ప్రజల మనిషి ధర్మభిక్షం-బండారి పరమేశ్ గౌడ్

భూ మి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ధర్మభిక్షం ‘దున్నేవాడికే భూమి’ తోపాటు ‘గీసే వానికే చెట్టు’ నినాదమిచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వారిలో మొదటివారు. గీత కార్మికుల పక్షాన మొదటి నుంచి గొప్ప పోరాటం సల్పిన గీత వృత్తి పితామహులు ధర్మ భిక్షం. విద్యార్థి దశ నుంచే తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన నిజమైన కమ్యూనిస్టు ధర్మభిక్షం. బాల్య దశలోనే అభ్యుదయ భావాలను అలవర్చుకొని తాను చదువుతున్న పాఠశాలలో విద్యార్థులను చైతన్య పర్చి నిజాం నవాబు జన్మదిన వేడుకలను బహిష్కరించారు. నిజాం వూపభుత్వంలో విద్యార్థులు జరిపిన మొట్టమొదటి ఆందోళన విజయవంతం కావటంతో ఈ వార్త సంస్థానం అంతటా పెద్ద సంచలనం సృష్టించింది. పత్రికలు పతాక శీర్షికలు పెట్టి రాశా యి. మేధావులు, ప్రజాస్వామికవాదులు దీన్ని ఒక్క మహత్తర సంఘటనగా భావించి ధర్మభిక్షం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టా రు. అప్పటి నుంచి ధర్మభిక్షం పై నిఘా ప్రారంభమైంది. 1937లో ధర్మ బిక్షంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తూ వృత్తి కాలమ్ లో ‘ అవరాగాడు’ అని నిజాం పోలీసులు చూపించడం జరిగిందియగామాల్లో దొరలు, దేశ్‌ముఖ్‌లు, పెత్తందార్లు చేస్తున్న ఆరాచకాలను ఎండగడుతూ పీడిత, తాడిత జనం పక్షాన నిలబడినందుకు ధర్మభిక్షంకు నిజాం సర్కార్ ఇచ్చిన బిరుదు అవరాగాడు.
ధర్మ భిక్షం స్నేహితుడైన రౌతు జనార్దన్‌రావు హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో చదివేవాడు. వారి తండ్రి ఊరిలో హత్యకు గురైన వార్తను తెలియచేయడానికి ధర్మభిక్షం రెడ్డి హాస్టల్‌ను సందర్శించినప్పుడు కొత్త ఆలోచనలను రేకెత్తించింది. విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతంగా నిర్మించాలనే ధృఢ సంకల్పం కలిగించిందని ధర్మభిక్షం చెప్పేవారు. ఆ ఒరవడిలోనే సూర్యాపేటలో విద్యార్థులకు హాస్టల్ నడిపారు. హాస్టల్ ప్రథమ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ కోత్వాల్ రాజ్‌బహుదుర్ వెంకవూటాండ్డి ధర్మభిక్షం గురించి చెప్పుతూ ‘ఏక్ హాత్‌సే భిక్షా మాంగ్ కర్- దూస్‌రే హాత్‌సే ధర్మకర్‌నే వాలా సిర్ఫ్ భిక్షం నహీ ఓ ధర్మభిక్షం హై’ (ఒక చేతితో దానమడుగుతూ- రెండవ చేత్తో ధర్మం చేస్తున్న వ్యక్తి కేవలం భిక్షం కాదు -ధర్మభిక్షం) ఈ బిరుదుతో భిక్షం నుంచి ధర్మభిక్షం అయ్యారు అయన. తాను నడిపిస్తున్న హాస్టల్ ద్వారా ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేశారు.

నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో మొదటి కమ్యూనిస్ట్ సెల్ నిర్మాణం ధర్మభిక్షం నాయకత్వంలోనే జరిగింది. సూర్యాపేట చుట్టు పక్కల గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగురవేసి పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. ప్రజా పోరాటాలకు సూర్యాపేట కేంద్ర బిందువయ్యింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లాగా పేరొందడానికి ధర్మభిక్షం నాయకత్వంలో చేసిన పోరాటాలే కారణం అని నేటికీ చెప్పుకుంటారు. నల్లగొండ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసి పార్టీ ప్రజాసంఘాలను ఊరూరా నిర్మాణం చేశారు. జిల్లా ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా నిలిచారు. సామాన్య రైతు కూలీలను మొదలు కొని విద్యావంతులను, ఉద్యోగులను, మహిళలను పార్టీ ఉద్యమాల్లోకి ఆకర్షించి పార్టీని అగ్రభాగాన నిలిపారు. పార్టీ ఏ కార్యక్షికమాన్ని ఇచ్చినా, ఏ పోరాటానికి పిలుపు ఇచ్చినా నూటికి నూరు పాళ్లు విజయవంతం చేసి ఎన్నో ప్రజా సమస్యలపై విజయం సాధించారు. అహర్నిషలు పేదల కోసం పనిచేస్తూ, తపిస్తూ జీవితాంతం పేదల పెన్నిధిగా ధర్మభిక్షం నిలిచారు.

ధర్మభిక్షం ప్రజా జీవితంలోకి వచ్చిన నాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, నాయకుడిగా పోరాడుతూనే.., కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేక పోరాటాలు నిర్మించారు. తాను ఓ సామాన్య కల్లుగీత కార్మికుని కొడుకుగా గీత కార్మికుల కష్టాలు, కన్నీళ్లు దూరం చేయడానికి నిరంతరం కృషి చేశారు. దున్నేవాడిదే భూమి అన్నట్లుగా గీసే వాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి గీత కార్మికుల హక్కుల కోసం పోరాడారు. వారి సంక్షేమం కోసం కల్లు గీత కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు.
మొదటి సారిగా ధర్మబిక్షం నాయకత్వంలోనే ఏడు గీత కార్మిక సహకార సంఘాలు ఏర్పాటు అయ్యాయి. ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రవేశించి కూడా గీత కార్మికుల పక్షాన నిరంతరం మాట్లాడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వారిలో ధర్మబిక్షం మొదటివారు. ధర్మబిక్షం కృషి కారణంగానే ప్రమాదవశాత్తు ఏ గీత కార్మికుడైనా చెట్టు మీద నుంచి పడితే.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విధానాన్ని ప్రభుత్వ ప్రకటించింది.అలాగే కల్లుగీత కార్మిక సంక్షేమం కోసం జీవో.560 తీసుకురావడంలో ధర్మభిక్షం పాత్ర ఎనలేనిది. ఈ జీవో ప్రకారం ప్రతి కల్లుగీత కార్మికునికి బీమా సౌకర్యం కల్పించాలి. ఒక్కో సొసైటీకి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి గీత కార్మికుల జీవనోపాధికి కృషిచేయాలి.

1977 ప్రాంతంలో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం కల్లును కూడా మద్యం అని చెప్పి నిషేధించింది. కల్లును మద్యం కిందికి తేవడం సరికాదని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి కల్లుపై నిషేధం ఎత్తి వేయించారు. ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక పోరాట కాలంలో కూడా కల్లును నిషేధించే కుట్రలు జరిగితే వాటికి వ్యతిరేకంగా పోరాడారు. కల్లును నిషేధిస్తే.. అదే వృత్తిగా బతుకుతున్న తాటి, ఈత కల్లు కార్మికులు లక్షలాదిగా ఉపాధి కోల్పోతారని ధర్మభిక్షం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గీత కార్మికులను సంఘటితం చేసి పోరాటాలు చేశారు. విజయాలు సాధించారు.

గీత కార్మికుల పట్ల ధర్మభిక్షం నిబద్ధత ఈనాటిది కాదు. ఆయన కమ్యూనిస్టు గెరిల్లా గా తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు కూడా గీత కార్మికుల పక్షాన నిలిచి కల్లు మద్యం కాదని వాదించి గెలిచారు. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలు కల్లు తాగడం నిషేధం. అందుకోసం ఊళ్లలో తాటి, ఈత చెట్లను నరికేందుకు కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వడంతో దానిని వ్యతిరేకించి నిలుపుదల చేయించారు.
ధర్మభిక్షం నల్లగొండ జిల్లా మునుగోడు తాలూకాలోని ఊకొండి గ్రామంలో సాధారణ కల్లుగీత కుటుంబంలో1922 ఫిబ్రవరి 15న జన్మించారు. పేదరికంలో కూడా కష్టపడి చదివి, పేదల కోసం పనిచేసి పేదల పెన్నిధిగా కడదాకా నిలిచారు. నిరంతరం పేదల పక్షాన పోరాడే ఆయన 2011 మార్చి 26న చివరి శ్వాస విడిచారు. నిజమైన ప్రజల మనిషిగా, ప్రజా నాయకుడిగా..పార్లమెంటు సభ్యుడుగా ఉండి సాదాసీదా సామాన్య జీవనం గడిపి ఎందరికో ఆదర్శవూపాయుడయ్యారు. ఆయన లేనిలోటు కల్లుగీత కార్మికులకు తీర్చలేనిది. ఆయన ఆశయాల సాధనకోసం కల్లుగీత కార్మికులేకాదు ప్రతి కష్టజీవి పాటు పడిన నాడే ఆయనకు నివాళులు అర్పించిన వారిమవుతాం.

-బండారి పరమేశ్ గౌడ్
(నేడు ధర్మభిక్షం ప్రథమ వర్ధంతి.)

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.