పరిహారంలో పక్షపాతం

Harishపంట నష్టాల్లోనైనా, ముంపు కష్టాల్లోనైనా ఇదే తీరు
చెల్లింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
రాష్ట్రం ఒక్కటే, సీఎం ఒక్కరే, విధానాలు ఒక్కటే అయినా పంట నష్టాలకు పరిహారం చెల్లింపుల్లో మాత్రం పాలకులు పక్షపాతం ప్రదర్శిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. మూడేళ్ల కిందట తెలంగాణలో వడగళ్ల వాన కురిసి పంట నష్టం వాటిల్లితే ఇప్పటివరకు పరిహారాన్ని చెల్లించలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రలో నీలం తుఫాన్ బాధితులకు వెంటనే పరిహారాన్ని చెల్లించిన ప్రభుత్వం తెలంగాణలో కురిసిన అకాల వర్షాల నష్ట పరిహారాన్ని చెల్లించడంలో ఎందుకు వివక్ష చూపుతుందో స్పష్టం చేయాలన్నారు. ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పక్షపాత వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రలో తుఫాన్ వస్తే హెలిక్యాప్టర్‌పై వెళ్లే ముఖ్యమంత్రి తెలంగాణలో వడగళ్ల బాధిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించరని హరీష్‌రావు ప్రశ్నించారు.

సీఎం, మంత్రులు తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆంధ్రలోనైనా, (మొదటిపేజీ తరువాయి) తెలంగాణలోనైనా రైతులు, కష్టాలు, నష్టం ఒక్కటే కదా అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రైతులను ఆదుకున్నట్లుగానే తెలంగాణ రైతులనూ ఆదుకోవాలని కోరడం తప్పా? అని హరీష్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. వివక్షపై ముఖ్యమంవూతికి లేఖ రాశామని, ఈ తీరు మారకుంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రత్యక్ష పోరాటాలను చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ సరఫరాలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఆంధ్ర రైతులకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఈ విషయం విద్యుత్ సంస్థల వెబ్‌సైట్‌లో ఉందన్నారు. తెలంగాణ రైతులకు మాత్రం కనీసం మూడుగంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. పరిహారం చెల్లింపులో వివక్షపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురైన రైతుల భూములకు తాజా మార్కెట్ లెక్కల ప్రకారం పరిహారం చెల్లించాలన్న సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాలను అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కోసం ప్రత్యామ్నాయాలను ఆలోచించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఆంధ్ర రైతులకు రూ.మూడున్నర లక్షల నష్ట పరిహారాన్ని చెల్లిస్తూ, అదే తెలంగాణ రైతుకు మాత్రం కేవలం రూ.లక్షా 15 వేలు మాత్రమే చెల్లించడంలో ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లా కొండపల్లి గ్రామంలో 700 ఎకరాలు పోలవరంలో ముంపునకు గురైతే అందులో 100 ఎకరాలకు కేవలం లక్షా15వేలు మాత్రమే చెల్లించారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రకు నీళ్లివ్వడం కోసం తెలంగాణలోని గిరిజనులు, దళితులకు చెందిన 93వేల ఎకరాల భూములు, ఐదు మండలాలు పూర్తిగా, మరో మూడు మండలాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయని హరీష్‌రావు తెలిపారు. ప్రభుత్వం పట్టపగలు బరితెగించి తెలంగాణ పట్ల మోసం, దగాకు దిగిందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రులకు కనీసం సోయి కూడా లేకుండా పోయిందని, వారికి ఆ పదవుపూందుకని ఆయన అన్నారు. సీఎం వివక్షను చూపుతున్నందున గవర్నర్ తక్షణం జోక్యం చేసుకొని తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌డ్డి, కొప్పుల ఈశ్వర్, మొలుగూరి భిక్షపతి, ఎమ్మెల్సీ కనకమామిడి స్వామిగౌడ్, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జనరల్ గాదరి కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.

యాష్కీ! ఖబర్దార్.. పద్ధతి మార్చుకో: ఎమ్మెల్సీ స్వామిగౌడ్
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేసే స్థాయి నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీకి లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ- యాష్కీ! పద్ధతి మార్చుకో, లేదంటే ప్రజలే తగిన జవాబు చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ కోసం పన్నెండేళ్లుగా ఉద్యమిస్తున్న కేసీఆర్ ఆమరణ దీక్ష ద్వారా చావు కోరల్లోకి వెళ్లారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని మధు యాష్కీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటాలు చేస్తున్న టీ ఎంపీలకు ఇనుప సంకెళ్లు వేసి వెనక్కి లాగుతున్న ఘనత మధు యాష్కీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌పై బురద చల్లే దుర్మార్గపు చర్యలను మానుకోవాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేస్తూ టీఆర్‌ఎస్ కష్టాన్ని, నష్టాన్ని భరిస్తుంటే, ఆ పోరాటాలను సాకుగా తీసుకొని మధు యాష్కీ పదవులను అనుభవిస్తున్నారని స్వామిగౌడ్ ఆరోపించారు. తెలంగాణ కోసం కనీసం 11 రోజులు కూడా మధు యాష్కీ పోరాటాలు చేయలేదని ఆయన ఆరోపించారు. పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణకు ద్రోహం చేసిన ఆయన అభివూపాయపడ్డారు. కేవీపీని అరెస్టు చేయాలని టీఆర్‌ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్నారు.

బాబూ! దమ్ముంటే సిద్దిపేట నుంచి పోటీచేయాలి: కొప్పుల ఈశ్వర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు దమ్ముంటే సిద్దిపేట నుంచి పోటీ చేసి డిపాజిట్‌ను కాపాడుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేసే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓటమి చెందిన తలసానికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు తలసానికి లేదన్నారు. తమ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఎక్కడైనా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందుతారని స్పష్టం చేశారు. చంద్రబాబును సిద్దిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా చెప్పాలని తలసానిని ఈశ్వర్ సవాల్ చేశారు. రాజకీయమంటే రౌడీయిజం కాదన్నారు. తెలంగాణ బిడ్డలకు హైదరాబాద్ జాగీరేనని ఆయన స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.