బయ్యారం ఉక్కును తరలిస్తే ఖబడ్దార్

kodandaram
-తెలంగాణ ఖనిజం రక్షించుకుంటాం
-ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తూ కోదండరాం
-జీవోను గవర్నర్ రద్దు చేయాలి.. లేకుంటే రీకాల్ కోసం ఉద్యమం:
-బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతం నుంచి ఉక్కు ఖనిజాన్ని విశాఖకు తరలించనీయబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ఆర్థిక వనరులను దెబ్బ తీయాలనే కుట్రపూరితమైన ఆలోచనలతోనే సీమాంధ్ర పాలకులు బయ్యారం ఖనిజాన్ని తరలించడానికి జీవో జారీ చేశారని విమర్శించారు. ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో జేఏసీ ఆధ్వర్యంలో బయ్యారం వరకు చేపట్టిన ప్రచార యాత్రను సోమవారం జేఏసీ కార్యాలయం వద్ద ప్రారంభించే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. వనరులు తరలించుకపోతే తెలంగాణ అణగారిపో తుందని, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అస్థిత్వం కోల్పోతుందని చెప్పారు.

బయ్యారం ఉక్కును విశాఖకు తరలిస్తే ఆంధ్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి బస్తీమే సవాల్ అనే పద్ధతిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరచడం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ఖనిజాన్ని ఇంకో ప్రాంతానికి తరలిస్తే ఇక్కడ వికాసం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలోని 5300 హెక్టార్ల భూమిలోని ఇనుప ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇక్కడ లభించే ఖనిజంతో 10 లక్షల టన్నుల సామర్థ్యం గల ప్యాక్టరీ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. విశాఖలో 30 లక్షల సామర్థ్యం గల ఫ్యాక్టరీలో 30వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నెలకొల్పితే 10 వేల మంది ఆదివాసీలకు ఉద్యోగాలు దొరుకుతాయని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.

ఖనిజాన్ని తరలిస్తే వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ‘ఆంధ్ర పాలకులు బలవంతులైతే మేము బలహీనులం కాదు’ అని కోదండరాం స్పష్టం చేశారు. బయ్యారం నుంచి ఒక్క ఇనుప ఖనిజం ముక్కను కూడా విశాఖకు తరలించుకుపోలేరని తేల్చి చెప్పారు. సహజ వనరులను ఉపయోగించుకుని అనాదిగా మనిషి తన సౌకర్యాలకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాడని తెలిపారు. ఈ ఉత్పత్తులు అందరికీ సమానంగా, న్యాయంగా దక్కాలని ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించాయని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం దానిని గుర్తించలేని మూర్ఖపు పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సమ న్యాయం జరగదని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కుట్రలను భగ్నం చేస్తామని, ప్రజలను చైతన్యవంతులను చేసి బయ్యారం ఖనిజాన్ని తరలించకుండా అడ్డుకుని తీరుతామని కోదండరాం హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రి , బీజేపీ నాయకులు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ బయ్యారం ఇనుప ఖనిజం ఉన్న భూములన్నీ ఆదివాసీలవేనన్నారు. అందులో లభించే ఖనిజాలు వారి హక్కు అన్నారు.

ఆదివాసీ ప్రాంతాలను భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ పత్యేక)వూపాంతాలుగా గుర్తించిందన్నారు. అందుకు అనుగుణంగానే వన్ ఆఫ్ సెవెంటీ వంటి చట్టాలను తీసుకువచ్చారని తెలిపారు. దీని ప్రకారం వాటిని అమ్మడానికి , ఇతరులకు లీజ్‌కు ఇవ్వడానికి వీలు లేదన్నారు. దీనిని రక్షణ స్టీల్స్‌కు, విశాఖ స్టీల్స్‌కు కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్ ఈ జీవోను రద్దు చేయవచ్చని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు చెబుతున్నదన్నారు. యాత్ర ముగిసే లోగా గవర్నర్ జీవోను రద్దు చేయకపోతే గవర్నర్ రీకాల్ కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వనరుల దోపిడీపై ఒకవైపు తీవ్రమైన తెలంగాణ ఉద్యమం సాగుతుంటే ముఖ్యమంత్రి అహంకారపూరితంగా లక్షన్నర కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని తరలించడానికి కుట్రలు చేయడం దారుణమన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ లబ్ధి పొందాలని సీఎం కిరణ్ చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన కిరణ్‌కుమార్‌డ్డి ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, తెలంగాణ జేఏసీ వ్యతిరేకిస్తున్నా జీవోలు జారీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం ఒంటెత్తు పోకడలకు పోతే గతంలో నిరంకుశంగా వ్యవహరించిన వారికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంవూధుల పాలనలో తెలంగాణ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజానీకం ఒక్కటై వారి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించే జీవోను ప్రభుత్వం విరమించుకోకపోతే ఖనిజాన్ని ఉక్కుగా మార్చే డోలామైట్ ఖనిజం తరలింపును సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తనకు బలముందని కేసులు పెడతాం, జైళ్ళకు పంపుతాం అంటే ఎవరూ భయపడరని చెప్పారు. గవర్నర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్షికమంలో న్యూడెమోక్షికసీ ప్రతినిధి గోవర్ధన్, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌డ్డి, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ ప్రసంగించగా, పిట్టల రవీందర్, మురళధర్‌గుప్తా, శ్రీధర్, ఎంబీ కృష్ణయాదవ్, వెంకటస్వామి, వెంకట్‌డ్డి, బాలనర్సయ్య, అశోక్‌యాదవ్, మల్లేశం, మధుసూధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉంటేనే సీమాంవూధుల కుట్రలను ఎదుర్కోగలం
సిద్దిపేట: తెలంగాణ ప్రజలు ఐక్యతతో ముందుకు సాగితేనే సీమాంవూధుల కుట్రలను ఎదుర్కొగలమని కోదండరాం ఉద్భోదించారు. అదివాసులు నివసిస్తున్న గూడూరు, బయ్యారం ప్రాంతాలను భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించిందని, ఇక్కడి ఇనుప ఖనిజం తవ్వాలంటే తప్పనిసరిగా ఆదివాసీల అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరిట టీజేఏసీ చేపట్టిన యాత్ర సోమవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, నంగునూరు మీదుగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్దిపేటలోని ఐఎమ్‌ఏ హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

అంతకుముందు ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో కోదండరాం మాట్లాడారు. అదివాసుల హక్కులను హరించివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు ఇక్కడి ఇనుప ఖనిజాన్ని కేటాయించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎలుగెత్తి చాటేలా టీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 29 జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, అదే రోజు చలో అసెంబ్లీ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు జాతి సంపదైతే, తెలంగాణలో ఫ్యాక్టరీ పెడితే అది జాతి సంపద కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో ఇకపై బతుకే లేదని కోదండరాం అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఢిల్లీకి పంపుతున్న డబ్బుల సంచులతోనే కేంద్రంలోని ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం లేదేమోనన్న అనుమానం కలుగుతున్నదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.