బలహీనవర్గాలను గాలికొదిలేసిన సర్కారు: హరీష్

హైదరాబాద్ : కిరణ్ సర్కారు బడుగు బలహీన వర్గాలను గాలికొదిలేసిందని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. దళత, గిరిజన, బీసీ వర్గాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఎసీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పెట్టి బిర్యానీ పెడతానని అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పప్పన్నం కూడా పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. సబ్‌ప్లాన్‌ను కిరణ్ సర్కారు అమలు చేయలేకపోయిందని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చింది మేమే అని ప్రచారం చేసుకున్న సర్కారు సబ్‌ప్లాన్ తెచ్చి 9 నెలలవుతున్నా ఒక్క దళితుడికి మేలు చేయలేదని తెలిపారు. బడ్జెట్‌లో మాత్రమే నిధులు కనిపించాయి… ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నారు. పనులు చేయని సీఎంను ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర మంత్రులకు లేదా, మంత్రులు ఏం చేస్తున్నారని అని అడిగారు. డిసెంబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో సీఎంను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ సభ్యులు వివేక్‌పై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. ఎటువంటి ఆరోపణలు లేకున్నా విశాఖ ఇండస్ట్రీస్‌కు నోటీసులు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. కిరణ్ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలిపారు.

ఒక్క దళితుడికైనా ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లోన్ వచ్చిందా అని అడిగారు. బీసీలకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. సీఎం తెలంగాణకు ఎలాగూ న్యాయం చేయడూ, కనీసం ఇతర ప్రాంతాల్లో ఉన్న దళిత, గిరిజనులకు కూడా న్యాయ చేయలేదన్నారు. సీఎం పేషీలో ఫైళ్లన్నీ మూలుగుతున్నాయని తెలిపారు. దొంగ జీవోలతో చిత్తూరుకు వందల కోట్లు దోచుకెళ్తున్న కిరణ్‌కు ప్రజలకు సంబంధించిన పనులు చేసేందుకు తీరిక దొరకడం లేదా అని విమర్శించారు.

ఫెడరేషన్లకు బడ్జెట్‌లో కోట్ల రూపాయలు కేటాయించి, ఇప్పటికీ ఆ ఫైళ్లలో కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీల బదిలీల్లో కూడా సీఎం అక్రమాలకు పాల్పడుతున్నాడని హరీష్‌రావు ఆరోపించారు. కిరణ్ సోదరుడు సంతోష్‌ను సంతోష పెట్టందే సచివాలయంలో ఫైళ్లు కదలడం లేదని తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాడని హరీష్‌రావు ఆరోపించారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.