బిల్లుకు పూర్తి మద్దతిస్తాం- కేసీఆర్‌కు అజిత్‌సింగ్, సురవరం హామీ.

బీజేపీ మద్దతుపై కేసీఆర్ భరోసా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 :తెలంగాణ బిల్లుకు ఢిల్లీలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిశారు. తాము తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇస్తామని వారు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మొదటి నుంచి పూర్తి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో పునరుద్ఘాటించారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని, బిల్లుపై అనుకూలంగా ఓటేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కొనసాగించారని కొనియాడారు.

kcrsuvarnaతాను ఏడేళ్ల క్రితం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యానని గుర్తుచేశారు. నేను ఇప్పుడు తెలంగాణకు మద్దతునిస్తా. రేపటినాడు ఉత్తరప్రదేశ్ విభజనకు మీరు సహకరించాలి అని ఛలోక్తి విసిరారు. దశాబ్దకాలంగా అజిత్‌సింగ్ తెలంగాణకు మద్దతుగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రధాని నివారించినా ప్రత్యేక విమానంలో బహిరంగ సభలకు హాజరయ్యారని చెప్పారు. మద్దతు కొనసాగుతుందని చెప్పిన అజిత్‌సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని, ఆ విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని చెప్పారు. సోమవారం అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

సీమాంధ్ర నేతలు చర్చకు సహకరించాలి : సురవరం
రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌కు కాకుండా.. సీమాంధ్రకు న్యాయం జరిగేలా బిల్లులో సవరణలకు తాము పూర్తిగా సహకరిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సీమాంధ్ర నేతలను ఉద్దేశించి చెప్పారు. బిల్లుపై మద్దతు కోరేందుకు తనను కలిసిన కేసీఆర్ బందంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా గందరగోళం సష్టించకుండా, పూర్తిస్థాయిలో సహకరించి, తమ డిమాండ్లను సాధించుకోవాలని వారిని కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని అన్నారు.

పరస్పర విమర్శలతో కాలయాపన చేయవద్దని హితవు పలికారు. అసెంబ్లీ తీర్మానం చేసిందనే విషయంలో స్పష్టత లేదని సురవరం తెలిపారు. గందరగోళ వాతావరణంలో మూజువాణి ఓటుతో ప్రకటించడం సరికాదన్నారు. అఖిలపక్షంలో తెలంగాణ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని, ఫైనాన్షియల్ బిల్లు తర్వాత తెలంగాణ బిల్లు వరుసలో ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు త్వరలోనే నెరవేరుతాయని తాను విశ్వాసంతో ఉన్నానని చెప్పారు. రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ మాట్లాడుతూ మద్దతు పలికిన సీపీఐ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ బందంతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఏబీ బర్దన్, ఎంపీ డీ రాజా కూడా పాల్గొన్నారు. రాజా అఖిలపక్షానికి హాజరై.. అదే సమయానికి కార్యాలయానికి చేరుకుని.. కేసీఆర్ బందంతో జరిగిన భేటీలో పాల్గొన్నారు.

అఖిలపక్షంలో సుష్మ వాఖ్యలపై వీరు చర్చించినట్లు తెలిసింది. మంగళవారం జరిగే బీఏసీ తెలంగాణ విషయంలో సీపీఐ మాట్లాడే విషయాలను వివరించి.. కేసీఆర్ బందానికి సీపీఐ నాయకులు భరోసా కల్పించినట్లు సమాచారం. చర్చనుంచి బయటికి వచ్చిన సురవరం.. భారత రాజ్యాంగం పుస్తకాన్ని తీసుకుని మళ్లీ భేటీలో పాల్గొన్నారు. ఆర్టికల్ 3కు సంబంధించిన విధివిధానాలపైనా వారు చర్చించారని, బిల్లుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా తమ వంతు కషి చేస్తామని సీపీఐ నేతలు హామీ ఇచ్చారని తెలిసింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.