బయ్యారంపై కాంగ్రెస్ వైఖరి..బొయ్యారమే

 

boyaramఉన్నదంతా ఊడ్చుకుపోతామంటున్న నేతలు
బయ్యారంలో ప్లాంటుపై నేతల వాగ్దానాలను కొట్టిపారేసిన బొత్స మాటలు
మెమో జారీతోనే తలెత్తిన అనుమానాలు
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి… ఇది తెలంగాణ ప్రజలందరి డిమాండ్! బయ్యారంలో దశలవారీగా స్టీల్‌ప్లాంట్ ఏర్పాటవుతుంది.. ఇది ప్రభుత్వం ఊదరగొడుతున్న హామీ! ప్లాంటు వచ్చితీరుతుంది… ఇది కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్.. విప్ మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతల ఉద్ఘాటన! ప్లాంటు కడతామని చెబుతున్నా.. తెలంగాణవాదులు ప్లాంటు కోసం డిమాండ్ చేస్తున్నారన్న వాతావరణాన్ని సృష్టించిన వ్యాఖ్యలు! అయితే.. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ నిజం సాక్షాత్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాటల్లో బయటికి వచ్చింది! బయ్యారం ఇనుప ఖనిజం మొత్తం విశాఖ ఉక్కుకే తరలిపోతుందని.. తెలంగాణకు మిగిలేది దుబ్బ ధూళి మాత్రమేనని తేలిపోయింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతంలో విస్తారంగా ముడి ఇనుము నిక్షేపాలు ఉన్నప్పటికీ అది నాణ్యమైనది కాదన్న బొత్స.. ఇక్కడ స్టీల్ ప్లాంటు పెట్టే అవకాశాల్లేవని కుండబద్దలు కొట్టేశారు! విశాఖకు ఖనిజం తరలించడాన్ని గట్టిగా సమర్థించారు.

ఆ తర్వాత మూడు గంటలకే రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని సన్నాయి నొక్కులు నొక్కారు. నిజానికి ఖమ్మం జిల్లా బయ్యారంలో 2,500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడురు పరిధిలో 2,500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలో 342 హెక్టార్లు కేటాయిస్తూ ఈ నెల 17న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీ శ్రీనివాసులు పేరుతో జారీ అయిన ‘మెమో’లోనే అసలు కిటుకంతా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలి దశలో బయ్యారంలో పెల్లెట్, బెనిఫికేషన్ ప్లాంటు, రెండో దశలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తామన్న ఒప్పందం కుదిరిన తర్వాతే బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేటాయించినట్లు ప్రభుత్వం ఆ మెమోలో పేర్కొంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందంటూ ప్రభుత్వ విప్, ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క కూడా బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే, వీరి ప్రకటనలేవీ తెలంగాణవాదులను సంతృప్తి పర్చలేదు. వారి అనుమానాలను నిజం చేస్తూ పీసీసీ చీఫ్ బొత్స కూడా ఖమ్మంలో జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టం చేయడంతో.. సర్కారు కుతంవూతమేంటో బయటపడినట్లుయింది. బయ్యారంలో లభించే ఇనుము నాణ్యత, పరిమాణం పూర్తిస్థాయి ఉక్కు ఉత్పత్తికి సరిపోదని, అందుకే అక్కడ స్టీల్ పరిక్షిశమ నెలకొల్పేందుకు వీలుపడదని బొత్స చెబుతున్న మాటలనే ప్రామాణికంగా తీసుకుంటే.. మరి బయ్యారంలో ప్లాంటు వస్తుందని చెబుతున్న సీఎం కిరణ్, ఇతర నేతల మాటలను ఎలా అర్థం చేసుకోవాలని పలువురు తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.

మెమో జారీతోనే అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ సాధారణంగా జీవోల ద్వారానే వెల్లడవుతుంటాయి. కానీ, అతి కీలకమైన బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేటాయిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు జీవోగా కాకుండా మెమో రూపంలో రావడంతో తెలంగాణవాదుల అనుమానాలే నిజమయ్యాయి. అత్యంత కీలకమైన గనుల కేటాయింపు విషయాన్ని మెమో రూపేణా ఇవ్వడంలోని ఔచిత్యాన్ని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సమయంలో ఈ మేరకు విశాఖ స్టీలు ప్లాంటుతో ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడిస్తోంది. అయితే, తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న ఉద్యోగుల్లో మూడు శాతం మంది కూడా తెలంగాణ వారు లేరని.. ఇక్కడే ప్లాంటు ఏర్పాటు చేస్తే అత్యధిక సంఖ్యలో ఈ ప్రాంత యువతకు మేలు జరుగుతుందని టీఆర్‌ఎస్ నేతలతోపాటు తెలంగాణ ఆకాంక్ష కలిగిన అందరి వాదనగా ఉంది. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా పాలనా యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తూ… తెలంగాణపై దుమ్మూ, మట్టి పోసుకుంటూ.. తెలంగాణ ఖనిజ సంపదను వైజాగ్‌కు లారీల ద్వారా తరలించే కుతంవూతానికి పాల్పడింది.

కేంద్రం సూచించినా.. పట్టించుకోని సర్కారు!
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు బయ్యారంలో ఉక్కు పరిక్షిశమ ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందిండం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత మావోయిస్టుకు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కూడా కేంద్రం లేఖలను పంపినట్లు చెబుతున్నారు. కేంద్రం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభత్వం కోల్డ్ స్టోరేజిలో పెట్టినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందకుగాను కొత్త ప్రాజెక్టులకు డిజైన్లు చేసి, ప్రతిపాదనలను పంపాలని మన రాష్ట్రానికి కూడా కేంద్రం లేఖలు రాసినట్లు తెలిసింది. కేంద్రం గుర్తించిన మావోయిస్టు జిల్లాల్లో ఖమ్మం కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనే చిత్తశుద్ది ఉంటే.. ఆపారమైన ఇనుప ఖనిజ సంపద ఉన్నా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయవచ్చు. అందుకు కేంద్రం నిధులు ఇవ్వడాకి కూడా ఒప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాల్లేక నిస్తేజానికి గురయ్యే యువత.. మావోయిస్టుల్లో చేరడం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా మాయమవుతుంది. ఫలితంగా మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గుతుందని అంటున్నారు. అయితే, రాష్ట్రం ప్రభుత్వం మాత్రం బయ్యారంలాంటి ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరినీ ఏర్పాటు చేయకుండా..

విద్య, వైద్యంతో పాటు రోడ్లు, తాగు నీటి అవసరాలను మాత్రమే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలాంటి ప్రతిపాదనలతో యువతను చెడు మార్గం పట్టకుండా ఎలా నిరోధించగులుతారని కాంగ్రెస్‌లోని తెలంగాణవాదులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను వినియోగించుకుంటే రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చుకున్నవారమవుతామని మరికొంత మంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం విషయంలో ప్రత్యేక డిజైన్ కోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. ఇప్పటికే ఎన్నివేల హెక్టార్లలో ఇనుప గనులు ఉన్నాయో లెక్కలతో సహా ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్‌ను ఎక్కడా ఏర్పాటు చేయాలనే దానిపై కొత్తగా శ్రమించాల్సిన అవసరం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఇక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు గురించి ఆలోచించకపోవడం వెనుక గూడార్థాలు వేరే ఉన్నాయన్న వాదనలు బలంగా వినవస్తున్నాయి.

This entry was posted in ARTICLES.

Comments are closed.