బిల్లుపెడితే సంబరం.. లేకుంటే సమరం-సుష్మా స్వరాజ్

వచ్చే వింటర్ సెషన్స్ లో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా.. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టకపోతే కోదండరాంతో కలిసి కొట్లాడుతానని లోక్ సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నరు.  తెలంగాణ ప్రజలను మోసం చేస్తే కాంగ్రెస్‌కు బుద్ది చెప్పేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.  గతంలో నేను వచ్చినప్పుడు తెలంగాణలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు… మనసులో ఓ వైపు సంతోషం ఉన్నా.. మరోవైపు సందేహం ఉంది. గతంలో తెలంగాణ ప్రజలను ఎన్నో సార్లు మోసం చేశారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించిన వెంటనే అప్పట్లో వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ మోసం చేస్తారేమో అనే అనుమానం ఉంది. సీడబ్ల్యూసీ ప్రకటన చేసి 60 రోజులైనా అడుగు ముందుకు పడలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించి తీరుతుంది. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి. సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం బిల్లును ప్రవేశపెడితే బీజేపీ బేషరతుగా మద్దతిస్తుంది.

వచ్చే రెండు నెలల్లో తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం అసాధ్యమేమి కాదు. చుక్క రక్తం చిందకుండా మా పార్టీ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం దృష్టి పెడితే ఇక్కడ కూడా శాంతియుతంగా సమస్య పరిష్కరించవచ్చు. ప్రస్తుతం ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీడబ్ల్యూసీ తీర్మానం ఒప్పుకున్న సీఎం ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. విజయం లభించినప్పుడు వినయం ప్రదర్శించాలి. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి. ఇది ప్రాంతాల మధ్య విభజన మాత్రమే కానీ ప్రజల మధ్య కాదు. తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకున్నదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు తమ మద్దతు ఉంటుంది. తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్తామని కలలో కూడా ఊహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.

ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు కలిసిన తర్వాత లేనిపోని అపోహలు ప్రచారం చేశారు. చంద్రబాబు రాజ్‌నాథ్‌నే కాదు.. ఇతర పార్టీల నేతలను కలిశారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదు. బాబు కలిసినంతా మాత్రాన తెలంగాణపై వెనక్కి తగ్గం. తెలంగాణకు అండగా బీజేపీ ఉంటుంది. ఇక ముందూ ఉంటుంది. పాలమూరు వలసలను ఆరికట్టాలి. ఉపాధి లేక పాలమూరు ప్రజలు వలసలు పోతున్నారు. సాగు ఎక్కువయ్యేందుకు చర్యలు తీసుకోవాలి. తాము అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. తెలంగాణ కళ నిజమైన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోతాం. కష్టించి పనిచేసే పాలమూరు ప్రజలు తెలంగాణను అభివృద్ధి చేసి తీరుతారు. రెండు నెలల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విజయోత్సవ సభలు జరుపుతాం.. లేదంటే ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడి ప్రజల కోసం బీజేపీ పాటు పడుతుందన్నారు. ప్రసంగం ముగించే ముందు జై తెలంగాణ, జై సీమాంధ్ర నినాదాలను సుష్మా చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.