పేదల ఇళ్లకు ఎసరు పెట్టిన చిత్తూరువాసి.. కోరస్ పలికిన హెచ్ఎండీఏ!

ప్రభుత్వంలో తమకున్న పలుకబడిని ఉపయోగించి హౌసింగ్ సొసైటీలోని ఖాళీస్థలాన్ని ప్లాట్‌గా మార్చుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బడాబాబు హెచ్‌ఎండీఏ అధికారులతో కుమ్ముక్కై పేద వాళ్ల ఇళ్లను కూల్చివేయించే ప్రయత్నాలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్12 , ఎమ్మెల్యే కాలనీ లో సర్వేనెంబర్ 120/403/1లో ఉన్న శ్రీ వెంక కో ఆపరేటివ్ హౌస్‌బిల్డింగ్ సొసైటీలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఆ బడాబాబు తన పరపతిని ఉపయోగించి ప్లాట్‌నెం.176/ఎ/ఎఫ్ గా మార్చుకున్నారు. వాస్తవానికి సొసైటీ ఏర్పడ్డప్పుడు ఖాళీగా ఉన్న ఈ 450 గజాల స్థలాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాట్‌గా తయారు చేసుకున్నాడు.

అప్పుడు సొసైటీ కార్యదర్శిగా ఉన్న రామారావు, డైరెక్టర్ బెంజ్‌మన్‌లు సొసైటీ అధ్యక్షుడికి కూడా సమాచారం లేకుండా స్థలాన్ని ఈ బడాబాబు బినామీ అయిన కృష్ణాడ్డి అనే వ్యక్తికి రిజిస్టర్ చేసింది. అయితే ఈ స్థలంలో అధికభాగం సొసైటీది కాగా మిగతా భాగం పక్కనే ఉన్న హెచ్‌ఎండీఏకు చెందినది. అయితే ఈ స్థలాన్ని కొందరు హెచ్‌ఎండీఏ అధికారుల పైరవీలతో సదరు బడాబాబుకు అక్రమంగా రిజిస్టర్ చేశారు. అయితే తమ స్థలం ఇస్తున్నందుకు ప్రతిఫలంగా ప్లాట్‌కు ఎదురుగా ఉన్న ఇందిరానగర్ బస్తీలోని ఇళ్లను తొలగించి రోడ్డు వేసుకోవడానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఇప్పించాలని షరతు విధించారు. ఈ షరతు ఇందిరానగర్ బస్తీవాసులకు శాపంగా మారింది. ఇందిరానగర్ బస్తీనుంచి హెచ్‌ఎండీఏ ప్లాట్లకు 60 అడుగుల రోడ్డు వేస్తామంటూ మెలిక పెట్టడంతో బస్తీలోని 12మంది పేద జీవుల ఇళ్లకు ముప్పు పొంచివుంది. సొసైటీ లేఔట్‌లో ఉన్న ఖాళీ స్థలంలో ప్లాట్ ఏర్పాటే అక్రమం కాగా దాన్ని సొసైటీ పెద్దలు రిజిస్ట్రేషన్ చేయడం సొసైటీల నిబంధనలకే వ్యతిరేకమని అధికారులు మొత్తుకుంటున్నారు.

మరోవైపు హెచ్‌ఎండీఏలో పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ఓ అధికారి చేతి వాటంతో హెచ్‌ఎండీఏ కూడా నిబంధనలకు పాతరేసి ఈ ప్లాట్‌ను బడాబాబుకు రిజిస్ట్రేషన్ చేయడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా ఏర్పాటైన ఈ ప్లాట్‌ను రద్దుచేయాలని సొసైటీ మాజీ అధ్యక్షుడు లేఖ రాసినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ తమ బస్తీలో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ బడాబాబు ప్రోద్బలంతో హెచ్‌ఎండీఏ అధికారులు అడ్డుకుంటున్నారని వారన్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే అక్రమ ప్లాట్ వ్యవహారంపై, హెచ్‌ఎండీఏ అధికారుల చేతి వాటంపై లోకాయుక్తను ఆశ్రయిస్తామని బస్తీవాసులు హెచ్చరించారు. ఈ ప్లాట్ కేటాయింపు వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ బడాబాబు బారినుంచి తమ ఇళ్లను కాపాడాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.