ప్రధాని ప్రాథమ్యంలో తెలంగాణమరింత జాప్యం?

తెలంగాణ ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. హోంశాఖ తయారు చేసే నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసేందుకు ఇంకొంత సమయం పడుతుందని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. కేబినెట్ ముందు ఉంచాల్సిన టీ నోట్‌ను కేంద్ర హోంశాఖ ఇంకా సిద్ధం చేయలేదని పీటీఐ పేర్కొంది.
manmohanతన వద్ద ఉన్న ముసాయిదా నోట్‌కు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయం నేపథ్యంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో నియమించిన కమిటీ నివేదిక కోసం షిండే ఎదురు చూస్తున్నారని పేర్కొంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ నుంచి రాజకీయ ఆమోదం కోసం వారికి కూడా షిండే టీ నోట్‌ను అందిస్తారని, అక్కడ ఖరారైన తర్వాత అందులోని న్యాయపరమైన చిక్కుల గురించి పరిశీలన జరిపేందుకు ముసాయిదా నోట్ కేంద్ర న్యాయశాఖకు వెళుతుందని పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాతే కేబినెట్‌కు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. టీ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపాక మంత్రుల బృందాన్ని నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఈ బృందం పని చేస్తుంది. రాష్ట్ర విభజనపై తీర్మానాన్ని అసెంబ్లీకి పంపిన అనంతరం ఈ బృందం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సైతం ఆంటోనీ కమిటీ నివేదికకు, కేబినెట్ నోట్‌కు సంబంధం లేదని, పార్లమెంటులో ప్రవేశపెట్టే తెలంగాణ ఏర్పాటు బిల్లు సందర్భంగా ఆంటోనీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని చెబుతూ వచ్చారు. అయితే పీటీఐ తన కథనంలో మాత్రం ఆంటోనీ కమిటీ సిఫారసుల కోసం షిండే ఎదురు చూస్తున్నారని పేర్కొనడం విశేషం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ.. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. తొలుత ప్రధాని మన్మోహన్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందని ఆశించారు. అయితే.. ఈలోపే కళంకిత ప్రజా ప్రతినిధుల రక్షణకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్డినెన్సును ఉపసంహరించే పనిలో కాంగ్రెస్ అధిష్ఠానం పడింది. బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధాని మన్మోహన్ మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక న్యూఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం రాష్ట్రపతితో భేటీ అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు.

కోర్ కమిటీలో తెలంగాణ…
కీలక అంశంపై జరుగనున్న కేంద్ర కేబినెట్ భేటీకి ముందు ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ కోర్‌కమిటీ భేటీ కానుందని సమాచారం. దోషులైన ప్రజా ప్రతినిధులను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సుపై కేంద్ర కేబినెట్ చర్చించనున్న నేపథ్యంలో జరిగే ఈ కోర్‌కమిటీ భేటీలో రాష్ట్ర అంశాలకు కూడా చోటు లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు కోసం ఇప్పటికే యూపీఏ భాగస్వామ్య పక్షాలు అంగీకరించటం, పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయించి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన అంశాలపై కూడా ఈ కోర్ కమిటీ, కేబినెట్ సమావేశాల్లో చర్చ జరుగుతుందని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానాన్ని దాదాపుగా ధిక్కరించే స్థాయిలో వ్యవహరించటం, మీడియా ముందు ప్రకటనలు చేయటం కూడా కోర్ కమిటీలో ప్రస్తావనకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్‌లో వేరు కుంపటి రాజేయటం, తరువాతి పరిణామాలను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకునే అవకావముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. హైకమాండ్ సూచనల మేరకే రాష్ట్రంలో సేవ్ కాంగ్రెస్.. సేవ్ ఆంధ్రవూపదేశ్ అనే కొత్త నినాదాన్ని సీమాంధ్ర మంత్రులు ముందుకు తెచ్చారని, ఈ నేపథ్యంలో కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన జరిగే అవకాశాలు లేకపోలేదని మరో సీనియర్ మంత్రి అన్నారు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.