ప్రజల ఆశీస్సులే నాకు అండ

-63వ పుట్టినరోజు వేడుకల్లో నరేంద్రమోడీ..
– ఎన్నికల కోసం సామాన్యుడి ఎదురుచూపు
– ఘనంగా వేడుకలు.. దేశవ్యాప్తంగా బీజేపీ సంబురాలు..

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మంగళవారం 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ 63వ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రధాని అభ్యర్థిగా తొలి పుట్టినరోజు కావడంతో నరేంద్రమోడీ గుజరాత్‌లో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో యూపీఏ సర్కారుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ‘తొలిసారి సామాన్యులే ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. వారు అశాంతితో ఉన్నారు. ఎన్నికలు త్వరగా వస్తే ప్రభుత్వాన్ని దింపేయాలని భావిస్తున్నారు’ అని మోడీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆశీస్సులు తనకు అండగా ఉంటాయని, తన కార్యసిద్ధిలో బలాన్ని చేకూరుస్తాయని అన్నారు.

modi2kil ముస్లింలకు బీజేపీ గాలం: కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరొందిన నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నియమించిన నేపథ్యంలో ముస్లిం వర్గాలను ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మోడీ పుట్టినరోజు సందర్భంగా లక్షమంది ముస్లిం కార్యకర్తల నియామకానికి బీజేపీ మంగళవారం భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముంబైలోని చారిత్రక మక్దూం షా బాబా ప్రార్థన మందిరం (మహీం దర్గా)లో బీజేపీ మైనారిటీ సెల్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. మోడీ దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.