నేడు చేప ప్రసాదం పంపిణీ

 హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉబ్బస రోగులకు ఉపశమనం కలిగిస్తుందని బహుళ ప్రాచుర్యంలో ఉన్న చేప ప్రసాదం పంపిణీకి సమయం ఆసన్నమైంది. మృగశిర కార్తె నాడు పాతబస్తీకి చెందిన బత్తిన కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని అందించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జన విఙ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం వంటి సంస్థలు కల్పించిన ఉద్రిక్తతల నడుమ ఈ ఏడాది కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది మందే కాదని, ఉబ్బసాన్ని తగ్గించే ఔషధ గుణాలే లేవంటూ చేస్తోన్న ప్రచారానికి స్పందన కనిపించడం లేదు. లోకాయుక్త తీర్పుతో కొంత ఆందోళన నెలకొంది. కానీ బత్తిన కుటుంబానికి పలువురు మద్దతు ప్రకటించడంతో దూద్‌బౌలిలోనే నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే నగరానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా జనం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, మత్య్స, ఆర్టీసీ, విద్యుత్తు, జలమండలి, పోలీసు శాఖల అధికారులు వారి పరిధిలోని సదుపాయాలను కల్పించేందుకు వారం రోజులుగా కసరత్తు చేశారు. కలెక్టర్ రెవెన్యూ శాఖ తరఫున చేయాల్సిన పనులేవీ లేకపోయినా ఈ శాఖలకు ఏయే సదుపాయాలు కల్పించాలో ఐదు రోజుల క్రితమే వివరించారు. అందులో భాగంగానే వచ్చే జనం ఇబ్బందులకు గురి కాకుండా 50 వరకు తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, నిరంతర విద్యుత్తు సరఫరా వంటివి కల్పించారు.

ఆర్‌అండ్‌బీ అధికారులు 32 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ బారికేడ్లను బిగించారు. ఇందులో 15 పురుషులకు, 15 మహిళలకు, ఒక్కటి వికలాంగులకు, మరొకటి వీఐపీలకు కేటాయించారు. కోర్టు ఆదేశాలు పాటించాలని జన విఙ్ఞాన వేదిక, లోకాయుక్తలు సూచించాయి. అలాగే ప్రసాదం కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కౌంటర్లు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్‌లు ఎక్కడెక్కడ ఉంటాయో సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు రోగులకు అన్నదానం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంస్థలు పులిహోర వంటి ప్యాకెట్ల పంపిణీకి ముందుకొచ్చాయి. బత్తిన సోదరులు మృగశిర కార్తె రోజు మొదట ఇంటి దగ్గర కొందరికి పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని పంపిణీ కార్యక్షికమాన్ని మొదలుపెడుతారు.

ప్రత్యేక బస్సులు..
చేప ప్రసాదం పంపిణీకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ కోటేశ్వర్‌రావు తెలిపారు. జంట నగరాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతుందని పేర్కొన్నారు. ‘చేప ప్రసాదం స్పెషల్ -ఎగ్జిబిషన్ గ్రౌండ్’ అనే డెస్టినేషన్ బోర్డులతో 8వ తేదీన ఉదయం 4 గంటల నుంచి 9వ తేదీ అర్ధరాత్రి రద్దీ ముగిసే వరకూ బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు , శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తామని అన్నారు. ప్రత్యేక బస్సులే కాకుండా రోజు తిరిగే బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆర్టీసీ సూపర్‌వైజర్లు మార్గ మధ్యంలో ప్రధాన ప్రాంతాల్లో అందుబాటులో ఉండి ప్రత్యేక బస్సులను నియంత్రిస్తారని ఈడీ కోటేశ్వర్‌రావు తెలిపారు. అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. ప్రత్యేక బస్సుల్లో రోజు వారి సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని, జంటనగరాల ప్రజలతో పాటు చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

2 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం
చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా జలమండలి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే రోగులు, సందర్శకులను దృష్టిలో ఉంచుకుని నిజాం కాలేజీ ప్రాంగణంలో పది చోట్ల వాటర్ క్యాంపులను సిద్ధం చేశారు. అంతేకాకుండా క్యూలైన్లలో నిల్చున్న వారికి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్టు సీజీఎం రవీంద్రనాథ్ తెలిపారు.

అన్ని చర్యలు తీసుకున్నాం: కొత్వాల్
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది చేప ప్రసాదం కోసం వాహనాల్లో వస్తుంటారని, వారి వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తకుండా సాధారణ ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా దూర ప్రాంతాల నుంచి రైళ్లల్లో, బస్‌లలో వస్తున్న ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట రైల్వే స్టేషన్‌లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ప్రీ పెయిడ్ ఆటోలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎనిమిది, తొమ్మిది తేదీల్లో రాత్రి, పగలు పనిచేస్తాయన్నారు. కోఠి, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఏక్ మినార్ వైపు నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే సాధారణ జనం చేపమందును దృష్టిలో పెట్టుకొని ఇతర మార్గాల గుండా వెళ్లాలని కమిషనర్ కోరారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.