ఫినిషింగ్ టచ్..!

-బుధవారం జీవోఎం సమావేశం తెలంగాణకు కీలకం
-గురువారం కేబినెట్ కోసం ఉరకలు..
-రాజధాని పరిధి నిర్ధారణ పూర్తి.. భద్రాచలం, 371(డీ)పై క్లారిటీ
-సోనియాతో జీవోఎం భేటీ.. మంత్రులకు మేడమ్ దిశానిర్దేశం
-రాయల తెలంగాణ వద్దని అధినేత్రికి చెప్పిన జైపాల్
న్యూఢిల్లీ, నవంబర్ 25: మూడు రోజులు.. 72 గంటల్లో తెలంగాణపై అమీతుమీ తేలనుంది. అన్ని గందరగోళాలకు.. వాదోపవాదాలకు తెర పడనుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం తనను కలిసిన జీవోఎం సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియలో మంగళ, బుధ వారాల్లో జరిగే జీవోఎం సమావేశాలు కీలకం కానున్నాయి. బుధవారం పూర్తి స్థాయి సభ్యులతో జరిగే జీవోఎం భేటీ తెలంగాణకు పతాక సన్నివేశం.

గురువారం కేబినెట్ సమావేశం ముందు నివేదిక ఉంచే డెడ్‌లైన్ విధించుకున్న జీవోఎం ఊపిరి సలపని షెడ్యూలుతో సమావేశాల పరంపర కొనసాగిస్తున్నది. సోమవారంనాడు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో జీవోఎం సభ్యులు భేటీ అయ్యారు. సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం వారు నేరుగా 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించారు. మంత్రులు ఏకే ఆంటోనీ, షిండే, చిదంబరం, జైరాం రమేశ్‌తో పాటు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ప రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చర్చల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంపై చర్చ వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సీఎంను ఒప్పించడంతో పాటు అసెంబ్లీలో సజావుగా తీర్మానం చేయిస్తామని సీమాంధ్ర మంత్రులు చెప్పిన విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

చివరికి కేవలం ఐదారేళ్లయినా యూటీ చేస్తే చాలని కేంద్ర మంత్రులు జేడీ శీలం, కావూరి చేసిన ప్రతిపాదనను జీవోఎం సభ్యులు మేడమ్ ముందుంచినట్టు సమాచారం. అయితే యూటీ ప్రతిపాదనను సోనియా నిర్దంద్దంగా తోసిపుచ్చి ప్రక్రియ యథావిధిగా కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిసింది. రెండు రోజుల్లో బిల్లు పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారని సమాచారం. ఈ నెల 28 న కేబినెట్ సమావేశానికి ముసాయిదా బిల్లు పూర్తి కాపీ అందించాలనే గడువును దృష్టిలో ఉంచుకుని జీవోఎం స్పీడ్ పెంచింది. సోమవారం మేడమ్ సూచనలతో వచ్చిన స్పష్టత మేరకు కసరత్తును ముగించే పనిలో పడ్డారు. బిల్లు రూపకల్పనలో కీలక బాధ్యత తీసుకున్న జైరాం రమేశ్ మంగళవారం నార్త్‌బ్లాక్‌లో తనకప్పజెప్పిన పనిని పూర్తి చేయనున్నారు. మరోవైపు న్యాయశాఖ, ఆర్థికశాఖ, హోం శాఖ అధికారులు, కార్యదర్శులు మంగళవారం పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.

27న అధికారికంగా భేటీ అయ్యే జీవోఎం పూర్తి చేసిన ముసాయిదాపై సంతకం పెట్టి కేబినెట్‌కు అందించనున్నదని సమాచారం. ‘తెలంగాణపై జీవోఎం బుధవారం జరిపేదే బహుశా చివరి సమావేశం కావొచ్చు. ఈ సమావేశంలోనే తుది సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదముద్ర వేస్తుంది’ అని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. విభజన విషయంలో ముందుకు వచ్చిన వివిధ అంశాలకు సంబంధించి భద్రాచలం విషయం కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. అవసరమైతే ముంపు మండలాలను సీమాంధ్రకు అప్పగించి భద్రాచలాన్ని తెలంగాణలో కొనసాగిస్తారని తెలిసింది. 371 (డీ) విషయంలో ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యాంగ సవరణ అక్కరలేదని, వీలునుబట్టి కొనసాగించడమా లేదా అనే విషయాన్ని పార్లమెంటులో బిల్లు సందర్భంగా తేల్చవచ్చని సమాచారం. అందుకు సింపుల్ మెజారిటీ చాలంటున్నారు. ఉద్యోగుల విభజన, రెవిన్యూ పంపకాలు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం చేపడతారు. ఈ విషయంలో ప్రత్యేకంగా ఏదీ తలకెత్తుకోరాదని నిర్ణయించుకున్నారు. నదీ జలాల పంపిణీకి కూడా అమలులో ఉన్న చట్టాలనే వర్తింప చేస్తారని తెలిసింది. కొత్తగా ఏ ప్రతిపాదన చేపట్టినా అది అనేక అవాంతరాలకు, న్యాయవివాదాలకు తావిస్తుందని జీవోఎం భావిస్తున్నది. అవసరాన్ని బట్టి ఓ స్వతంత్ర బోర్డును ఏర్పాటుచేసే అవకాశముంది.

సజీవంగానే హైదరాబాద్ ప్రతిపత్తి..: యూటీ ప్రతిపాదనను సోనియా తోసిపుచ్చిన నేపథ్యంలో ఇక హైదరాబాద్‌ను ఏం చేయాలనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. అయితే ఉమ్మడి రాజధానిగా ఉంచే పక్షంలో దాని పరిధిని జీహెచ్‌ఎంసీకి పరిమితం చేసే విషయంలో ఏకాభిప్రాయం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌పై అధికారాలకు సంబంధించి సోనియాతో ఉదయం జరిపిన సమావేశంలో జైపాల్ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. ఏ అధికారాలైనా బదలాయిస్తే రాజ్యాంగ సవరణ కన్నా అది తెలంగాణ కేబినెట్ ద్వారా తీర్మానంచేసి గవర్నర్‌కు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తవని ఆయన సూచించినట్టు తెలిసింది. అలాగే రాయల తెలంగాణ అంశాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని అధినేత్రికి ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే జీవోఎంతో సోనియా భేటీలో సైతం రాయల తెలంగాణ ప్రతిపాదన రాలేదని తెలిసింది.

యూటీ చేస్తే సహకారం ఇస్తాం: జేడీ శీలం
నూతన రాజధాని నిర్మించుకునేందుకు కనీసం రెండు నుంచి నాలుగేండ్లు సమయం పడుతుందని అంతకాలం హైదరాబాద్‌ను యూటీ చేస్తే విభజనకు అన్ని విధాల సహకరిస్తామని కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. సోమవారం ఓ ఎలక్ట్రానిక్ మీడియా చానెల్‌తో మాట్లాడిన ఆయన తెలంగాణ విభజనకు సరేనన్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జైపాల్ రెడ్డి సహా తెలంగాణ నేతలందరూ ఆలోచించాలన్నారు. ఇదివారికి చక్కని అవకాశమన్నారు. సీఎంను కూడా తాము విభజనకు ఒప్పిస్తామన్నారు. ఇటీవల క్యాంప్ ఆఫీసులో కేంద్ర మంత్రులతో జరిపిన సమావేశంలో సీఎం ఈ ప్రతిపాదనకు అంగీకరించారని తెలిసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.