఉద్యమానికి సిద్ధపడతామని ప్రకటిస్తున్నారు. విభజన బిల్లు విషయంలో తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నదో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా అనేక మంది తెలంగాణవాదులు, నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కేంద్రానికి నివేదికల రూపంలో అందజేశారు.

తెలంగాణ పోరాటం సాగిన అంశాల సమాహారాలే అవి. కానీ.. వాటిని కేంద్రం నామమాత్రంగానే పట్టించుకున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్రం రాష్ర్టానికి పంపిన బిల్లునే ఫైనల్ చేయడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న వెనుకబాటు, వివక్షలను తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా రుద్దే ప్రయత్నం కేంద్రం చేతల్లో కనిపిస్తున్నదని వారు మండిపడుతున్నారు. టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే సందర్భంలోనైనా తెలంగాణవాదుల అభ్యంతరాలను పరిశీలించి, సవరణలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు అభ్యంతరకరమైన.. తెలంగాణ రాష్ర్టానికి కావాల్సిన పలు అంశాలను వారు మరోసారి కేంద్రం దృష్టికి తెస్తున్నారు.

ఇవీ ఆ అంశాలు…
ఖమ్మం మొత్తం తెలంగాణకే
తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురయ్యే గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కలుపుతున్నారు. దీని వల్ల మొత్తం ఖమ్మం జిల్లా అస్తిత్వమే దెబ్బతినే అవకాశం ఉంది. ఇది స్థానిక గిరిజనులను ముంచడానికి సీమాంధ్ర పెద్దలు రచించిన కుట్రగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. పైగా భద్రాచలం విశిష్టత దెబ్బతింటుంది. భద్రాచలం, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో ఎవరు భాగస్వాములు కావాలనే ప్రశ్న వచ్చినప్పుడు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు చేతులెత్తేసే అవకాశాలున్నాయి. ఈ సమయంలో చివరికి నష్టపోయేది ఖమ్మం జిల్లానే. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచి పోలవరం కట్టుకోవడానికి ఆస్కారం ఉన్నా సీమాంధ్రులు మాత్రం మొండికేస్తున్నారు. పోలవరం డిజైన్‌ను మార్చుకుంటే ఒక్క గ్రామాన్ని కూడా ముంచకుండానే ప్రాజెక్టు కట్టుకోవచ్చని తెలంగాణ మేధావులు అంటున్నారు. అయినప్పటికీ కేంద్రం సీమాంధ్రుల ఒత్తిళ్లకు లొంగిందనే విమర్శలున్నాయి.

తెలంగాణ కోరుతున్నది :
ఖమ్మం జిల్లాను పూర్తిగా తెలంగాణకే ఇవ్వాలి. దీని వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినట్లు అవుతుంది. ఖమ్మం జిల్లాలోని సహజవనరులతో తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురికాకుండా గిరిజనులను కాపాడటానికి అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు డిజైన్‌ను మార్పించడానికి అవకాశం ఏర్పడుతుంది.

పదేళ్లు ఉమ్మడి అంటే దోపిడీ కొనసాగింపే
ఉమ్మడి రాజధాని 10ఏళ్లు ప్రతిపాదించిన కేంద్రం చివరికి దానికే ఓటేయడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తాము ఎవరి నుండి విముక్తి కోరుకున్నామో వారితో మరో 10ఏళ్లు కలిసి ఉండాలనే ప్రతిపాదనకే కేంద్రం మొగ్గుచూపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రాజధానిని ఎంత శరవేగంగా నిర్మించుకుంటున్నారో అంతే వేగంగా సీమాంధ్ర రాజధానిని నిర్మించుకోవడానికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఎందుకు నిర్ణయించారో అర్థం కావడంలేదని తెలంగాణవాదులు అంటున్నారు. దీనిపై తెలంగాణవాదుల్లో ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు. వాస్తవానికి తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకించిన అంశాల్లో ఇదొక ముఖ్యమైన అంశం. అయినా దీనిపై కనీసం పరిశీలించకపోవడం చూస్తే సీమాంధ్రకు కేంద్రం వెన్నుదన్నుగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ కోరుతున్నది :
హైదరాబాద్ అనేది తెలంగాణ ఆత్మ. అలాంటి హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందంటే ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు. ఉమ్మడి రాజధాని అనేది కేవలం సీమాంధ్ర ప్రాంతం ప్రభుత్వ కార్యకలాపాలు సాగించుకోవడానికి మాత్రమే. అటువంటప్పుడు మొత్తం గ్రేటర్ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవడం సరైంది కాదు. కేవలం ఖైరతాబాద్ మండలానికే ఉమ్మడి రాజధాని పరిమితం చేయాలి.

గవర్నర్‌కే అధికారాలు తెలంగాణకు అవమానం
తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఏ మాత్రం సంతోషం లేని విషయం గవర్నర్‌కు శాంతిభద్రతల అంశంపై పూర్తి అధికారం ఇవ్వడం. దీనిపై తెలంగాణవాదులు మొదటి రోజునుండి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ జేఏసీతో పాటు చాలా మంది దీనిపై కేంద్రానికి, ప్రధానికి లేఖలు, నివేదికలు అందజేశారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం తెలంగాణవాదుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాజకీయ సమాజం కూడా గవర్నర్‌కు అధికారాలు అంటే పరిపాలన వ్యవస్థలో గవర్నర్ తలదూర్చడమే అవుతుందని, కొన్నిసార్లు రాజ్యాంగబద్ధంగా న్యాయం చేయలేనప్పుడు పరిధులను దాటాల్సి వస్తుందని, అప్పుడు గవర్నర్ అడ్డుపడితే ప్రజలకు నష్టం చేసినట్లు అవుతుందనే అభిప్రాయం నాయకుల్లో కూడా ఉంది.

తెలంగాణ కోరుతున్నది :
దేశంలోని ప్రస్తుతం ఉన్న 28 రాష్ర్టాలు ఎలాంటి సంపూర్ణ అధికారాలను అనుభవిస్తున్నాయో కొత్తగా ఏర్పడే 29వ రాష్ట్రమైన తెలంగాణకు కూడా అలాంటి అధికారాలే ఇవ్వాలి. పాలనాపరమైన సౌలభ్యం ప్రభుత్వానికి కలగాలన్నా అధికారాలు ముఖ్యమంత్రి వద్ద ఉండాలిగానీ గవర్నర్ వద్ద ఉండటం సమంజసం కాదు. సీఎంకు పోలీస్ విభాగానికి సంబంధాలు లేకుంటే రాష్ట్రంలో ఏర్పడే అశాంతికి గవర్నరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది మంచిది కాదు.

వెంటనే హైకోర్టును ప్రకటించాలి
ప్రస్తుతం ఉన్న హైకోర్టును పదేళ్లపాటు ఇరు రాష్ర్టాలు వినియోగించుకోవాలనే ప్రతిపాదన ఏమాత్రం అంగీకారం కాదు. తెలంగాణతో పాటే తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని ఇక్కడి నాయకత్వం కేంద్రం బిల్లును తయారుచేసినప్పటి నుండే చెబుతున్నది. హైదరాబాద్ రాష్ర్టానికి హైకోర్టు 18వ శతాబ్దంలోనే ఉంది. కానీ ఇప్పుడు విభేదాలతో విడిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణకు న్యాయం లభించదు. ఫలితంగా.. హైకోర్టులేని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాతే నిర్ణయమని కేంద్రం చెబుతోంది. త్వరలోనే ఎన్నికలు వస్తున్నందున తర్వాత ఏర్పడే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అన్నది అనుమానమే.

తెలంగాణ కోరుతున్నది :
ఈ బిల్లులోనే తెలంగాణకు విడిగా హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలి. ప్రస్తుతం ఉన్న హైకోర్టులో తెలంగాణ నిష్పత్తి 42శాతం ప్రకారం ఉద్యోగులు, న్యాయమూర్తులు లేరన్నది సుస్పష్టం. దీన్ని సరిచేసేందుకు ఇక్కడ విడిగా హైకోర్టు ఉండాలి. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఎలాగైతే బిల్లులో పొందుపరిచారో.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పొందుపర్చాలి.

జనాభా ప్రాతిపదిక అంటే అప్పుల కుప్పలోకే
జనాభా ప్రాతిపదిక ఆస్తులు, అప్పుల కేటాయింపు అనేది తెలంగాణను అప్పులకుప్పలో దింపడమే అవుతుంది. ఈ పద్ధతిలో 42శాతం అప్పులు తెలంగాణ భరించాల్సి వస్తుంది. దీని వల్ల కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం కొన్నేళ్ల పాటు అప్పులతోనే సావాసం చేయాల్సి వస్తుంది.

తెలంగాణ కోరుతున్నది :
ప్రాజెక్టుల వారీగా తెచ్చిన అప్పులు, వాటిని ఎక్కడ ఖర్చు చేశారు? అన్నదాని ప్రకారం అప్పులను పంచాలి. ఇలా చేస్తే ప్రస్తుతం రాష్ర్టానికున్న అప్పుల్లో కేవలం 25శాతం మాత్రమే తెలంగాణకు వస్తాయి. నిజాంకు చెందిన హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉంది. దీన్ని కేంద్రం తీసుకుని కొంత స్థాలాన్ని రాష్ట్ర ప్రభత్వానికి కేటాయించింది. ఇందులోనే ఆంధ్రాభవన్ నిర్మించారు. దీన్నితెలంగాణకే పూర్తిగా ఇవ్వాలి.

ఉద్యమం కీలక డిమాండే ఉద్యోగాలు
తెలంగాణ ఉద్యమం సాగింది.. ఆ మాటకొస్తే మొదలైందీ ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగానే. అలాంటి ముఖ్యమైన అంశంలో కేంద్రం తగిన విధంగా వ్యవహరించలేదు. ఉద్యోగుల బదిలీ, పెన్షనర్ల భారం వంటి అంశాల్లో కేంద్రం జనాభా ప్రాతిపదికకే మొగ్గు చూపింది. దశాబ్దాలుగా నీళ్లు, నిధులు, నియామకాల్లో జనాభా ప్రాతిపదిక ఏనాడూ అమలుకాలేదు. కానీ.. విభజన సమయంలో ఈ ప్రాతిపదిక ఎందుకు? సీమాంధ్ర నుంచి అక్రమంగా వచ్చిన అనేక ఉద్యోగాలు కొట్టేశారు? అలా ఉద్యోగాల్లో స్థిరపడినవారు పదవీ విరమణ చేస్తే.. వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలంగాణ నెత్తిన ఎందుకు?

తెలంగాణ కోరుతున్నది :
స్థానికత, మొదటి పోస్టింగ్ ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలి. పెన్షనర్లను కూడా ఇదే పద్ధతిలో కేటాయించాలి. ఉద్యోగులకు ఎలాంటి అప్షన్లు ఇవ్వకుంటేనే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

బోర్డులను తొలగించాలి
వాస్తవానికి గోదావరి నదిపై రెండు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కృష్ణాపై మాత్రమే అభ్యంతరాలు ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంతో సంబంధం లేని రాయలసీమకు ఈ నది నీటిని తీసుకెళ్లి ప్రాజెక్టులు కడుతున్నారు. దీని వల్ల దిగువన ఆంధ్రకు, ఎగువన ఉన్న తెలంగాణకు నీటి కేటాయింపుల్లో వాటా లభించడం లేదు. అదే సమయంలో బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా పెద్ద ఎత్తున ఇబ్బందులు రానున్నాయి.

తెలంగాణ కోరుతున్నది :
బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రతిచిన్నపనికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి భారమే అవుతుంది. అదే సమయంలో అడ్డంకులను తొలగించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణకు ఈ పరిణామాలు ఏమాత్రం హితం కావు. కనుక ప్రస్తుతం ప్రాజెక్టులకు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలి. సీమాంధ్రకు వరప్రదాయనిగా మారనున్న పోలవరంలాగే తెలంగాణను పచ్చగా చేసే చేవెళ్లపాణహితతోపాటు.. పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా ఇవ్వాలి.

పదేళ్లు ఉమ్మడి విద్య
సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలోనే నిరక్ష్యరాస్యత ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం అస్యరాస్యతను పెంచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించుకునేందుకు అవకాశం లేకుండా కేంద్రం ప్రతిపాదనలు ఉన్నాయి. తమదికాని చరిత్రను ఇన్నాళ్లూ చదువుకున్న తెలంగాణ విద్యార్థిలోకం ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా అదే విద్యవిధానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంట్రెన్స్‌లు, సీట్ల కేటాయింపు ప్రస్తుత విధానంలోనే అనడంపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యలో తెలంగాణకు న్యాయమైన వాటా లభిస్తున్నా.. మెడికల్ విద్యలో మాత్రం తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటోంది. లోక్‌ల్ స్టడీ సర్టిఫికెట్లు తెచ్చుకుని హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో సీట్లు కొట్టేస్తున్నట్లు ఇప్పటికే అనేక సందర్భాల్లో వెల్లడైంది.

తెలంగాణ కోరుతున్నది
పదేళ్లు ఉమ్మడి విద్యను ఉపసంహరించాలి. ఒకటి నుంచి మూడేళ్ల పరిమితితో దీనిని సరిపెట్టాలి.

మరికొన్ని అభ్యంతరాలు
తెలంగాణ ప్రజలకు ఆమోదంకాని, వారు అడిగిన వాటిని కాదన్న మరికొన్నింటిలో ప్రధానంగా శంకర్‌పల్లి, నేదునూరు విద్యుత్ ప్లాంట్లకు నిధులు, గ్యాస్ కేటాయింపులతోపాటు, సింగరేణి బొగ్గు కేవలం తెలంగాణకే వినియోగించాలని తెలంగాణ సమాజం కోరినా పట్టించుకోలేదు. ఈ రెండింటినీ అంగీకరిస్తేనే భవిష్యత్తు తెలంగాణ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోగలుతుంది. తెలంగాణలో పశువైద్యవిశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా యూనివర్సిటీ, చేనేత రంగం విస్తృతంగా ఉన్న కరీంనగర్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు కూడా కేంద్రం మొండిచెయ్యే చూపింది. వీటిని సవరిస్తూ.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.