పరువు తీశారు.. పదవులు వీడండి

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్‌లా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనట్టు తెలిసింది. ఒక్క మిజోరం మినహా ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించేందుకు సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐదు రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జ్జీలు, పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యాలపై ఆయా రాష్ట్రాల పార్టీ నేతలపై సోనియా మండిపడినట్టు తెలిసింది. కేంద్రమంత్రులు ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మొదట ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జిలు ఎన్నికల ఫలితాలపై నివేదిక సమర్పించారు.

soniamadam ఎన్నికల ఫలితాలు తమకు దిగ్భ్రాంతికి గురి చేశాయని వారు ఆ నివేదికల్లో పేర్కొన్నట్టు సమాచారం. రెండు గంటల పాటు ఘాటుగా జరిగిన ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జీలను రాజీనామా చేయాలని సోనియా సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన పథకాలపై విసృ్తత ప్రచారం చేసి పార్టీ శ్రేణులను 2014 సాధారణ ఎన్నికలకు సిద్ధం చేయాలని అధినేత్రి ఆదేశించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, అవినీతి పార్టీని ప్రజలకు దూరం చేశాయని సోనియా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సహా ఏఐసీసీ నేతలెవరూ విలేకరులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించలేదు.

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియా విలేకరులతో మాట్లాడుతూ.. తాము అన్ని రకాలుగా విఫలమయ్యామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాల్సి ఉందని, వైఫల్యాలకు కారణమేంటో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో గుర్తించి, వాటిని సమూలంగా సవరించడం ద్వారా 2014 ఎన్నికలకు పార్టీని సిద్దం చేయాల్సి ఉందని సోనియాగాంధీ ఆదివారం ఆమె విలేకరులతో అన్నారు.

ప్రధాని అభ్యర్థిని ప్రకటించండి: సోనియాకు పార్టీ నేతల వినతి
ప్రధాని అభ్యర్థిని చాలా ముందుగానే ప్రకటించిన బీజేపీ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు కారణమైంది. తమ పార్టీలో ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఎన్నికల్లో ఓటమికి ఓ కారణమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సోనియాగాంధీ నాలుగురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పోస్టుమార్టం నిర్వహించారు. కాంగ్రెస్‌లో రెండు అధికార కేంద్రాలు(పార్టీఅధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్) ఉండడం ఇబ్బందికరమని, బలమైన నాయకుడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఇప్పటికైనా మేలని వారు ప్రస్తావించారు. ప్రధాని అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో.. నాలుగురాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించిన రాహుల్‌గాంధీ ఈ ఓటమికి ఎంతమాత్రం బాధ్యులు కారని పార్టీనేతలంతా ఆయనకు అండగా నిలిచారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ ఒక్కరే పేరు ప్రస్తావించకుండా రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘ ప్రజలకు బలమైన, సకాలంలో సమర్ధమైన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకులు కావాలి. అలాంటి వారి వెంటే ప్రజలు నడుస్తారు’ అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతల అభిప్రాయాల ద్వారా ప్రధాని అభ్యర్థి ప్రకటన ప్రాధాన్యతను గుర్తించిన సోనియా ‘ దేశప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థి పేరును వెల్లడిస్తాం’ అని తెలిపారు.

చేతిని వదలబోం: ఫరూక్ అబ్దుల్లా
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. తాము కాంగ్రెస్ చేతిని వీడబోమని జమ్ముకాశ్మీర్ అధికార పార్టీ, యూపీఏ భాగస్వామి నేషనల్ కాన్ఫన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ‘నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతిన్న మాట వాస్తవమే. ఈ సమయంలోనే వారికి మేం మద్దతుగా నిలవడం అవసరం. మేం వారి చేతిని విడవబోం’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభంజనంపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. ‘ దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఎక్కడుంది? ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీయే విజయం సాధించాలి కదా’ అని వ్యాఖ్యానించారు. యూపీఏకు తమ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకురాలు, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి తెలిపారు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ నిరాశ పడాల్సిన అవసరం లేదని అన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.