బిల్లుకు జైకొట్టిన టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, జనవరి 23 :రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు తెలంగాణ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిల్లు వెంటనే పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇక ఒకరిద్దరు మినహా సీమాంధ్ర సభ్యులంతా బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేల ప్రసంగాల జోరు సాగింది. అసెంబ్లీ సమావేశాల గడువు గురువారంతో ముగియనున్నట్లు భావించి ప్రతి ఎమ్మెల్యేలకు 2-3 నిమిషాల సమయాన్ని కేటాయించి అభిప్రాయాలను తెలుపాలని సభాపతి సూచించారు.
members దీంతో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలను సభలో వెల్లడించారు. రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్, నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటస్వామి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి సభలో ఆకర్షణగా నిలిచారు. సీమాంధ్రకు ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, శ్రీధర్ కష్ణారెడ్డి, టీవై దాస్, రాజు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. సభలో గొంతులను నొక్కుతున్నారని సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్ళి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో భట్టి సభను కాసేపు వాయిదా వేశారు. బిల్లుపై సభ్యుల అభిప్రాయాలివి..

వ్యతిరేకం కాదు : రౌతు సూర్యప్రకాష్, రాజమండ్రి
నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. అనుకూలమే. నా బిడ్డకు తెలంగాణ పెళ్ళి సంబంధాన్ని చేశాను. సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా ఉన్నందున విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నాను.పనికిమాలిన విషయాలపై సభా సమయాన్ని వథా చేసి, కీలక బిల్లుపై సమయమివ్వకపోవడం దారుణం.

టీఆర్‌ఎస్ వల్లే బిల్లు: వెంకటస్వామి, నందికొట్కూరు
టీఆర్‌ఎస్ 13 సంవత్సరాలుగా చేసిన నిరంతరం పోరాట కషి వల్లే అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సాగుతోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా. శ్రీశైలం ప్రాజెక్టులో భూములను కోల్పోయి చేసిన త్యాగాలు వథా అవుతున్నాయి.

సోనియా కు ధన్యవాదాలు: క్రిస్టినా లాజరస్, నామినేటెడ్ ఎమ్మెల్యే
రాష్ట్ర విభజన బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవ తీసుకోవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా. ఆమె ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ర్టాలు ఏర్పడటం గ్రేట్‌ఫుల్. ఈ రెండు రాష్ర్టాల్లో ఆంగ్లో ఇండియన్ల సమస్యలను పరిష్కరించాలి. క్రిష్టియన్ మైనారిటీల అభ్యున్నతికి కషి చేయాలి.

తెలంగాణను ఎవరూ ఆపలేరు:అన్నపూర్ణమ్మ, ఆర్మూర్
సునామీని అడ్డుకోనట్లే తెలంగాణను ఎవరూ ఆపలేరు. బిల్లుపై సీఎం తీరు బాధాకరం. అన్ని ఒప్పందాలు తుంగలో తొక్కినందునే తెలంగాణలో ఉద్యమం కెరటంలా లేచింది. జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధిస్తోంది. బిల్లును సంపూర్ణంగా మద్దతునిస్తున్నా. శ్రీరాంసాగర్ నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకోవాలి. ఆర్మూర్‌లో పసుపు పరిశోధన బోర్డును ఏర్పాటు చేయాలి. బిల్లుకు సీమాంధ్రులు, సీఎం సహకరించాలి.

ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళు చాలు: ఉమామాధవరెడ్డి, భువనగిరి
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళు చాలు. శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలోకి పెట్టొద్దు. హైకోర్టును ఉమ్మడిగా ఉంచకుండా వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. బిల్లును పూర్తిగా మద్దతునిస్తున్నా. అన్ని రంగాల్లో వివక్ష వల్లే తెలంగాణ ఉద్యమం బలపడింది. తెలంగాణ కల సాకారమవుతుంటే సీమాంధ్రులు అడ్డుపడటం శోచనీయం.

బలవంతంగా కలిసుంటామనడం చిత్రం : కొప్పుల ఈశ్వర్, ధర్మపురి
తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బలవంతంగా కలిసి ఉంటామనడం ఎక్కడా చూడలేదు. ఇది చిత్రంగా ఉంది. ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధన, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో బిల్లుపై చర్చ సాగుతోంది. ఈ బిల్లును సంపూర్ణంగా మద్దతునిస్తున్నా. ఆరు దశాబ్దాల పోరాట ఫలించింది. చిన్న రాష్ర్టాలతోనే అభివద్ధి వేగంగా సాగుతుంది.

తెలంగాణతోనే గిరిజనాభివద్ధి: కవిత, మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రంతోనే గిరిజనుల అభివద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ఏర్పాటుతోనే గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ దేవత. ఉమ్మడి రాష్ట్రంలో 1/70 చట్టానికి తూట్లు పొడిచారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపారు. బిల్లును సమర్థిస్తున్నా.

తెలంగాణతోనే గిరిజనుల కళ్ళల్లో ఆనందం: బాలూనాయక్, దేవరకొండ
తెలంగాణ రాష్ట్రంతోనే గిరిజనుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ బిల్లును సంపూర్ణంగా మద్దతునిస్తున్నా. అమరులకు జోహర్లు. సమైక్య పాలనలో గిరిజనుల ఆడపిల్లలను అమ్ముకునే దౌర్భాగ్యాన్ని చూశాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో దేవరకొండ ప్రాంతంలోని గిరిజనులు భూములను కోల్పోయారు. పరిహారం చెల్లింపులో వివక్షను చూపారు.

సీమాంధ్రుల దుష్ప్రవర్తన వల్లే ఉద్యమం: కిష్టారెడ్డి, నారాయణఖేడ్
తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రజల పట్ల సీమాంధ్ర మంత్రుల దుష్ప్రవర్తన వల్లే తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులే అవకాశమిచ్చారు. మేము కలిసి ఉండాలని అనుకున్నా వారే రెచ్చగొట్టారు. బిల్లును సంపూర్ణంగా మద్దతునిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ఐదు దశాబ్దాల కిందటే ఉద్యమంలో పాల్గొన్నా.

తెలంగాణను స్వాగతిస్తున్నా: కొత్తకోట దయాకర్‌రెడ్డి, మక్తల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నా. బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నా. ఈ బిల్లును సీమాంధ్ర టీడీపీ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సహకరించాలి. బిల్లును వ్యతిరేకించకుండా మీ సమస్యలు చెప్పండి. తెలంగాణ ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పాటవుతోంది.

అడ్డుకుంటే గొంతు నొక్కినట్లే: మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్
తెలంగాణను అడ్డుకోవడమంటే ఈ ప్రాంత ప్రజల గొంతును నొక్కినట్లే. బిల్లును సంపూర్ణంగా మద్దతునిస్తున్నా. అప్పుల పంపకం జనాభా ప్రాతిపదికన ఒప్పుకోం. నిధుల ఖర్చు ఆధారంగా చేయాలి. సీఎం హోదాలో రాజ్యాంగా విరుద్ధంగా మాట్లాడినందున కిరణ్ వివరణ ఇవ్వాలి.

బిల్లును వ్యతిరేకించడం బాధాకరం : భిక్షపతిగౌడ్, ఆలేరు
రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించడం బాధాకరం. అన్ని రంగాల్లో వివక్ష వల్లే తెలంగాణ ఉద్యమం ఉధతమైంది. విభజన ఒక్క రోజులో జరగలేదు. సుధీర్ఘ పోరాట ఫలితంగా సాధ్యమైంది. బిల్లుకు మద్దతును ప్రకటిస్తున్నా.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.