బడ్జెట్ రూపకల్పనలో లోపాలున్నాయి: కాగ్

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో లోపాలున్నాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఇవాళ కాగ్ అసెంబ్లీకి తన నివేదికను అందజేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఖర్చులకు మధ్య పొంతనలేదని నివేదిక పేర్కొంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే నిధులు ఖర్చు చేశారని వివరించింది. ఇలా చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది. కేటాయించిన నిధుల్లో ఆరో వంతు నిధులు మిగిలిపోతున్నాయని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథకాల అమలు విషయంలో అంతర్గత నియంత్రణ పనిచేయడంలేదని వెల్లడించింది. 2011-12లో మొత్తం నిధులను నిర్దేశిత ప్రయోజనాలకు కేటాయించగా సరిగా ఖర్చు చేయలేదని తెలిపింది. విద్యా, ఆరోగ్య రంగాలకు కేటాయించిన నిధుల వినియోగంలో సరిగా వ్యవహరించలేదని నివేదిక తప్పుపట్టింది.

రాష్ట్ర అప్పు మార్చి, 2012 నాటికి రూ.1,56,355 కోట్లు అని తేల్చి చెప్పింది. అప్పులకు సంబంధించిన వివరాలను సరిగా నమోదు చేయడంలేదని, సరిగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పేరుకుపోయిన నష్టాల మొత్తం రూ.5,979 కోట్లు అని వివరించింది. ఆర్టీసీకి రూ.1,984 కోట్లు నష్టం సంభవించిందని పేర్కొంది. ద్రవ్యలోటు స్వల్పంగా పెరిగినప్పటికీ ఎఫ్‌ఆర్‌బీఎం నిర్ధేశించిన పరిమితి మించలేదని పేర్కొంది. నేత కార్మికులకు రుణమాఫీ పథకానికి రూ.200 కోట్లు కేటాయించి , రూ.32.88 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.571 కోట్లు కేటాయించి రూ.142 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసిందని వివరించింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడాన్ని తప్పుపట్టింది. ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని తెలిపింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.