పాతబస్తీలో రెచ్చిపోయిన అల్లరిమూకలు-అమాయకులపై దాడులు

నివురుగప్పిన నిప్పులా ఉండే పాతబస్తీ మరో మారు రణరంగమైంది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఉద్దేశపూర్వకంగా  అల్లరి మూకలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. ఓ పథకం ప్రకారం పోలీసులపై రాళ్లు విసిరారు. లాడ్‌బజార్ వైపు పరిస్థితి అదుపు తప్పగా అటువైపు పోలీసులు దృష్టి సారించే లోపే చార్మినార్ సమీపంలోని మసీదులో దాక్కున్న అల్లరి మూకలు పోలీసులపై మళ్లీ రాళ్ల వర్షం కురిపించారు. ముష్కరులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్జి చేయాల్సి వచ్చింది.

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చార్మినార్ వద్ద భాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. జీహెచ్‌ఎంసీ సర్ధార్ మహల్ ప్రాంతం నుంచి చార్మినార్ వైపు దూసుకువచ్చిన ముష్కరులు పోలీసులపై రాళ్లు విసిరారు. అలీజా కోట్ల వైపు నుంచి వస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. చార్మినార్ నాలుగు వైపుల నుంచి వస్తున్న రాళ్లతో ఒకానొక దశలో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.గుల్జర్‌హౌస్ ప్రాంతంలో బంగారం కొనుగోళ్లకు వచ్చిన ఎల్‌బీనగర్‌కు చెందిన శేఖర్ దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. గుల్జర్‌హౌస్‌తో పాటు పంజేషా, మమాజుల్మా పాఠక్ తదితర ప్రాంతాల్లో కొందరు వాహనాలపై తమ ప్రతాపాన్ని చూపించారు. పంజేషాలో ఓ వర్గం వారికి చెందిన రెండు కార్లను, ఆనంద్ భవన్ హోటల్ సమీపంలో మరో రెండు కార్లను దుండగులు అగ్నికి ఆహుతి చేశారు. వీటితోపాటు మరో మూడు ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. పోలీసులకు సంబం ధించిన ఆరు వాహనాలపై రాళ్ల రువ్విన ఆందోళన కారులు వాటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. దాదాపు 12 వాహనాలు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆందోళన కారుల దాడితో పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉర్ధూగల్లీ ప్రాంతంలో మరో వర్గానికి చెందిన రెండు వస్త్ర దుకాణాలను లూఠీ చేశారు.

అలీజా కోట్ల ప్రాంతంలో మరో రెండు దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తలాబ్ కట్టా, భవానీ నగర్, సాలం చౌక్, రెయిన్ బజార్, యాకుత్‌పురా, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌లో ఆందోళకారు లు కార్యాలయ సామగ్రిని దహనం చేసి విధ్వంసం సృష్టించారు. విధ్వంసానికి కారణ మైన పలువురు ముష్కరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాదన్నపేటలో చెలరేగిన అల్లరిమూకలు
మాదన్నపేట: పాతబస్తీలో అల్లర్లు చెలరేగిన కొద్దిసేపటికే మాదన్నపేట రెయిన్‌బజార్‌లో నమాజ్ అనంతరం ఓ వర్గానికి చెందిన అల్లరిమూకలు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వుతూ దారిన వెళ్లేవారిపై దాడులు చేశాయి. మూడు దిచక్ర వాహనాలను ధ్వంసం చేశాయి.  అల్లరిమూకల రాక్షస క్రీడలో   రంగారెడ్డి, ఏపీఎస్‌పి ఆరవ బెటాలియన్‌కు చెందిన శ్రీనివాసరావుతో పాటు ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన కూలీ అనిష్, అదే ప్రాంతానికి చెందిన మార్కండేయ చారి గాయపడ్డారు..

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.