ప్రసాదంపై రాద్ధాంతం ఎందుకు?-కడెంపల్లి సుధాకర్

వానా కాలంలో చెరువులోకి నీళ్లు చేరగానే కప్పలు ప్రవేశించినట్లు హేతువాదులమని చెప్పుకొనే కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఏటా వానా కాలం ప్రారంభంలో(జూన్ మొదటివారంలో)నే అకస్మాత్తుగా శాస్త్రీయదృక్పథం గుర్తుకు రావడం ఆశ్చ ర్యం కలిగిస్తుంది.ఆస్తమా రోగుల కోసం హైదరాబాద్‌లో బత్తిన సోదురులు పంపిణీ చేసే చేప ప్రసాదంపై రాద్ధాంతం చేయడం సదరు సంస్థలు, వ్యక్తులకు పరిపాటిగా మారింది. గత పదేళ్లుగా మృగశిర కార్తె ప్రారంభం రోజున చేప మందు పంపిణీ కోసం జూన్ మొదటి వారంలో బత్తిన సోదరులు ఓ వైపు ఏర్పాట్లు ప్రారంభిస్తుండగానే…‘సో కాల్డ్’ హేతువాదులు మరోవైపు తెచ్చి పెట్టుకున్న వేదికలపై, మీడియా గొట్టాల ముందు చేప మందు శాస్త్రీయతను ప్రశ్నిస్తూ వాపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

ఆస్తమా రోగులకు ఆశా కిరణంలా మారిన చేప ప్రసాదంపై వీరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం ఆస్తమా రోగులతోపాటు సాధారణ ప్రజలకు ఒకింత బాధ కల్గించే విషయమే. చేప మం దు పంపిణీకి ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించవద్దంటూ ఈసారి వారు ఏకంగా లోకాయుక్త గడప తొక్కారు. ఈ నేపథ్యంలో చేప మందు పుట్టుపుర్వోత్తరాల, విశిష్టత, ఔషధం పంపిణీపై అనవసర రాద్ధాంతాన్ని ఓసారి పరికిద్దాం.

ఆస్తమాను నయం చేసే ఈ ఔషధం ఫార్ములాను ఓ సాధువు 160ఏళ్లకిందటే బత్తిన కుటుంబానికి ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపాన ఉన్న దూద్‌బౌలీలోని బత్తి న వారి ఇంటికి వచ్చి వచ్చిన ఆ సాధువు… ఆస్త మా మందు ఫార్ములాను ఇస్తూ రెండు షరతులు విధించారు.ఒకటి, ఈఫార్ములాను వాణిజ్యం చేస్తే ఈ మందు సామర్థ్యం పోతుంది. అలాగే, ఈ కుటుంబంలోని వ్యక్తులకు కాకుండా(కుటుంబం నుంచి అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలను కూడా)బయటి వారెవరికీ ఈ మందు ఫార్ములాను వెల్లడించినా..దాని సామర్థ్యం పోతుంది. బతికున్న కొర్రమీను చేప పిల్లతో కలిసి ఈ ఔషధాన్ని రోగులకు ఇవ్వాలని సదరు సాధువు సూచించారు.అప్పటి నుంచి బత్తిన కుటుంబ వారసులు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు.

నిజాం ప్రభువు ఈ కార్యక్షికమానికి మద్దతిచ్చారా, లేదా అన్నదానిపై ప్రచురితమైన ఆధారాలు లేనప్పటికీ..ఆయన నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదన్నది మాత్రం నిజం.ఇలా చేప మందు మాదిరిగానే వివిధ ఔషధాలకు సంబంధించి మనదేశంతోపాటు చైనా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి మందులను ప్రత్యామ్నాయ, దేశీ ఔషధాలంటుంటారు. మనరాష్ట్రంలో ఈ చేప ప్రసాదం పంపిణీపై సదరు హేతువాద సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకొని దుష్ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ క్రింది వాస్తవాలను పరిశీలించడం అవసరం.
1. బత్తిన కుటుంబం తరాల నుంచీ ఈ చేప మందును పంపిణీ చేస్తున్నా.. ఏనాడూ దీన్ని వాణిజ్యం కోసం వాడుకోలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనరూపంలో లావాదేవీలు జరిగిన దాఖలాలు లేవు.
2. చేప ప్రసాదం వికటించి రోగులు చనిపోయినట్లు ఇన్నేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
3. ప్రసార మాధ్యమాలు, టీవీ విస్తృతమైన తర్వాత ఇండియాతోపాటు విదేశాల్లోనూ బత్తినసోదరులు పంపిణీ చేసే చేపమందుకు మరింత ప్రాచుర్యం లభించింది. ముఖ్యం గా 1990తర్వాత చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

4. ఒకవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చేప మందు పంపిణీని ఆదరించారు. గతంలో పాతబస్తీలోని తమ ఇంటి నుంచే బత్తిన సోదరులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. పాతబస్తీలో మతకల్లోలాల అనంతరం చంద్రబాబు వేదికను పాతబస్తీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చడంతో ప్రసాదం కోసం వచ్చే రోగుల సంఖ్య అమాంతం రెట్టింపైంది.

5. 2002 నుంచి కొంతమంది మేధావులు, సంస్థలు ఈ చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించడం ప్రారంభించారు. తమ వాదాన్ని బలపరుస్తూ చేప మందు పంపిణీని నిలిపేయాలంటూ తర్వాతి కాలంలో కోర్టులు, ప్రయోగశాలలను, రాజకీయ నేతలను, లోకాయుక్తను ఆశ్రయించడం మొదలుపెట్టారు.
6. అయితే,ఇప్పటి దాకా ఏ కోర్టూ, ఏ ప్రయోగశాల కూడా బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు ప్రమాదకరమైనదని, విషతుల్యమని ధ్రువీకరించలేదు.

7. చేప మందుపై దుష్ప్రచారంతో తమపై దాడి చేస్తోన్న ఆంధ్రాకు చెందిన ఓ సామాజిక వర్గం, బహుళజాతి, జాతీయ ఫార్మా కంపెనీలను ఎదుర్కోవడానికి బత్తిన కుటుంబానికి ఆర్థిక, రాజకీయ బలంలేదు.

8. ఈ ఒత్తిడిని తట్టుకోలేక తాము పంపిణీ చేసే చేప మందు పేరును చేప ప్రసాదంగా మార్చారు.160 ఏళ్ల కిందట సాధువు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేసుకుంటూ వెళ్తున్నారు.
9. చేప మందుపై రోగుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం గమనార్హం.
హేతువాదులమని చెప్పుకునే వారు గత కొన్నేళ్లుగా ఎంత దుష్ప్రచారం చేస్తున్నా… చేప ప్రసాదం తీసుకునేందుకు వస్తున్న రోగుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.

వాస్తవాలు ఇలా ఉండగా, సదరు ‘సో కాల్’్డ హేతువాదులు, సంస్థలు మాత్రం చేప ప్రసాదంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో ఆంతర్యం ఏమిటన్నది వారికే తెలియాలి. ఈ చేపమందు పంపిణీని వ్యతిరేకిస్తున్న వారు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.అవి.1.వైద్యులు, నిపుణుల ప్రకారం, ఇతర కారణాలను పక్కనబడితే, ఆస్తమా అనేది సైకోసొమాటిక్ అలర్జీ. ఇదే మాదిరిగా అనేక జబ్బులను మానవులు ఎదుర్కొంటున్నారు. 2. చేప మందులో ఆస్తమాను నయం చేసే లక్షణాలేవీ లేవని అనుకున్నా… అదొక సైకోథెరపటిక్‌గా పని చేస్తుందనడంలో మాత్రం ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

ఈ ప్రసాదం తీసుకున్న ప్రజలకు అది ఉపశమనాన్ని కల్గించినన్నినాళ్లూ ఇది మంచి పరిణామంగానే పరిగణించాలి. 3. ఇక, హేతువాదులమని చెప్పుకునే వ్యక్తుల, సంస్థల శాస్త్రీయ దృక్పథం నిస్సారంగా యాంత్రికంగా ఉంది. అంతేగానీ, వారి అవగాహనకు బలమైన చారివూతక పునాదులు లేవు. 4. చేప ప్రసాదాన్ని సవాల్ చేయడం ‘రోడ్డుపై దేవు న్ని చూపించు?’ అని ప్రశ్నించినట్లుగానే ఉంది.
ఇక, కోర్టులుపయోగశాలలను ఆశ్రయించి, చేప ప్రసాదం పంపిణీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తులు, సంస్థలు ఈ ఏడాది మరింత లోతుకు దిగజారారు.

పూర్తిగా ప్రైవేటు కార్యక్షికమమైన ఈ చేప మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడమేంటని, కోట్ల ప్రజాధనం వృధా చేయడమేంటంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై గగ్గోలు పెడుతున్న వ్యక్తులు, సంస్థలు చేప మందు పంపిణీ లాంటి అల్పమైన విషయాలను వదిలి, ఇతర కీలక అంశాలపై దృష్టి సారిస్తే.. ప్రజా శ్రే యస్సుకు పాటుపడినట్లవడమే గాకుండా ప్రజాధనాన్ని అరికట్టిన వారవుతారు.అం దు లో మచ్చుకు కొన్ని. 1. తన నివాసానికి అతి సమీపంలో(300 మీటర్ల) ఉన్న ఓ గుడిని దర్శించుకునేందుకు రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ ప్రతి రోజూ పెద్ద కాన్వాయ్‌తో వెళ్తున్నారు. మతాన్ని ఆచరించడం ప్రైవేటు కార్యక్షికమ మే కదా!
2. ప్రతిఏటా గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం పేరి ట రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను, మానవ పని గంటలను వృధా చేస్తుంది.

3. అవసరం లేని మందులు, పరీక్షలను అంటగడుతూ ప్రైవేటు ఆస్పవూతులు అమాయక పేద ప్రజల రక్తంపిండుతూ, కోట్లు ఆర్జిస్తున్నా యి. ఈ షార్క్ చేపలు, జలగల బారి నుంచి ప్రజలకు ఎలాంటి రక్షణా లేదు.
4. మద్యపానం, ధూమపానం ప్రజల అనారోగ్యానికి ఎంతో హానీ చేస్తున్నాయి.
(శాస్త్రీయంగా రుజువైంది కూడా). కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏటా 30 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. రాష్ట్రంలో స్వచ్ఛమైన తాగునీటి కంటే మద్యమే ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉందంటే ఆశ్చర్యమేం లేదు.

5. ఇక, రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్య, ఎంసెట్ అనేవి సిగ్గుమాలినవిగా తయారయ్యాయి.

వీటి ఫలితంగా విద్యార్థులు కోళ్ల ఫారాల్లో కోడి పిల్లల మాదిరిగా తయారవుతున్నారు. సోకాల్డ్ హేతువాదులు చేప మందు లాంటి చిన్న చిన్న విషయాలను వదిలి, ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.ఎలక్ట్రానికి మీడియా పుణ్యమా అని ఏ మాత్రం పరిజ్ఞానం లేని వారంతా డిస్కషన్ల పేరుతో టీవీ స్టూడియోల వేదికలనెక్కి కాలహరణం చేస్తున్నారు. చౌకబారు పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారు. ఇలాంటి వారంతా పైన పేర్కొన్న అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించి, చర్చలు సాగిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.అట్లా కాకుండా ఇటు వ్యక్తులు, అటు బత్తిన సోదరులు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటే ప్రజలకు ఒనగూరేదేమీ లేదు. ఇక చివరగా హేతువాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఓ విషయంపై బత్తిన సోదరులు దృష్టి సారించాల్సి ఉంది. ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ సమయంలో బత్తిన సోదరులు.. ఒకరి నోట్లో పెట్టిన అదే చేతిని తిరిగి శుభ్రం చేసుకోకుండానే మరొకరి నోట్లో పెడుతున్నారు. దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.-కడెంపల్లి సుధాకర్

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.