‘పారా’హుషార్!

army
రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు భారీగా మోహరించనున్నాయి. ఇప్పటికే 125 కంపెనీల బలగాలు విధుల్లో ఉండగా.. తాజాగా మరో వంద కంపెనీల బలగాలను రప్పించనుండటం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు హస్తిన నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అదనపు బలగాలు రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తే తలెత్తే పరిస్థితులను అదుపులో పెట్టటానికే కేంద్రం అదనపు బలగాలు పంపించటానికి అంగీకరించినట్టు పోలీసువర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయటానికే డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ మహేందర్‌రెడ్డిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ పిలిపించినట్టుగా కూడా చెబుతున్నారు. తెలంగాణ కోసం దశాబ్ద కాలానికి పైగా పోరాటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఆ తరువాత ఈ నెల 28వ తేదీలోపు తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని మీడియాతో చెప్పారు. ఆ తరువాత వరుసగా జరుగుతూ వస్తున్న పరిణామాలు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్న సంకేతాలను వెలువరిస్తూ వస్తున్నాయి. మొదటి నుంచి సమైక్యవాదాన్ని వినిపిస్తూ వస్తున్న కాంగ్రెస్ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాపరెడ్డి ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేస్తుందేమో అని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లోనే డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. నక్సల్స్ సమస్యపై చర్చించటంతోపాటు రాష్ట్రానికి హెలికాప్టర్ కేటాయింప చేసేందుకు ఢిల్లీ వెళ్లామని డీజీపీ దినేష్‌రెడ్డి అధికారికంగా చెబుతున్నా ఢిల్లీలో వేర్వేరు స్థాయి అధికారులతో జరిగిన సమావేశాల్లో తెలంగాణ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

అదనపు బలగాలు…
ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్రానికి మరో వంద కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను పంపించటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 125 కంపెనీల (పన్నెండున్నర వేల మంది) కేంద్ర పారా మిలిటరీ బలగాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో వీరిలో ఎక్కువగా తెలంగాణ జిల్లాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 36 కంపెనీల బలగాలు బందోబస్తు విధుల్లో ఉన్నాయి. తాజాగా మరో వంద కంపెనీల (పదివేలమంది) కేంద్ర బలగాలను ఇక్కడికి పంపించటానికి నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రంలో పనిచేయబోయే కేంద్ర పారా మిలిటరీ కంపెనీల సంఖ్య 25 వేలకు పెరగనుంది. పోలీసు ఉన్నతాధికారులతో ఈ విషయం మీద మాట్లాడగా భద్రతా విధులు నిర్వర్తించేందుకు కేంద్ర బలగాలు రావటం సాధారణమే అని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించనుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే అదనంగా బలగాలను రప్పించారా? అని ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని స్పందించారు. అదనపు బలగాలు కావాలని దాదాపు నెల రోజుల క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పారు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.