ప్రభుత్వానిది శిక్షార్హమైన నిర్లక్ష్యం

– ఏపీఎన్జీవోల సమ్మె నిబంధనలకు వ్యతిరేకం
– రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఫైర్
– తదుపరి విచారణ నేటికి వాయిదా
ఏపీఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె విషయంలో ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని హైకోర్టు మండిపడింది. సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం తీరును చూస్తుంటే సమ్మెను సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తోందని న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తంచేసింది. ఏపీఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, అఖిలభారత బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు దానయ్య వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజావూపయోజనాల వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

hifghcrt పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యండ్డి, ప్రభుత్వం తరఫున వీసీహెచ్ నాయుడు, ఏపీఎన్జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌డ్డి వాదించారు. మొదట వాదనలు వినిపించిన సత్యండ్డి సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ పని చేయకపోతే దానిని ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించాల్సి వస్తుందన్నారు. సమ్మెను విరమించాలని ఉద్యోగులను, విరమించని వారిపై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టులకు ఉందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను వినిపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తే ఏం చేయాలో చెప్పాలని అడిగింది.

ఈ విషయంలో స్పష్టతనిచ్చే నిబంధనలు ఏమీ లేవని సత్యండ్డి జవాబిచ్చారు. అయితే ఈ కేసులో మేం చేయగలిగింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సత్యండ్డి.. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవచ్చన్నారు. సమ్మెతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం ప్రేక్షకపావూతకు పరిమితమైందన్నారు. ఆ సమయంలో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాది నాయుడును ప్రశ్నించింది. ఆయన సమాధానమిస్తూ సమ్మె విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను చదివి వినిపించారు. కౌంటర్ దాఖలు చేసింది డిప్యూటీ సెక్రటరీ అన్న విషయాన్ని గుర్తించిన ధర్మాసనం.. ‘డిప్యూటీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. కనీసం కార్యదర్శి కూడా ముందుకురాలేదు.

ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి ముందుకు రాకపోవటాన్ని చూస్తుంటే ప్రభుత్వం సమ్మెను సమర్థిస్తున్నట్టుగా ఉంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. చర్చల కోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే రెండుసార్లు అది ఉద్యోగులతో చర్చలు జరిపిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం మంత్రుల బృందం చర్చలు జరిపిందని ప్రశ్నించింది. ‘సమ్మె చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కౌంటర్‌లో ఎక్కడా చెప్పలేదు. ఇది సమర్థనీయమా? మీ బాధ్యతేంటి? చర్యలు తీసుకున్నాక కూడా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే వారి సంగతి మేం చూసుకునే వాళ్లం. అసలు సమ్మె ఆపేందుకు చర్యలు తీసుకుంటారా? లేదా? సూటిగా చెప్పండి’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.

దాంతో కొంత గడువు ఇస్తే మరో అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పిస్తామని నాయుడు చెప్పగా గడువు ఇచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గడువు కావాలంటే ప్రతీ వాయిదాకు రెండు లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ‘నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. మీరేమో సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాలన్న ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో స్పష్టతనివ్వండి’ అని ప్రభుత్వాన్ని అడిగింది. పిటిషన్లు కొట్టివేయాలని నాయుడు చెప్పగా ప్రభుత్వ వాదనలు ముగిసిన ధర్మాసనం పేర్కొంది. తర్వాత ఏపీఎన్జీవోల తరఫు న్యాయవాది మోహన్‌డ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యన్ని పిటిషనర్ తన స్వప్రయోజనాల కోసం దాఖలు చేశారని, ఇటువంటి వాటికి విచారణార్హత ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయకూడదని నిబంధనలు లేవన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులంతా సమ్మె చేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. కేవలం ఎస్మా కింద మాత్రమే సమ్మెపై నిషేధం విధించవచ్చన్నారు. అప్పటికి కోర్టు పనివేళలు ముగియటంతో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.