పోలవరంపై ఆర్డినెన్స్ అప్రజాస్వామికం: కేసీఆర్

హైదరాబాద్, మార్చి 2 : భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్య అప్రజాస్వామికమని, అన్యాయమని అన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని నిరసన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలను కలుపడమే అన్యాయమైతే.. మరో అడుగు ముందుకేసి ఏడు మండలాలను కలుపుతామనడం అన్యాయానికి పరాకాష్ఠ అని అన్నారు. కేంద్రం ఈ ప్రమాదకర నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులను తాను ఢిల్లీలో వ్యక్తిగతంగా కలిసి హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి రాజముద్ర వేసి.. సిరా తడి ఆరకముందే తెలంగాణ గొంతు కోస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని.. న్యాయం జరిగేవరకు టీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.