బాబు వ్యాఖ్యలపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు

టీడీపీ ప్రెస్ మీట్లకు టీన్యూస్, సాక్షి మీడియాను బహిష్కరిస్తమనడంపై టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ,  తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (తెమ్జా) అధ్యక్ష, కార్యదర్శులు  సతీష్‌ కమాల్‌,  ఆది మండిపడ్డరు. చంద్రబాబు మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరును తెమ్జా నేతలు దుయ్యబట్టిన్రు. టీడీపీకి సీమాంధ్ర పైత్యం తలకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. మీడియాపై బ్యాన్‌ విధించడం తెలివితక్కువతనమని విమర్శించిన్రు.

నియంతృత్వమే: టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ

ప్రజాస్వామ్యంలో తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పత్రికలను, చానళ్లను బహిష్కరించడం మంచిది కాదని తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఇది ముమ్మాటికీ నియంతృత్వ పోకడే అని ఓ ప్రకటనలో తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరడ్డి తనకు ఇష్టం లేని పత్రికలను ఆ రెండు పత్రికలని విమర్శించారే తప్ప వాటిని ఏనాడూ బహిష్కరించే ఆలోచన చేయలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇష్టం లేని విషయాలను కూడా చూడాలి, భరించాలన్నారు. ఇష్టం లేని పత్రికలను బహిష్కరించడమంటే అది ముమ్మాటికీ నియంతృత్వ ధోరణేనని అభివూపాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ, మీడియా రెండు స్తంభాలుగా ఉన్నాయని, అందులో శాసన వ్యవస్థలో పనిచేసే ఓ రాజకీయ పార్టీ, మరో మూలస్తంభమైన మీడియా వైపు వేలెత్తి చూపడం సరికాదని చెప్పారు.

తన చావును తాను కొని తెచ్చుకోవడమే: రమణ
తెలంగాణపై, తెలంగాణ మీడియాపై చంద్రబాబు చూపిస్తున్న అప్రజాస్వామిక ధోరణిని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఎంవీ రమణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను బహిష్కరించడం అంటే టీడీపీ తన చావును తాను కొని తెచ్చుకోవడమేనని అన్నారు.

 

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.