పక్కసూపుల సీపీఐ!

 

cpi
పేరుకు పెద్దన్న..
పోరుకు రానన్న!
మాటల తూటాలకే పరిమితమైన నేతలు
తెలంగాణపై పోరులో తామే పెద్దన్నలమంటారు! తెలంగాణపై ఎవరైనా వ్యతిరేకతతో ఉంటే ఈటెల్లాంటి మాటలతో.. తూటాల్లాంటి వ్యాఖ్యలతో ఏకిపారేస్తారు ఆ పార్టీ సారధి! ఆయన నోట్లో నోరెందుకు పెట్టామా.. అని ప్రత్యర్థులు ముఖంమాడ్చుకునేలా ఘాటైన విమర్శలతో తెలంగాణవాదానికి రక్షణగా నిలుస్తారు! కానీ.. నికరమైన తెలంగాణ ఉద్యమానికి మాత్రం నిర్దిష్ట కార్యాచరణ కనిపించదు! అడపాదడపా ఆందోళనలు.. తెలంగాణ కోసం ప్రచార జాతాలు.. పోరుయాత్రలు.. వాటి ముగింపులో బహిరంగ సభలు! అప్పుడప్పుడు నిరాహారదీక్షలు.. కలెక్టరేట్ల దిగ్బంధాలు! ఉన్నాం అనిపించుకునేలా మిలియన్‌మార్చ్, సాగరహారంలో! సకల జనుల సమ్మెలో మాత్రం కీలకపాత్ర! ఇదీ తెలంగాణ విషయంలో సీపీఐ స్థానం! తెలంగాణవాదానికి నిలబడిన సీపీఐ.. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది! అదే వాదంతో ముందుకెళ్లి.. టీఎంయూ మద్దతుతో ఆర్టీసీలో జయకేతనం ఎగరేసింది! ఇదే పోరాటస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇప్పటికే పోరాటవారసత్వం.. నికరమైన బలం ఉన్న సీపీఐకి తెలంగాణలో మరిన్ని ప్రతిఫలాలు దక్కుతాయన్నది తెలంగాణవాదుల అభిప్రాయం! అయితే.. ఆ పార్టీ నేతలు మాత్రం జనం కదిలిలొస్తేనే తప్ప.. స్వతంత్రంగా తెలంగాణ కోసం పటిష్టమైన ఉద్యమకార్యాచరణ ప్రకటించింది లేదన్న విమర్శలు ఉన్నాయి! అలాగని ఇతర ఉద్యమపార్టీలతో సమన్వయం చేసుకుని.. కలిసికట్టుగా తెలంగాణ సాధించే దిశగానూ సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి!
విశాలాంధ్ర నినాదం ఇచ్చిన సీపీఐ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించింది. వేల కోట్ల ప్యాకేజీలివ్వాలన్న వైఖరినుంచి పోరు పంథా దాకా పయనించింది. ఓ జాతీయ పార్టీగా జనంకోసం తన వైఖరిని సడలించుకుని.. తెలంగాణకు జై కొట్టింది! తెలంగాణ విషయంలో ఎవరైనా అడ్డంగా మాట్లాడితే.. అంతే అడ్డంగా ఎదురుదాడి చేసే నాయకుడు నారాయణ ఆ పార్టీకి ప్రత్యేకం! ఇతర పార్టీలవారే కాదు.. సొంత పార్టీ నేతలు నిరసన తెలిపినా.. కరాఖండితంగా పార్టీ విధానాన్ని కుండబద్దలు కొట్టే నేత నారాయణ! తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేవారిలో మరో సీనియర్ నాయకుడు.. తెలంగాణ నుంచి ఎదిగిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి! ఈ ఇద్దరు తప్పించి.. తెలంగాణపై గట్టిగా మాట్లాడేవారు సీపీఐలో పెద్దగా కనిపించరు! రాష్ట్రవ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలంగాణలో తనకంటూ ఉద్యమకేంవూదాలు ఉన్న సీపీఐ..వాటిని తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కదిలించడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. జేఏసీలో భాగస్వామి కాకున్నా.. అప్పుడప్పుడు దాని పిలుపులకు స్పందించే సీపీఐ.. స్వతంత్ర కార్యాచరణకు సిద్ధపడటం లేదని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ఇతర పార్టీల మాదిరిగానే.. సీపీఐ కూడా తెలంగాణపై ఏదైనా గట్టి కార్యక్షికమం జరిగినప్పుడో.. ఢిల్లీలో ఏదైనా పరిణామం సంభవించినప్పుడో తెలంగాణపై మాట్లాడటం.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న మిగతా పార్టీలు ఉద్యమించిన సమయంలోనే.. మేమూ ఉన్నామంటూ ఓ కార్యక్షికమం ప్రకటించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పోరాటం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బీజేపీ తరహాలోనే తనవైన పాకెట్లను కన్సాలిడేట్ చేసుకునేందుకు.. ఆయా ప్రాంతాల్లో యాత్రలు.. కార్యక్షికమాలు నిర్వహిస్తున్నది. తెలంగాణ విషయంలో ఇతర పార్టీలు స్తబ్దుగా ఉంటే సీపీఐలో కూడా స్తబ్దతే!

ఉద్యమ కార్యాచరణ ఏదీ?
రాజకీయాలతో కాదు ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందంటూ.. ప్రకటనలు చేసే సీపీఐ నాయకులు. వాళ్లు సొంత ఉద్యమ కార్యాచరణ రూపొందించి అమలు చేసిన సంఘటనలు తక్కువే. పార్టీ తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకున్నాక ఓ సందర్భంలో తిరుపతి వెళ్లినప్పుడు సొంత పార్టీ నేతలే తెలంగాణ విషయంలో పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తే ‘ఇది పార్టీ విధానం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక.. నన్ను నిలువునా చీల్చినా.. విధానంలో మార్పు ఉండదు’ అంటూ నారాయణ తెగేసి చెప్పడం ఆయన తెలంగాణవాదానికి ఎంతటి నిబద్ధతతో ఉన్నారో తెలియజేసే ఓ మచ్చుతునక మాత్రమే! ఇదే అంశాన్ని ఒక సందర్భంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ప్రస్తావిస్తూ.. ‘సీమాంధ్ర మొనగాడు’ అంటూ ప్రశంసించడం ప్రస్తావనార్హం! కొద్ది నెలల క్రితం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. సీపీఐ కార్యాలయానికి వెళ్లి.. వారి మద్దతు కోరారు. అందుకు టీఆర్‌ఎస్ కూడా సానుకూలంగా స్పందించింది. తర్వాత రెండు పార్టీల మధ్య కొంతకాలం రాకపోకలు జరిగినా.. తర్వాతికాలంలో అవి నిలిచిపోయాయి! మొన్నామధ్య వంద అసెంబ్లీ స్థానాలు.. 15 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణ తథ్యమన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పైనా నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు! ఓట్లు సీట్లతో తెలంగాణరాదని, ఉద్యమాలతోనే వస్తుందని పదే పదే ఉద్ఘాటించారు! దానితో రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పని చేసే అవకాశాలు లేవన్న సంకేతాలు వెలువడ్డాయి! అయితే.. ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందన్న సీపీఐ.. తెలంగాణ సాధన కోసం నిర్వహించిన మిలిటెంట్ ఉద్యమాలు ఏమిటన్నది ప్రశ్నగానే మిగులుతుందని తెలంగాణ రాష్ట్రవాదులు అంటున్నారు! రాజకీయ పార్టీలుగా రాజకీయ లబ్ధి ఆశించడం సహజమే. అయినా..దీర్ఘకాలిక ఉద్యమాలు నిర్వహించకుండా.. అప్పుడప్పుడు ఆందోళనలు నిర్వహించడం వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరదని వారు భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో బలంగానే ఉన్న ఆ పార్టీకి ఈ ప్రాంతంలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా.. ఆయా జిల్లాల్లో సైతం బలమైన సొంత కార్యక్షికమాలు నిర్వహించిన సందర్భాల్లేవన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో పార్లమెంటులోనూ తెలంగాణ అంశాన్ని సీపీఐ సభ్యులు ప్రస్తావించిన సందర్భాలు తక్కువేనన్న వాదన ఉంది.

ండు పడవలపై ప్రయాణం
ఇటీవలి ఉప ఎన్నికల సమయంలో సీపీఐ అవలంబించిన వైఖరి వివాదాస్పదమైంది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వ్యతిరేకులకు మద్దతిచ్చేది లేదన్న సీపీఐ.. అటు సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం అదే తెలంగాణ వ్యతిరేకులకు మద్దతు పలకడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్ మద్దతు పలికిన సీపీఐ, సీమాంవూధలో మాత్రం కొన్ని చోట్ల తెలంగాణ వ్యతిరేక శక్తులైన సీపీఎం, మరికొన్ని చోట్ల టీడీపీకి మద్దతిచ్చింది. ఇది రెండు పడవలపై ప్రయాణం చేయడమేనన్న విమర్శలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. పైగా డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును వెనుకేసుకరావడం సీపీఐకి పరిపాటిగా మారిందన్న వాదన ఉంది. జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తమ పదవులకు రాజీనామా చేసిన సమయంలోనూ సీపీఐ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవకాశాలు మెండు
తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీగా సీపీఐకి ప్రస్తుత పరిస్థితి మంచి అవకాశమని పలువురు ఉద్యమకారులు అంటున్నారు. తనకున్న ఉద్యమ బలంతో తెలంగాణ అంశంపై దీర్ఘకాలిక ఆందోళనరూపాలు నిర్మించి, ఢిల్లీ స్థాయిలో యూపీఏపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలాలు కూడా సీపీఐకి దక్కుతాయని గత అనుభవాలను వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో పొత్తుపెట్టుకొని సీపీఐ అనుబంధ సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఎన్నికైనవిషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రాంతంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందటానికి అవకాశంకల్పించింది కూడా తెలంగాణ అంశమేనని వారు పేర్కొంటున్నారు.

2007లో తెలంగాణకు అనుకూలం
సీపీఐ మొదట్లో విశాలాంధ్ర ఏర్పాటుకు కట్టుబడి ఉద్యమించింది. ఆ తరువాత తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, 2000 డిసెంబర్ 25న వరంగల్‌లో జరిగిన పార్టీ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌లో భాగంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, రూ.10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తీర్మానం చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ అమలు ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించింది. ఈ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోవడంతో.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే.. ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని భావించింది. ఇందులో భాగంగా 2007 డిసెంబర్ 19 నుంచి 23 వరకూ తిరుపతిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. దానిని 2008 మార్చిలో హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభ ఆమోదించింది.

This entry was posted in ARTICLES.

Comments are closed.