బహిష్కృత ‘కలం’!

నా భూమ్మీద నాకు
జాగాలేదని దగా చేస్తివి
నా భాష నాకు కాకుండా
రాకుండా అడ్డుపడితివి
నా బువ్వ నేను తినకుండా
నా సజ్జలు, రాగులు, మక్కలు
అన్ని నీ ఊర్ల పండే బియ్యానికి బలి చేస్తివి
బతుకమ్మని బతకనియ్యవైతివి

లష్కరు బోనాలకు ఎసరు పెడితివి
హైదరాబాద్‌ల కట్ల పాములెక్క
మెట్రో రైలు పెట్టి ’కోటి’లను కూలగొట్టి
చరిత్రను ఛిద్రం పట్టిస్తివి
అలపాటి, రాయపాటి,లగడపాటి , కావూరిలు
తెగబలిసి నా లంబడోల్ల బంజార కొండల్ల
ఇరవై అంతస్తుల డబ్బాలు కడితిరి
కాలం కాని కాలంలో కలం పిడికిట బట్టి

నిరంతరం ఉద్యమంలో యుద్ధం చేస్తున్న
జర్నలిస్టులను బహిష్కరించిన
అని, భ్రమ పడకు పీఎం!
నీ ‘మోహన’ రూపం చూడటానికి
రాలేదు, ఈ కలం యోధులు
నీ కపట జీవ వైవిధ్య సదస్సుకు
తెలంగాణ ఎక్కుపెట్టిన సవాళ్ళకు

నువ్వు పడ్డ కష్టాలను చూడటానికి వచ్చిన్రు
ఈ గడ్డకు సలాం!
నువ్వు నా కలానికి

గులాం అన్న సంగతి తేలిపాయె !
నువ్వు మా కండ్లపడకుండా

పోవుడే మా విజయం
నీషేధానికి గురికావడమే
నా స్వచ్ఛతకి నిదర్శనం
నీ కపట మాటలు రాయకపోవడమే
ఈ బహిష్కృత భూమికి ఒక గౌరవం
నువ్వు నన్ను కాదురా !
నేనే నిన్ను వెలివేసిన సంగతి
ఇంకా ఎన్నడు అర్థం చెసుకుంటావ్!
కాలాన్ని కదాన్నావ్ కాని
గుత్పలను దాటుకుంట పోతవా?

-సుజాత సూరేపల్లి

(‘తెరవే’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

This entry was posted in POEMS.

Comments are closed.