ప్రజల ఆకాంక్షలను ప్రణాళికలో చేరుస్తున్నం-కేసీఆర్

 
గతంలో ఏ పార్టీలు కూడా ప్రజలకు చేయని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నామని, కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, సరికొత్త పంథాలో తమ మ్యానిఫెస్టో ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణను, ప్రజలకున్న ఆకాంక్షలను ఈ మ్యానిఫెస్టోలో చేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రెండు పార్టీల ప్రభుత్వాలను చూశామని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా పాలించాయో మనందరికీ తెలుసునని అన్నారు.
kcr
చంద్రబాబు పాలించినప్పుడే కాంట్రాక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చాడని, దీన్ని కాంగ్రెస్ కొనసాగించిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంట్రాక్టు విధానం ఉండనే ఉండదని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రోస్టర్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు 100శాతం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన పైలా శేఖర్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ రవీందర్, 15 మంది మాజీ కార్పొరేటర్లు, నల్గొండకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ కండువాలు వేసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనేది చెప్పేందుకు ఎన్నికల ప్రణాళికను తయారు చేస్తున్నామని, ఇప్పటికే తయారైన డ్రాఫ్ట్‌కాపీని పత్రికా సంపాదకులకు, మేధావులకు, సీనియర్ జర్నలిస్టులకు, విద్యావేత్తలకు అందించానని, వారు ఇవాళ దానిపై అభిప్రాయాలు తెలియజేశారని అన్నారు.

ఆజంజాహీ మిల్లును తెరిపిస్తం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఆజంజాహీ మిల్లును అడుగునాశనం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ మిల్లు మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడులోని తిరువూరులాగా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌గా ఎదగాలని అన్నారు. ఈ అంశాన్ని కూడా మ్యానిఫెస్టోలో చేర్చామని తెలిపారు. జాతీయస్థాయి మార్కెటింగ్ చేసుకోవడానికి వరంగల్ నుండి రైల్వేలైన్ కూడా ఉందని అన్నారు. ఆజంజాహీ మిల్లు చీకట్లో ఉందని, దీన్ని కొద్ది రోజుల్లోనే కళకళలాడేలా చేస్తామని హామీ ఇచ్చారు. మూడు నాలుగురోజుల్లోనే మ్యానిఫెస్టో ప్రింట్ అవుతుందని, దీన్ని విడుదల చేయగానే గ్రామగ్రామాన అందుతుందని, ఎక్కడికక్కడ నాయకులు స్పందించి, ప్రజల మధ్య దీనిపై చర్చ పెట్టాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సాగునీరు, లక్ష రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, వృద్ధులకు వెయ్యిరూపాయల పెన్షన్, వికలాంగులకు రూ.1500, మూడు లక్షల రూపాయలతో ఇళ్లు వస్తాయని ప్రజలకు వివరించాలని అన్నారు.

పొన్నాలపై ఇంకా ఉన్నాయి
పొన్నాల లక్ష్మయ్యపై ఇంకా ఉన్నాయని, వాటిని కూడా ప్రజల్లో చర్చకు పెడతామని అన్నారు. పొన్నాల ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే అక్రమ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని, వైఎస్ ప్రభుత్వంలోనే ఆయన అక్రమ ప్రాజెక్టులు మంజూరు చేశారని ఆరోపించారు. ఇక టీడీపీ తెలంగాణ పార్టీ కాదని, అది ఆంధ్రపార్టీ అని అన్నారు. చంద్రబాబు మనసు ఆంధ్రవైపే లాగుతుంది కానీ తెలంగాణవైపు ఉండదని చెప్పారు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కుక్కిన పేనులా ఉన్నాడని, చంద్రబాబు అంటేనే విషమని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టు తెలంగాణకు వద్దని టీఆర్‌ఎస్ అంటోందని, దీనికి చంద్రబాబేమంటాడని ప్రశ్నించారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగా ఉంచాలని టీఆర్‌ఎస్ అడుగుతోందని, దీనిపై కూడా చంద్రబాబు మాట్లాడటం లేదని అన్నారు. రేపు తెలంగాణ కోసం ఉంటవా? ఆంధ్రవైపు ఉంటవా? అంటే మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు అనేక మాటలు చెప్పి వంచించారని కేసీఆర్ విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే, గల్ఫ్ బాధలు తప్పాలంటే, చేనేత కార్మికుల ఆకలిచావులు ఆగాలంటే, తెలంగాణలో కరెంటు కోతలు తప్పాలంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణలో ఉన్న కరెంటు కోతలకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. మళ్లీ వాళ్లను నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనే ఆలోచన ఉందని, అయినా ఇతర పార్టీల నేతలు జిమ్మిక్కులు, టక్కుటమార, గజకర్ణగోకర్ణ విద్యలను ప్రదర్శిస్తారని, వాటినెవ్వరూ నమ్మెద్దని అన్నారు. రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుదామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో నల్గొండకు చెందిన వారిలో రాంరెడ్డి, చందర్ నాయక్, సంతోష్, శ్రీశైలం, సత్తయ్య, నర్సింహా, యాదగిరి, ఐలయ్య, భూపాల్‌రెడ్డి, సంతోష్ తదితరులున్నారు. వేదికపై నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా నేతలు కొండా సురేఖ, కొండా మురళి, నల్గొండ జిల్లా నాయకులు బూరనర్సయ్యగౌడ్ తదితరులున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.