నగర శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంగా అడ్డగోలుగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. సెలబ్రిటీ క్లబ్ పేరుతో దాని యజమాన్యం భారీ ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నది. ఔటర్‌రింగ్‌రోడ్డు జంక్షన్‌కు ఆనుకొని ఉన్న ఈ క్లబ్ ఆక్రమణలో ప్రభుత్వ భూములే కాదు.. అటవీశాఖ భూములు, చెరువుశిఖం భూములు కూడా చేరిపోయాయి. ఈ భూములన్నీంటినీ క్లబ్ అనబడే తమ ప్రైవేటు ఎస్టేట్‌లో కలిపేసుకుంటూ చుట్టూ ప్రహరీగోడ కూడా నిర్మించారు. దీంతో ఎకరం కోటి రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములు ఈ క్లబ్ ఆధీనంలోకి వెళ్లాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సెలబ్రిటీ క్లబ్‌కు వివిధ ఫర్మ్‌ల పేరుతో సర్వేనంబర్లు 1220, 1221,1222, 1223, 1224, 1211, 1212, 1213, 1214, 1214, 1215, 1217లలోని మొత్తం 94 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది.
ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు లెక్కలు చూసి మరీ ధృవీకరించారు. ఇందులోనూ సర్వేనెంబరు 1217లోని 18 ఎకరాల 12 గుంటల భూమి యాజమాన్య హక్కులపై కోర్టులో వివాదం నడుస్తున్నది. రికార్డుల ప్రకారం 94 ఎకరాల భూమి సెలవూబిటీ క్లబ్లో ఉండాల్సి ఉండగా ఆ క్లబ్బు మాత్రం తాము 210 ఎకరాల్లో క్లబ్బును అభివృద్ధి పరిచామని ఇంట్నట్లో బాజాప్తాగా ప్రకటించింది. మిగిలిన 116 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్. అయితే ఈ సందేహం భూ వ్యవహారాలను కంటికి రెప్పలా చూడాల్సిన రెవెన్యూ అధికారులకు మాత్రం కలగడం లేదు. ఈ క్లబ్బు ప్రహారీ గోడ రింగురోడ్డుకు ఆనుకుని దాదాపు ఐదుకిలోమీటర్ల వరకూ నిరంతరాయంగా ఉందంటే దీని విస్తీర్ణమెంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా సెలబ్రిటి క్లబ్ ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణం ఐదారువందల ఎకరాలకు తగ్గదని భూముల లెక్కలు పక్కాగా చెప్పే గ్రామస్తులు వాదిస్తున్నారు. రెవెన్యూ లెక్కలకు కూడా అందనంత భూమి క్లబ్బు వారి ఖాతాలోకి ఎలా చేరిందో మరి. శామీర్‌పేటలో ఎకరం భూమి కోటి రూపాయలకుపైగా ధర పలుకుతున్నది. ఈ లెక్కన చూస్తే ఈ క్లబ్ ఆధీనంలో ఉన్న భూమి విలువ ఎటు చూసినా ఐదారు వందల కోట్లకు పైమాటే. ఈ రిసార్ట్ యాజమాన్యం తమ గ్రామాన్ని భారీగా కబ్జా చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అటవీ భూమి హాంఫట్
సెలబ్రిటీ క్లబ్ పరిధిలో అడవులకు అడవులే చేరిపోయాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ భూమి మొత్తాన్ని క్లబ్లో కలుపుకుంటూ ప్రహరీ గోడ నిర్మించేశారు. 483 సర్వే నెంబరుకు ఆనుకుని ఉన్న 1265 సర్వే నెంబర్లోని 443 ఎకరాల అటవీభూమి మొత్తం ఈ ప్రహరీ గోడ నిర్మాణంతో సెలబ్రిటీ పరిధిలోకి చేరిపోయిందని శామీర్‌పేట గ్రామస్తులు అంటున్నారు. ఈ భూమి చుట్టూ పట్టపగలు ప్రహరీ గోడను నిర్మిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పేదవాడు ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసినా దాన్ని తొలగించేదాక విశ్రమించని అధికారులకు ఐదు కిలోమీటర్ల పొడవునా అదికూడా ఆటవీభూమి ఆక్రమించి ప్రహరిగోడ నిర్మిస్తున్నా కనిపించకపోవడం గమనార్హం.
అటవీ భూములు కబ్జా అయినట్లు అంగీకరించిన శామీర్‌పేట ఎమ్మార్వో ఆ భూమిని కబ్జా బారి నుంచి రక్షించడానికి కనీస ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే తాను ప్రహరిగోడ నిర్మాణాన్ని అడ్డుకున్నానని నమ్మబలుకుతారు. ప్రహారిగోడ నిర్మాణం ఆపాలని క్లబ్ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు, ఫారెస్టు అధికారులకు లేఖ రాశానని కూడా ఆయన చెప్పారు. అంతటితో ఆయన చేతులు దులుపుకున్నారు. కానీ అక్కడ ప్రహరిగోడ నిర్మాణ పనులు ఆగలేదు. ఎమ్మార్వో స్థాయి మేజిస్ట్రేట్ అధికారాలున్న ఓ అధికారి ఒక కాగితం ఫారెస్టు డిపార్ట్మెంటుకు రాసి ఊరుకోవడ పై అనుమానాలొస్తే తప్పు అనుమానించిన వారిది మాత్రం కాదు. రింగ్‌రోడ్డుపై శామీర్‌పేట జంక్షన్ నుంచి మొదలయ్యే సెలబ్రిటీ క్లబ్ ప్రహరీ గోడ ఐదు కిలో మీటర్ల పొడవునా ఆ మార్గంలో వెళ్లే వారికి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ గోడ సరిగ్గా మండల సరిహద్దు వద్ద ముగుస్తుందని శామీర్‌పేట గ్రామస్తుడొకరు తెలిపారు. మండల సరిహద్దుకు ఈ గోడ కొండగుర్తుగా చెప్పుకునే పరిస్థితి ఉంది.
జిల్లెల కుంటను జల్లెడ పట్టారు
సెలబ్రిటీ క్లబ్ యజమాన్యం జల వనరులను వదల్లేదు శామీర్‌పేట గ్రామంలో ఈ క్లబ్ పక్కనే సర్వేనెంబర్ 1242లో 12 ఎకరాల 15 గుంటల భూమిలో ఉన్న జిల్లెలకుంటను కబ్జా చేశారు. ప్రభుత్వ చిన్న నీటి పారుదల శాఖ ఈ కుంటను గుర్తించి 1836 ఐడీ నెంబర్ కూడా ఇచ్చింది. ఈ కుంటను కబ్జా చేయడమే కాదు కట్టకు మధ్యలో ఉన్న తూమును కూడా క్లబ్‌లోనే కలిపేసుకున్నారు. ఈ కుంట మధ్యలో నుంచి ప్రహరీని నిర్మించారు. ఈ కుంటలో ఏడుఎకరాల భూమి కబ్జాఅయిందని స్థానికులు తెలుపుతున్నారు. ప్రతిరోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి రావడం పోవడం ఈ మార్గంలోనే అయినా కుంట కబ్జా కనిపించడంలేదు. ఆక్రమణల ఫలితంగా మరో కొద్ది రోజుల్లో ఈ కుంట పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు
బర్లను తిన్నోడికి గొర్రెలు లెక్కా అన్నట్టు భూములను ఆక్రమించి వారికి అందులో నిర్మాణాలు ఓ లెక్కా! కనీస అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు చేశారు. వాస్తవానికి శామీర్‌పేట గ్రామ భూములన్నీ వ్యవసాయ భూములే. వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టాలంటే భూవినియోగ మార్పిడికి అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత హెచ్ఎండీఏ నుంచి పర్మిషన్ తీసుకున్నాక నిర్మాణం చేపట్టాలి. కానీ సెలబ్రిటీ యాజమాన్యం అవేవీ లేకుండానే 12 అంతస్థుల భారీ భవనాన్ని త్రీ స్టార్ హోటల్‌గా రూపొందించే నిర్మాణం జరుపుతున్నారు. షరా మామూలే.. రెవెన్యూ అధికారులు కానీ, హెచ్ఎండీఏ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
సర్కారు భూమిని ప్రైవేట్ భూమిగా మార్చిన వైనం
ఉన్నమాట చెప్పుకోవాలి… రియల్ మాఫియా కొన్ని విషయాల్లో పక్కాగానే వ్యవహరించింది. ముందుగా సర్కారు భూమిని ప్రైవేట్ భూమిగా మార్చింది. క్లబ్ కొనుగోలు చేసినట్లు చెపుతున్న సర్వే నంబర్ 1218కి చెందిన భూమి వాస్తవంగా 2010 వరకు రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమి. ఆ తర్వాత ఈ భూమి పైవేట్ ఖాతాలో పడిం ది.
ఈ మేరకు సర్వేనెంబర్‌లోని 19 ఎకరాల 33 గుంటల భూమిని మహబూబ్రిజ్వానా, మహబూబ్ షరిఫ్ తదితరులకు ఇస్తూ ప్రభు త్వం జీవో 611 25-5-1977 ప్రకారం 2004లో లెటర్ నంబర్ ఎం-1420, 1421, 1422, /75/7-6-2004తో మూడు ఆర్డర్ లు ఇచ్చింది. అంటే సెలబ్రిటీ క్లబ్ ఏర్పాటుకు వీలుగా ముందు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరింది. ఇటు శామీర్‌పేట గ్రామస్తులేమో తమ గ్రామంలో రిజ్వానా అనే వారెవ్వరూ లేరని అంటున్నారు. 2004లో తమ భూమి తమకు ఇవ్వాలని సర్కారు చుట్టూ తిరిగిన వారు అలా భూమి చేతికి రాగానే ఇలా విక్రయించడమేమిటనే సందేహాలు వస్తున్నాయి. ఇదంతా రియల్ వ్యాపారులు, రిసార్ట్ యాజమా న్యం ఆడించిన నాటకమనే అనుమానాలు గ్రామస్తుల్లో ఉన్నాయి. 1218 సర్వేనంబర్‌లో సెలవూబిటీ యజమాన్యం కొంత కొనుగోలు చేసినట్లు, రాఘవేంద్ర సంస్థకు చెందిన నాగభూషణం కొంత భూమిని కొన్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ సర్వేనెంబర్ భూ మిలో కొంత భాగం సెలవూబిటీ క్లబ్లో ఉండగా, మరి కొంత భాగంలో సెలబ్రిటీకి ముందు అక్కడ ఒక విద్యాసంస్థలో ఉంది. అయితే ఈ భూమిని తన పేరున రాయించుకున్న మహబూబ్రిజ్వానా, మహబూబ్షరీఫ్లు ఎవరనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.