ప్రత్యేక రాష్ట్రంలో దభోల్ షాక్!

అది ఇప్పటికే అటు కేంద్రానికి.. ఇటు మహారాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించిన ప్రాజెక్టు! పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి.. అరకొరగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న ప్లాంట్! పైగా అందులో ఒక్క యూనిట్ ఉత్పత్తి జరగాలంటే ప్రస్తుతం ఖర్చు చేస్తున్నదానికి రెండింతలు ఖర్చు పెట్టాల్సిందే! అలాంటి ప్రాజెక్టును త్వరలో ఏర్పడబోయే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి అంటగట్టేందుకు రంగం సిద్ధమవుతోంది! తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌లోటును పూడ్చేందుకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్త పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లులో పొందుపరిచిన విషయం తెలిసిందే.

అయితే రామగుండం వద్ద ఉన్న ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌కు అదనంగా మరొక పవర్ ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటుచేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ, మహారాష్ట్రలోని దభోల్ గ్యాస్ పవర్ ప్రాజెక్టును ప్యాకేజీ కింద అంటగట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకాలం అటు కేంద్రానికి, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించిన ఈ ప్రాజెక్టును తెలంగాణకు పవర్ ప్యాకేజీ కింద ఇచ్చి చేతులు దులుపుకునేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, గెయిల్‌ల సంయుక్తనిర్వహణ (జేవీసీ)లో ఉన్న ఈ దభోల్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఎన్టీపీసీ, గెయిల్ సంస్థలు కేంద్రానికి ప్రతిపాదన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్‌జీపీపీఎల్)గా మనుగడలో ఉన్న దభోల్ గ్యాస్ పవర్ ప్రాజెక్టు భవిష్యత్తు తెలంగాణకు ఆర్థికపరమైన ఇబ్బందులతో గుదిబండగా మారే ప్రమాదం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫెర్టిలైజర్ కేటగిరిలో ఉన్న దభోల్ ప్లాంట్‌కు 9.7ఎంఎస్‌సీఎండీ గ్యాస్ అవసరాలున్నాయి. కేంద్ర సాధికారత కమిటీ 8.5 ఎంఎస్‌సీఎండీ గ్యాస్ కేటాయింపులు జరిపినప్పటికీ ఇప్పటివరకు 0.9 ఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నది. ఫలితంగా గత దశాబ్దకాలంగా దభోల్ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకుండాపోయింది. దీంతో తీవ్రనష్టాలను ఎదుర్కొంటూ నాన్-పర్ఫామింగ్ అసెట్స్(ఎన్‌పీఏ)గా మారే ప్రమాదంలో పడింది. దభోల్ పవర్ ప్రాజెక్టులో ఎన్టీపీసీ 32.86శాతం వాటా(రూ.974కోట్లు), గెయిల్ 32.86శాతం, మహారాష్ట్ర ప్రభుత్వం 17.41శాతం వాటాలను కలిగి ఉన్నాయి. సుమారు రూ.8వేల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్న దభోల్ ప్లాంట్‌ను తెలంగాణకు ప్యాకేజీ కింద ఇవ్వడం వెనుక బలమైన రాజకీయకారణాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దభోల్ ప్లాంట్‌కు డొమెస్టిక్ గ్యాస్ వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కనీస యూనిట్ ధర రూ.8 వరకు ఉంటుంది. అదే ఎల్‌ఎన్జీ ద్వారా అయితే యూనిట్ ధర రూ.12 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ ధరలు 4.2 డాలర్ల నుంచి 8.4 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని, వచ్చే రెండుమూడేళ్లలో గ్యాస్ ధర 12 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుందని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఉత్తర భారతం నుంచి దక్షిణ ప్రాంత రాష్ర్టాలకు సదరన్ గ్రిడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో యూనిట్ రూ.3కే విద్యుత్ అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉన్న సమయంలో దభోల్ ప్లాంట్ నుంచి యూనిట్ రూ.8 చొప్పున ఉత్పత్తి చేసి తెలంగాణ ప్రజల నెత్తిపై రుద్దడమేమిటనేదే ప్రశ్న.

1991లో కేంద్రం ఎనిమిది ఫాస్ట్‌ట్రాక్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతించింది. అందులో భాగంగా మహారాష్ట్రలో 2,140 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు(దభోల్/రత్నగిరి ప్లాంట్) ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఎన్‌రాన్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండు దశల్లో (740 మెగావాట్లు, 1,400 మెగావాట్లు) ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉండగా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పవార్ ఉన్నప్పుడు తొలిదశ (740 మెగావాట్లు) పూర్తయింది. పవర్ ప్రాజెక్టులపై దేశంలోని రాజకీయనేతలను చైతన్యవంతుల్ని చేయడానికి సుమారు రూ. 80కోట్లు ఖర్చుచేసినట్లుగా ఎన్‌రాన్ తన అకౌంట్స్‌లో పేర్కొనడం అప్పట్లో పెద్ద దుమారానికి దారితీసింది.

This entry was posted in ARTICLES.

Comments are closed.