పథకమెవరిది? పాత్రలెవరివి?

check-జంట పేలుళ్లపై ముమ్మరంగా దర్యాప్తు
– తీహార్ జైల్లో మక్బూల్‌పై విచారణ
– కర్ణాటక, బీహార్, మహారాష్ట్రకు సిట్
– రాజధానిలో అదుపులోకి ఆరుగురు?
– నెల్లూరు జైలుకు ఎన్‌ఐఏ బృందం..మక్బూల్‌ను కలిసిన ఖైదీల విచారణ
– సమాచారం ఇస్తే రూ.10లక్షల రివార్డు
– దర్యాప్తులో 15 బృందాలు
– ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు చేశారు? ఎవరితో చేయించారు? ఇప్పుడు ఇదే ప్రశ్న! కానీ జవాబు మాత్రం దొరకడం లేదు! హెచ్చరికలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్న విమర్శలు రావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు విచారణలో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. తమ దర్యాప్తులో భాగంగా దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాజీవ్‌చౌక్ (చౌరస్తా)లోని సీసీ కెమెరాతోపాటు ఏ1 మిర్చి సెంటర్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్న నగల దుకాణం సీసీ కెమెరా, సాయిబాబా ఆలయం ఆర్చి వద్ద ఉన్న సీసీ కెమెరా, పేలుడు జరిగిన బస్టాప్‌లోని మరో సీసీ కెమెరా రికార్డు చేసిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొంతమంది అనుమానితులను గుర్తించారని సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం ఈ అనుమానితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

తీహార్ జైల్లో…
పేలుళ్లలో గతంలో హైదరాబాద్‌లో అరెస్టయిన సయ్యద్ మక్బూల్‌పై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఒకటి తీహార్ జైల్లో అతడిని ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అయితే ఎలాంటి కీలక వివరాలనూ మక్బూల్ వెల్లడించనప్పటికీ.. దిల్‌సుఖ్‌నగర్, ఆబిడ్స్, బేగంబజార్‌లలో పేలుళ్లు సృష్టించటానికి కుట్రలు చేయటంతోపాటు రెక్కీ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన రియాజ్ భత్కల్ సోదరుడు యాసిన్ భత్కల్ ఆదేశాల మేరకే ఇదంతా చేశామని, రెక్కీ చేసినప్పటికీ కుట్రను అమలు చేయలేకపోయామని పేర్కొన్నట్లు సమాచారం. గురువారం రాత్రి విస్ఫోటనాలు సృష్టించింది ఎవరో తనకు తెలియదని చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మాత్రం ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరో మక్బూల్‌కు తెలిసే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని మరింత క్షుణ్నంగా విచారించాలని నిర్ణయించారు. దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక బృందం శనివారం నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఫిరోజ్, ఆబేద్ హుస్సేన్‌లను ప్రశ్నించింది. ఈ ఇద్దరిని గత సంవత్సరం మక్భూల్ అనే వ్యక్తి ములాఖత్‌లో కలిసినట్టుగా రికార్డుల్లో నమోదై ఉంది. జంట పేలుళ్లతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న సయ్యద్ మక్భూలే ఈ ఇద్దరిని కలిశాడా? అన్న కోణంలో ఈ ఇద్దరిని విచారించారు.

ఇతర రాష్ట్రాల్లో…
జంట పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌కు చేరుకున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలోని వేర్వేరు చోట్ల జరిగిన ఉగ్రవాద ఘటనల్లో పట్టుబడినవారిలో ఎక్కువగా బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు జంట పేలుళ్లకు పాల్పడ్డవారి కోసం స్థానిక పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నాయి. గతంలో ఉగ్రవాద చర్యల్లో పట్టుబడినివారితోపాటు.. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇక, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కూడా పేలుళ్లు సృష్టించిన వారి కోసం గాలింపు జరుపుతున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారని సమాచారం.

పురోగతి లేదు…
జంట పేలుళ్లు జరిగి నలభై ఎనిమిది గంటలు గడిచిపోయినా కేసులో మాత్రం పెద్దగా పురోగతి లేదు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా అనుమానితులను గుర్తించినప్పటికీ ఇప్పటివరకు వారిలో ఏ ఒక్కరి వివరాలు పోలీసుల చేతికి చిక్కలేదు. ఇదిలా ఉండగా శనివారం కర్ణాటక నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అనంతరం రాష్ట్ర పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక, ఎన్‌ఐఏ సిబ్బంది శనివారం మరోసారి ఘటనా స్థలాల్లో ఆధారాల కోసం అన్వేషించారు. బాంబు శకలాలను స్వాధీనం చేసుకున్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.