నేటినుంచికౌంట్‌డౌన్

దేశ రాజధానిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చకచకా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక కౌంట్‌డౌన్ సోమవారం ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు శుభముహూర్తం. కేంద్ర మంత్రిత్వశాఖల కార్య దర్శుల భేటీతో తెలంగాణ ప్రక్రియలోని అధికారిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తం 16 రోజుల్లో వివిధ ప్రక్రియలన్నీ పూర్తిచేసుకుని ఈ నెల 26 నాటికి తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభకు చేరుతుంది. అధికారిక ప్రక్రియ ఇలా సాగుతుండగానే రాజకీయ ప్రక్రియలో సైతం జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో జీవోఎం చివరిసారి సంప్రదింపులతో ఇక ఆ లాంఛనం కూడా పూర్తి చేయనున్నారు. సోమవారంనాడే సీమాంధ్ర మంత్రులతో ప్రధాని సమావేశమవుతున్నందున సీమాంధ్ర ప్యాకేజీకి తుదిరూపు వచ్చే అవకాశముంది.

మరోవైపు ముఖ్యమంత్రి విభజన వ్యతిరేక వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదివారం స్పందించారు. ఆయన సీడబ్ల్యూసీని మించినవాడు కాదన్నారు. పార్టీ అత్యున్నత వేదిక ఆదేశాలు తలదాల్చాల్సిందేనని మార్గదర్శనం చేశారు. విభజన ప్రక్రియ ఏ అవాంతరాలు లేకుండా సాగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అధికారికంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2013’గా పిలుస్తారు. ఈ బిల్లు మరో పదహారు రోజుల్లో అసెంబ్లీకి రానున్నది. ఈ మేరకు అంతా సిద్ధమైందని కేంద్ర హోం శాఖ వర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనలో కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జీవోఎం భేటీతో కౌంట్‌డౌన్ సోమవారం ప్రారంభం కానున్నది. హోంశాఖ, ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ, సిబ్బంది నియామకాలు సర్వీసులు (పర్సనల్) శాఖ ..

తదితర మొత్తం పదకొండు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు జీవోఎం సమావేశంలో పాల్గొననున్నారు. మంత్రుల బృందం వీరితో పలు కీలక అంశాలు చర్చించనున్నది. ప్యాకేజీ తో సహా సీమాంధ్రకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన వివిధ రంగాలకు చెందిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. దాంతోపాటు విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సిన అన్ని రంగాలకు చెందిన వాటాలను, పంపకాలను ఖరారు చేస్తారు. ఈ నెల 12, 13 తారీఖుల్లో జీవోఎం రాష్ట్ర పార్టీలతో విడివిడిగా సంప్రదింపులుgrpsd జరుపనున్నది. విభజన వ్యవహారానికి సంబంధించి రాజకీయ పార్టీలతో ఇవే చివరి సంప్రదింపులుగా భావించవచ్చు. ఈ సమావేశాలకు హాజరుకానున్న పార్టీల సంఖ్యను బట్టి సమావేశాలు ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తారు. తెలంగాణ ఏర్పాటకు సీడబ్య్లూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీలతో ఇదే మొదటి సమావేశం. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందు విభజనకు అంగీకారం తెలిపిన బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీలు తర్వాత మాట మార్చడం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయా పార్టీల అసలు అభిప్రాయాలు తీసుకోవడం విడివిడి సమావేశాల ఉద్దేశ్యంగా కనబడుతోంది.

11 తేదీ నాటి కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శుల భేటీ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని, 12 13 తేదీల్లో రాష్ట్ర పార్టీలతో చివరి సంప్రదింపుల సందర్భంగా తీసుకున్న ‘అంతరంగిక సలహాలు సూచనలను’ పొందుపరచడంతో బిల్లుకు తుదిరూపునిచ్చే కార్యక్రమం పూర్తవుతుంది. ఈ నెల 13 నుంచి 18 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానున్నదని సమాచారం. తదనంతరం ఈ నెల 18 న రాష్ట్రానికి (ఇరు ప్రాంతాలకు) చెందిన కేంద్ర మంత్రులతో జీవోఎం సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో పూర్తిస్ధాయిలో తయారైన ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2013’ వారి ముందుంచుతారు. బిల్లులో పొందుపరిచిన కీలక అంశాల మంత్రులకు వివరిస్తారు. అసెంబ్లీకి బిల్లు వెళ్లేముందే అందుకనుగుణంగా ఇరు ప్రాంత నేతల ‘మైండ్‌సెట్’ ను తమకు అనుకూలంగా మలిచేందుకే వీరితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ నెల 18నుంచి న్యాయశాఖలో ఈ బిల్లుకు (ఇప్పటికే తయారైన తన నివేదికకు) తుది మెరుగులు దిద్దుతారు. అనంతరం న్యాయశాఖ నుంచి కేంద్ర హోం శాఖకు బిల్లు చేరుతుంది. అంతా సిద్ధమైన ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2013’ ఈ నెల 21నాటికి కేబినెట్ ముందుకు వస్తుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం దాన్ని ఆమోదించి అదేరోజున ‘బుప్లూట్ మెసెంజర్’ ద్వారా రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. తన వద్దకు చేరిన బిల్లును పరిశీలించేందుకు రాష్ట్రపతి సుమారు రెండు రోజుల సమయం తీసుకోవచ్చు. అనంతరం రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించి బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రానికి పంపనున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రపతి నుంచి బయల్దేరే బిల్లు 23, 24 తేదీల్లో గవర్నర్‌కు అందనుందని సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని, శాసన సభ స్పీకర్‌ను కాంగ్రెస్ పెద్దలు సమాయత్తం చేసినందున ఓ మూడు రోజుల సమయంలో అంటే 26, 27 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరిచే అవకాశముంది.

బిల్లు మీద శాసనసభ నిర్ణీతకాల పరిమితిలోపలే అభివూపాయం చెప్పాల్సి ఉంటుంది. ఏఐసీసీ వర్గాల అంచనా ప్రకారం అసెంబ్లీ ఒకటి రెండు రోజులు మాత్రమే సమావేశం జరిపే అవకాశముంది. ఈ సందర్భంగా చర్చ సాఫీగా సాగకున్నా.. గందరగోళం ఏర్పడి వాయిదా పడినా సభాపతి అర్దాంతరంగా ముగించినా ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ ‘అకనాడ్ర్జిమెంటు’ మాత్రమే కీలకం. అసెంబ్లీకి బిల్లు అందిందా లేదా అనే విషయాన్ని మాత్రమే రాష్ట్రపతి పరిగణలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. సభ అభివూపాయానికి కట్టుబడే అవసరం కూడా లేనందున సభ సాగినా లేకున్నా సభ అభివూపాయం వెల్లడించినట్టే భావించి తదుపరి చర్యలకు రాష్ట్రపతి ఉపక్రమించవచ్చు. అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చిన ముసాయిదా బిల్లుపై సంతకం చేసి కేంద్ర క్యాబినెట్‌కు రాష్ట్రపతి పంపించి తన బాధ్యత నెరవేర్చవచ్చు. ఈ ప్రక్రియ అవాంతరాలు లేకుండా సాగితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు డిసెంబర్ 9 నాటికి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తుంది.

నేడు సీమాంధ్ర మంత్రులతో ప్రధాని భేటీ..
సోమవారం ఉదయం 12 గంటలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. హైదరాబాద్‌తో సహా బిల్లులో పొందుపరచాల్సిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మరింత స్పష్టత రానున్నదని సమాచారం. ఉమ్మడి రాజధాని పరిధిని జీహెచ్‌ఎంసీ మొత్తానికి విస్తరించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ శాంతి భద్రతలు, ల్యాండ్ , రెవెన్యూను తెలంగాణ గవర్నర్ చేతిలోఉంచే ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయని సమాచారం. సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను ప్రధాని పరిగణలోకి తీసుకుని మంత్రుల బృందానికి అందజేయనున్నట్లు సమాచారం.

ఆసక్తిగొలుపుతున్న కేసీఆర్ పర్యటన..
ఇదిలా ఉంటే జీవోఎంతో సమావేశం కోసం సోమవారం సాయంత్రం పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావుతో కలిసి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. జీవోఎంతో సమావేశంతో పాటు అలాగే ఢిల్లీలో ఆయన జరపనున్న ఇతర సమావేశాలు రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రభావితం చేసేవే. రాజకీయంగా ఈ సమయంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది. పది జిల్లాల తెలంగాణ ప్రకటిస్తే టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలపడానికి కేసీఆర్ గతంలో ఆ పార్టీకి ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు తెలంగాణ వాదుల్లో కూడా ఈ విషయమై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇకపోతే సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటన చేసిన నాటినుంచి నేటి వరకు కేసీఆర్‌కు ప్రాధాన్యతనివ్వకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నది.

కేవలం తెలంగాణ ప్రకటన సందర్భంలో అదీ ఓ విలేకరి ప్రశ్నకు బదులుగా మాత్రమే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కేసీఆర్ పాత ప్రకటనను గుర్తు చేశారు తప్ప ఆ పార్టీ వైపునుంచి ఆ తర్వాత ఎప్పుడూ విలీనంపై ప్రకటనలేం రాలేదు. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తమకు మాత్రమే దక్కాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దానికి ప్రతిగా కేసీఆర్ కూడా విలీనం ఏకపక్షమేమీ కాదంటూ ప్రారంభించి రానురాను ధృఢవైఖరి వెల్లడిస్తూ వస్తున్నారు. తాను కోరిన సందర్భంలో కాంగ్రెస్ ముందుకు రాలేదని అన్నా సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ అంశాన్ని తెలుగుదేశం వంటి పార్టీలు అనుకూలంగా మార్చుకోకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌పై ఆంక్షల విషయంలో ఆయన చేసిన తీవ్రస్వరంతో చేసిన ప్రకటనలు భవిష్యత్ రాజకీయాలకు సూచికగా భావించవచ్చు.

సీడబ్ల్యూసీ తీర్మానం సీఎం తలదాల్చాల్సిందే: డిగ్గీరాజా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించాల్సిందేనని కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. సీయం విభజనను అంగీకరించారని తాను చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ మాట్లాడుతూ సీఎం సీడబ్ల్యూసీ ని మించిన వాడు కాదన్నారు. ‘రాష్ట్ర విభజన పై తాను కన్విన్స్ అయ్యానని చెప్పడం దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత అభివూపాయం’గా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తన వ్యాఖ్యలను కిరణ్ కుమార్ రెడ్డి తేలికగా తీసిపారేయడం పట్ల దిగ్విజయ్ అసహనం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యంత ఉన్నతమైన నిర్ణాయక వ్యవస్ధ, దాని నిర్ణయం పార్టీ తరపున ఎన్నికైన సీఎంతో సహా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శిరోధార్యమని’ స్పష్టం చేశారు. ‘ముఖ్యమంవూతిగా కిరణ్‌కుమార్ రెడ్డి తన సొంత అభివూపాయాలు, భిన్నాభి ప్రాయాలు కలిగి ఉంటే ఉండవచ్చు.. కానీ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే. అందులో తిక మక ఏమీ లేదు’ అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడని మరోసారి ధీమా వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర విభజన ప్రక్రియ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుందన్నారు. కాగా సీయం కిరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది ఆధారం లేని గాలి వార్తగా కొట్టిపారేశారు.

ఇదీ షెడ్యూలు..
11వ తేదీ: కేంద్ర కార్యదర్శులతో జవోఎం భేటీ
12,13 తేదీలు: రాష్ట్ర పార్టీలతో జీవోఎం ఆఖరి సంప్రదింపులు
13 నుంచి 18 తేదీలు : బిల్లుకు ‘కీలక అంశాల’ కూర్పులు, చేర్పులు
18 వ తేదీ: రాష్ట్రానికి చెందిన కేంద్ర ముంత్రుల ముందుకు ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2013’
21వతేదీ: క్యాబినెట్ ఆమోదానికి రాష్ట్ర విభజన బిల్లు, అదేరోజు రాష్ట్రపతికి
23వ తేదీ: రాష్ట్రపతి నుంచి గవర్నర్‌కు
26,27 తేదీలు: శాసనసభ ముందుకు విభజన బిల్లు
డిసెంబర్ 9: పార్లమెంటుకు తెలంగాణ బిల్లు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.