హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌కు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ వ్యవహరించిందని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమరు బిల్లుపై చేసిన సంతకం ఆరక ముందే ఆర్డినెన్స్‌ను జారీ చేసి చట్టాన్ని ఉల్లంఘించారని లేఖలో ఆరోపించారు. ఆర్డినెన్స్ పేరుతో కేంద్రం చట్టానికి తూట్లు పొడిచిందని ఫిర్యాదు చేశారు. కేబినెట్ సంప్రదింపులు, జీవోఎం కసరత్తు, లోక్‌సభ, రాజ్యసభలో చర్చల తర్వాత రూపొందించిన తెలంగాణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెళ్లడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల్లోని గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తెలంగాణకు నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత దేశాధినేతగా తమరిపై ఉందని పేర్కొన్నారు.
అసెంబ్లీ అభిప్రాయం లేకుండా సరిహద్దులు మార్చడం ఆర్టికల్-3ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ వల్లఅసలే విద్యుత్ కొరత ఉన్న తెలంగాణకు మరింత నష్టం జరుగుతుందని వివరించారు. సరిహద్దులు మార్చడం వలన ముంపుకు అవకాశంలేని సీలేరు ప్రాజెక్టును కూడా తెలంగాణ కోల్పోయే అవకాశం ఉందన్నారు. 450 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టు పోతే అసలే విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణకు మరింత నష్టమని స్పష్టం చేశారు.