ప్రగల్భాలు చాలు.. – తన్నీరు హరీశ్ రావు


సంగారెడ్డిలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పరిశీలిస్తే ఏమర్థమవుతుంది? మరో రూ.42వేల కోట్లతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని విస్తరిస్తారు. ముడిసరుకు మీద ఖర్చు తగ్గడం కోసం బయ్యారం ఖనిజం కేటాయిస్తారు. ఫలితంగా పదివేల కోట్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. మరో 42వేల కోట్ల అదనపు పెట్టుబడి లాభాలు చేకూరుతాయి. అదనంగా మరో 34వేల ఉద్యోగాలు వస్తాయి. మరి తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది? ఎప్పుడు అమలువుతుందో తెలియని ముఖ్యమంత్రి వాగ్దానం మిగులుతుంది… ఈ వివక్షను ప్రశ్నిస్తే అది ప్రాంతీయ వాదం. జాతీయతకు వ్యతిరేకం.

సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచే విధంగా ఉన్నాయి. ఆయన శరీర భాష, ముఖకవళికలు, చేతి విసురు, మితిమీరుతున్న ఆయన అతిశయానికి అద్దంపట్టే విధంగా ఉన్నాయి. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను.. ఏం చేస్తారో చేసుకోండి’ అని అనడం కానీ, ఇప్పుడు సంగారెడ్డిలో బయ్యారం ఉక్కును తరలించి తీరుతాననడం కానీ ముఖ్యమంత్రిలోని సంకుచిత రాజకీయ వైఖరిని, అప్రజాస్వామిక దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ పాలనలో తమ పరిస్థితిని గురించిన అభద్రత, అవిశ్వాసం, ఆందోళన తెలంగాణ ప్రజలలో చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆ పదవికి ఉండే ఉదాత్తతకు, ఔన్నత్యానికి భంగం కలిగిస్తున్నాయి. పదవిలో ఉన్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, నిష్పాక్షికంగా ప్రజలకు సేవచేస్తానని చేసే ప్రమాణం అర్థం లేనిదిగా మారుస్తున్నాయి.

ప్రభుత్వ పరిపాలనా సారథిగా, ప్రజల యోగక్షేమాలకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది. తమ పాలన పట్ల ప్రజలలో భయ సందేహాలు వ్యక్తమవుతున్నప్పుడు మరింత బాధ్యతగా, వినయంగా, విశ్వసనీయంగా ప్రవర్తించాలి. ప్రతి మాటలో సంయమనం, సహనం కనిపించాలి. అడుగడుగునా, హుందాతనం తొణికిసలాడాలి. కానీ అందుకు భిన్నంగా దిక్కున్నచోట చెప్పుకోండి. ఏం చేస్తారో చేసుకోండి అని సవాళ్లు విసిరితే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఈ ధోరణి పదవీస్థాయినేకాదు, వ్యక్తి స్థాయిని కూడా దిగజారుస్తుంది. ముఖ్యమంత్రి విసురుతున్న సవాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై చేసిన సవాలు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగించే సవాలు. తెలంగాణ ఆదివాసీల బతుకులో విధ్వంసాన్ని సృష్టించే సవాలు. బయ్యారం, గూడూరు, భీమదేవరపల్లిలోని వేలాది ఎకరాల భూమిలోని ఖనిజాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమకు తరలించేందుకు విడుదలచేసిన జీవోను వెనక్కితీసుకునేది లేదని ముఖ్యమంత్రి సహజ సామాజిక న్యాయసూత్రాలకు విరుద్ధంగా సవాలు చేస్తున్నారు. ఇంతకూ టీఆర్ఎస్ ఏమంటున్నది? బయ్యారంలో ఉన్న ఉక్కును తెలంగాణ ప్రాంతంలోనే వినియోగించేందుకు అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నది. అట్లా చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు ఆదివాసీల జీవితాల్లో అభివృద్ధికి, వికాసానికి దోహద పడినట్లవతుందనే న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టింది. ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి సంకుచితమైనదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

మరొక పక్క బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీ పెడతామని, ఉద్యోగాలిస్తామని కిరణ్ బుకాయిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకోసం పోరాడే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పెడతారో, ఎవరు పెడతారో, ఎవరికి ఉద్యోగాలిస్తారో స్పష్టంగా ప్రకటించమని డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టే మాట నిజమైతే మరి ఇప్పుడు ఇనుప ఖనిజాన్ని ఎందుకు విశాఖపట్నం తరలిస్తున్నారో చెప్పమని మౌలిక ప్రశ్న వేస్తున్నాము. ఎప్పుడో ఇక్కడ ప్లాంట్ పెడతామని నమ్మించ్చి, ఇప్పుడైతే ఖనిజాన్ని విశాఖకు తరలించడంలో ఆంతర్యం ఏమిటని టీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. తెలంగాణ ప్రజలకు దక్కవలసిన ఉద్యోగాలు దక్కకుండా తెలంగాణ ఆదివాసుల నోట్లో మట్టికొట్టి, ఆంధ్ర ప్రాంతం వారికి ఆ ఉద్యోగాలు కట్టబెట్టాలన్నది ముఖ్యమంత్రి అసలు ఆలోచన. దీనికి జాతీయ సంపద, జాతీయ ప్రయోజనాలు అనే అందమైన ముసుగు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారం ఉక్కును బయ్యారంలోనే వినియోగించి ఉత్పత్తి చేస్తే అది జాతీయ సంపద కాకుండా పోతుందా? ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పరిశీలిస్తే ఏమర్థమవుతుంది? ‘బయ్యారం గనులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగంకు కేటాయించాం.

ఇది ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ 15వేల కోట్లు. మరో 42 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముడిసరుకు కోసం ఉక్కు ఫ్యాక్టరీలు 35 నుంచి 40 శాతం ఖర్చుచేస్తే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం 70శాతం (సుమారు పదివేల కోట్లు) ఖర్చు చేస్తున్నది. మనం ఖనిజం ఇస్తే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నా’మని అన్నారు కిరణ్. అంటే మరో 42వేల కోట్లతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని విస్తరిస్తారు. ముడిసరుకు మీద ఖర్చు తగ్గడం కోసం బయ్యారం ఖనిజం కేటాయిస్తారు. ఫలితంగా పదివేల కోట్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. మరో 42వేల కోట్ల అదనపు పెట్టుబడి లాభాలు చేకూరుతాయి. అదనంగా మరో 34వేల ఉద్యోగాలు వస్తాయి. మరి తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది? ఎప్పుడు అమలువుతుందో తెలియని ముఖ్యమంత్రి వాగ్దానం మిగులుతుంది. లొట్టి పిట్ట పెదవులకు నక్క ఆశ పడ్డట్టు ఎప్పుడోవచ్చే ఫ్యాక్టరీ కోసం ఎదురుచూపు మిగులుతుంది. ఈలోగా నిరాఘాటంగా ఖనిజమంతా విశాఖకు తరలిపోతుంది. ఈ వివక్షను ప్రశ్నిస్తే అది ప్రాం తీయ వాదం. జాతీయతకు వ్యతిరేకం!

నిజానికి ఖనిజం దొరికిన చోటనే ఉత్పత్తి జరగాలనడం సహజ న్యాయసూత్రం. కామన్‌సెన్స్. రవాణా ఖర్చు ఉండదు. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఇతర ఖనిజాలు డోలమైట్, సున్నపురాయి, క్వార్ట్, బొగ్గుతో పాటు గోదావరి, మున్నేరు నీళ్లు, రవాణాకు కావాల్సిన రైల్వే వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కండలు కరిగించి చెమట చిందించడానికి తెలంగాణ ప్రజలు, ఆదివాసీలున్నారు. అయినా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టరు. పెడతామనే ఆశ చూపిస్తారు. ఖనిజం తరలిస్తారు. ఇది అచ్చంగా వలసవాద మనస్తత్వం కాక మరేమిటి? నిన్నటిదాకా తెలంగాణ ప్రజలు తమకు నిధులు, నీళ్ళు, నియామకాలలో అన్యాయం, దోపిడీ జరుగుతుందని చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు అదనంగా నిక్షేపాలు అని కూడా చేర్చుకోవాలి. ఒకవైపు పోలవరంలో ముంచుతారు. మరో వైపు ఖనిజ నిక్షేపాలు తరలించుకుపోయి భూమిని గుల్ల చేస్తారు. తెలంగాణ బొగ్గుతో రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్ వెలిగిస్తారు. తెలంగాణను ఓపెన్ కాస్ట్‌లతో బొందలగడ్డగా మారుస్తారు తప్ప ఇక్కడ కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయరు. ఆంధ్రలో పండే మూడో పంట కోసం, ఆంధ్రలో అదనంగావచ్చే ఉద్యోగ అవకాశాల కోసం, ఆంధ్రకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రజలు నిర్వాసితులు కావాలి. ఆంధ్ర అభివృద్ధి కోసం తెలంగాణను ఎరువుగా మార్చడమే జాతీయత. అడవిని, భూమిని కోల్పోయి పొట్ట చేతపట్టుకొని వలసపోతున్న ఆదివాసీ కోయ, చెంచు ప్రజల కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడమంటే అది ప్రాంతీయ వాదం. బయ్యారం గనులు రక్షణ స్టీల్స్‌కు కేటాయించినప్పుడు టీఆర్ఎస్ మౌనంగా ఎందుకు ఉన్నదని, కేసీఆర్ బెల్లంకొట్టిన రాయిలా ఎందుకున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్న అడిగే నైతిక అర్హత ముఖ్యమంత్రికి ఎక్కడిది? బయ్యారం గనులను రక్షణ స్టీల్స్‌కు కేటాయించింది ఎవరు? వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా? ఆయన అవినీతి మీద టీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేసింది. కేసీఆర్ నిప్పులు చెరిగిండు తప్ప ఎన్నడూ బెల్లం కొట్టిన రాయిలా లేడు. నిజానికి ఆ రోజు వైఎస్ అవినీతితో అంటకాగింది కిరణ్ కుమార్ రెడ్డి. ఆ రోజు ఆయన అవినీతిని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే వైఎస్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడిందీ కిరణ్ కుమార్ రెడ్డే. రాజీ లేకుండా తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కిరణ్ ఏ నైతిక పునాది మీద ప్రశ్నిస్తారు?

సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి తెలంగాణఉద్యమాన్ని అణచివేస్తాననే పరోక్ష హెచ్చరికలతో పాటు ప్రగల్భాలెన్నో పలికారు. తెలంగాణ ఉద్యమం మీద అణచివేతను ప్రయోగించడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి మొదటివాడేం కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి మొదలుకొని వైఎస్ దాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు అదే ప్రయత్నం చేశారు.

అయినా తెలంగాణ ఉద్యమం అజేయంగా కొనసాగుతున్నది. ఒక తరం తర్వాత మరొక తరం పోరాటాన్ని అందుకుంటున్నది. ముఖ్యమంత్రి కిరణ్, తెలంగాణ ఉద్యమం మీద అణచివేతను ప్రయోగించే చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవచ్చు. ఈ నిజం అర్థమవడం వల్లనే కావచ్చు కిరణ్ రెండుప్రాంతాల నడుమ విద్వేషం పెంచే విధంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాక ఆంధ్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. వైఎస్ మాదిరిగానే తాను ఉద్యమంపై అణచివేతను ప్రయోగిస్తాననే సంకేతం సీమాంధ్రకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తన ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన ఆలోచిస్తుండవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ దాదాపుగా అంతమైపోయే పరిస్థితి ఉంది గనుక సీమాంధ్రలోనైనా పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండవచ్చు.

కానీ పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తూ, అవమానకర వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పవలసింది పోయి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొట్టడమే విషాదం. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టి ఆ సమాధి మీద తన పునాది నిర్మి ంచుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజల జీవితాలను బలిపెట్టి ముఖ్యమంత్రి ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చదలచుకున్నారు. ఆ జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రేపు ప్రజలకు ఏం జవాబు చెబుతారు? ముఖ్యమంత్రి ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల మధ్య ఘర్షణలో వారంతా ఎక్కడ నిలబడతారు? ఒకవైపు కేంద్ర మంత్రి బలరాంనాయక్ బయ్యారంనుంచి విశాఖకు ఉక్కును తరలించే ప్రసక్తే లేద ని ప్రకటించారు. ఆ ప్రకటనకు విరుద్ధంగా ముఖ్యమంత్రి తరలించి తీరుతామని సంగారెడ్డిలో కుండబద్దలు కొట్టారు. మరిప్పుడు బలరాం నాయక్, ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? మౌనంగా జరుగుతున్న ద్రోహంతో మిలాఖత్ అవుతారా? ప్రజలు గమనిస్తున్నారు.

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదం కేవలం టీఆర్ఎస్‌దో కేసీఆర్‌దో అనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదు. అది తెలంగాణ ప్రజల గుండె లోతుల్లోంచి పెల్లుబుకుతోన్న నినాదం. తరతరాల వివక్ష, విద్రోహపు అనుభవాల నుంచి, ప్రజాపోరాటం కలిగించిన స్పృహ లోంచి పుట్టిన నినాదం. ముఖ్యమంత్రికి వందిమాగధుల వలె స్త్రోతం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నినాదం వెనుకున్న గంభీరమైన నేపథ్యాన్ని గ్రహించకుంటే చరిత్ర క్షమించదు. ఇనుప ఖనిజం తరలింపును అడ్డుకునే బాధ్యత కేవలం టీఆర్ఎస్ పార్టీది అనుకోవడం పెద్ద పొరపాటు. తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులదే బాధ్యత. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

రేపు ఈ గడ్డ మీద, ఇక్కడి ప్రజల మధ్య రాజకీయంగా మనుగడ సాధించాల్సిన వారు ఈ సత్యం గుర్తించాలి. ఇవాళ బయ్యారంలో ఇనుపరవ్వను తరలించే ప్రయత్నం చేస్తే అక్కడి మట్టి రేణువులు సైతం తిరగబడతాయి. జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలను ముఖ్యంగా ఆదివాసీలను టీఆర్ఎస్ మేలుకొలుపుతుంది. పోరాటాన్ని తీవ్రతరం చేస్తుంది. ఉద్యమ తీవ్రతను సూచించడానికి భూకంపం అనే మాటను కేసీఆర్ ఉపయోగించారు. భూకంపాన్ని ఎదుర్కొంటానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి భూకంపాన్ని ఎదుర్కోవడం ఏముంటుంది? జరిగిన నష్టాన్ని అంచనా వేసుకోవడం, రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రతను కొలుచుకోవడం తప్ప!

– తన్నీరు హరీశ్ రావు టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.