పనికిమాలిన సీఎంను భర్తరఫ్ చేయాలి: కేసీఆర్

అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పనికిమాలిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే రాష్ట్రాన్ని విభజించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు ఏర్పడితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్నటి ప్రెస్‌మీట్‌లో చెప్పిన సీమాంధ్ర సమస్యలు అన్ని తీరుతాయని వివరించారు.

దోపిడీని సీఎం స్వయంగా ఒప్పుకున్నారు: కేసీఆర్
సీమాంధ్రులు నీళ్లు దోచుకుపోతున్నట్టు సీఎం కిరణ్ స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. మీ నీళ్లు, ఉద్యోగాలు దోచుకుంటామని సీఎం కిరణ్ , ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు బాహాటంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. రేపటి తెలంగాణ రణభేరీ సభలో కిరణ్ కుమార్‌రెడ్డి చరిత్ర అంతా చెబుతానని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కిరణ్ అక్రమ బాగోతాలు అన్నీ బయటపెడతానని వివరించారు. తెలంగాణ ప్రకటన రాగానే సీఎం కిరణ్ ఎన్నో ఫైళ్ల మీద అఘామేఘాల మీద సంతకాలు చేస్తున్నాడని తెలిపారు. వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ రాగానే వాటిపై విచారణ జరిపిస్తామన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే: కేసీఆర్
సమైక్య పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీలేదని కేసీఆర్ విమర్శించారు. ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నలబై ఏళ్లైనా కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని వివరించారు. కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతుందో ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటిది ఆయన పెద్ద పండితుడన్నట్టు కట్టె పట్టుకుని చూపిస్తూ వివరించాడని విమర్శించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.