పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

ఢిల్లీ: కమలంలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఎన్నికల ప్రచార కమిటీ పగ్గాలు మోడీకి అప్పగించటంపై అలిగిన అగ్రనేత లాల్ క్రిష్ణ అద్వానీ పార్టీ కీలక పదవులన్నింటికీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు పంపారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలపై కలత చెంది తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అద్వానీ ప్రకటించారు. పార్టీలో ప్రస్తుతం వ్యక్తిగత ఎజెండాలే ఎక్కువగా అమలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ బోర్డు, జాతీయ కార్యవర్గం , ప్రచార కమిటీల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ సాధారణ సభ్యత్వంలో కొనసాగుతానని తెలిపారు.

రాజీనామాతో పార్టీ నేతలకు అద్వానీ షాక్ ఇచ్చారు. పార్టీ జాతీయ కార్యవర్గం నరేంద్ర మోడీకి పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించడంపై అద్వానీ కినుక వహించారు. పనాజీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ గైర్హాజరయ్యారు. మోడీ అభ్యర్థిత్వంపై అద్వానీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను జాతీయ కార్యవర్గం పట్టించుకోక పోవడం, ఆర్‌ఎస్‌ఎస్ సైతం మోడీవైపే మొగ్గు చూపడం రాజీనామాకు కారణమని భావిస్తోన్నారు. 1980లో జన్‌సంఘ్ వ్యవస్థాపనలో అద్వానీ ప్రధాన భూమిక పోషించారు. మూడు దశాబ్దాలపాటు పార్టీలో వివిధ పదవుల్లో ఉండి విశిష్ట సేవలందించారు.

జీవితమంతా పార్టీ అభివృద్ధికే కృషి చేశా: అద్వానీ
తన జీవితకాలమంతా జనసంఘ్, బీజేపీ పార్టీల అభివృద్ధికే కృషి చేశానని బీజేపీ సీనియర్ నేత అద్వానీ తెలిపారు. పార్టీకి అంపశయ్యపై భీష్ముడిలా ఉన్నానంటూ అనంతరం ఆయన ట్విట్టర్‌లోపోస్టు చేశారు. పార్టీలో వ్యక్తిగత పూజలను మొదట్నుంచి అద్వానీ వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తోన్నారని అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా పార్టీ పనితీరును జీర్ణించుకోలేక పోతున్నానని, సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఎక్కువ కాలం పనిచేస్తోందని తాను అనుకోవడంలేదని తెలిపారు. పార్టీ నేతలు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్, వాజ్‌పాయ్‌ల సిద్ధాంతాలకు పార్టీ కట్టుబడి ఉన్నట్టు కనిపించడంలేదని, సిద్ధాంతాలకు కట్టుబడని పార్టీలో తాను ఎక్కువ కాలం కొనసాగలేనని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.