నెలాఖరుకల్లా.. అసెంబ్లీకి టీ బిల్లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు నవంబర్ మాసాంతానికి అసెంబ్లీకి చేరుకోనుంది. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్‌లో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమో దం పొందేలా మంత్రుల బృందం (జీవోఎం) తగిన కార్యాచరణను రూపొందించుకున్నట్లు తెలిసింది. గురువారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన జీవోఎం నిర్వ హించిన సమావేశంలో ఇదే అంశంలో చర్చలు జరిగినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణ బిల్లు తగిన సమయంలో అసెంబ్లీకి వెళుతుందని చెప్పారు.
ఆ తగిన సమయం ఈ నెలాఖరేనని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీమాంధ్రకు ప్యాకేజీ, హైదరాబాద్ అంశంపై నిర్ణయం వంటి విషయాలు తెలంగాణ బిల్లులోనే ఉంటాయని జీవోఎం సమావేశం అనంతరం షిండే చెప్పారు.

జీవోఎం విధి విధానాలపై వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి 18వేల నివేదికలు అందాయని తెలిపారు. 11 శాఖల కార్యదర్శుల నుంచి కూడా నివేదికలు అందాయని, వారితో 11న భేటీ అవుతున్నామని తెలిపారు. అనంతరం 12, 13 తేదీల్లో రాష్ట్రానికి చెందిన గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమవుతామని పేర్కొన్నారు. నెలాఖరులోపు పని పూర్తి అవుతుందని షిండే చెప్పినా.. అంతకుముందే 25 నాటికి కేంద్ర కేబినెట్‌కు జీవోఎం తుది నివేదిక అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు ఒక మండలిని ఏర్పాటు చేసి, దానిని గవర్నర్ పర్యవేక్షణలో ఉంచుతారని సమాచారం. నీటి పంపకాల విషయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఒక హైపవర్ బోర్డును ఏర్పాటు చేసే యోచనలో జీవోఎం ఉన్నదని తెలిసింది. విభజన నేపథ్యంలో ఎవరికెంత? ఏ ఉద్యోగులు ఎటు? ఆస్తులేంటి? అప్పులేంటి? తదితర అంశాల్లో పంపకాలు శుక్రవారం నాటికి ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. అది తేలితే ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసిన అధికారులు చెబుతున్నారు.

సమయాభావాన్ని నివారించేందుకుగాను.. తెలంగాణ ముసాయిదా బిల్లు రూపకల్పన విషయం లో కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే సమాంతర కసరత్తు జరుపుతున్నదని సమాచారం. రెవెన్యూ, హైదరాబాద్ విషయా లు మినహా మిగిలిన అంశాలను బిల్లులో పొందుపర్చే పనిలో న్యాయశాఖ నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. జీవోఎం సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన షిండే.. ‘విభజనకు సంబంధించి వివిధ కేంద్ర మంవూతిత్వ శాఖలనుంచి మేము కోరిన నివేదికలు అందాయి. ఆయా శాఖల కార్యదర్శులతో 11న సమావేశం కానున్నాం. ముందు వారు చెప్పే విషయాలు వింటాం’ అని తెలిపారు. ఉభయ రాష్ట్రాలకు మానవ, ఆర్థిక, ఇతర వనరుల పంపకంలో ఈ శాఖల నివేదికలే కీలకం కానున్నాయి. ఇదిలా ఉండగా.. జీవోఎంను టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం బహిష్కరించిన నేపథ్యంలో వారిని మినహాయించి ఒకే రోజు అఖిలపక్షం జరపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. షిండే మాత్రం 12, 13 తేదీల్లో రాష్ట్రానికి చెందిన పార్టీలతో సమావేశం జరుగుతుందని తెలిపారు. ‘విభజనపై జీవోఎంతో చర్చించడానికి రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలకు సమయం ఇచ్చాం.

వారితో 12, 13 తేదీల్లో సమావేశమవుతాం. ప్రతి పార్టీ నుంచి ఒక ప్రతినిధి వస్తే మంచిది. ఇద్దరు కూడా రావొచ్చు. ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమమయాన్ని కేటాయించాం. ఈ చర్చల అనంతరం ఈనెల 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో చర్చించనున్నాం’ అని షిండే వివరించారు. సమావేశం ప్రారంభానికి ముందు విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన షిండే.. నెలాఖరులోపే జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌కు అందజేస్తామని చెప్పారు. ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి సరైన సమయంలోనే వెళుతుందని తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు నష్టం జరుగకుండా వారికి మంచి ప్యాకేజీ అందజేస్తామన్నారు. రెవెన్యూ పంపకాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తబోవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై నిర్ణయం ఎలా ఉండబోతున్నదన్న ప్రశ్నకు.. నిర్ణయం తుది దశలో ఉన్నదని, సీమాంధ్రకు ప్యాకేజీతోపాటే ఈ విషయాన్ని కూడా బిల్లులోనే పొందుపరుస్తామని చెప్పారు. షిండే అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం, పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జైరామ్ రమేశ్‌తోపాటు ప్రత్యేక ఆహ్వానితుడు, న్యాయశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. రక్షణ మంత్రి ఆంటోనీ, ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

హైదరాబాద్‌లో ఇటీవల పర్యటించిన టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహించిన హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారుడు కే విజయ్‌కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా సేకరించిన అభివూపాయాలతో తయారు చేసిన నివేదికను ఆయన జీవోఎంకు అందించినట్లు సమాచారం. విభజనపై తమ పిలుపు మేరకు వచ్చిన సలహాలు సూచనలపై దాదాపు గంటన్నరపాటు సభ్యులు చర్చించారు. వీలైనంత త్వరగా జీవోఎం నివేదికకు తుది రూపం ఇవ్వడంతో పాటు రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపె చేపట్టవలసిన కార్యాచరణపై కసరత్తు చేసినట్లు సమాచారం. విభజన అనంతరం తలెత్తే సమస్యలతోపాటు సీమాంధ్ర ప్రాంతానికి అందించాల్సిన ప్యాకేజీ గురించి వారు సమాలోచనలు జరిపారని తెలిసింది. హైదరాబాద్‌పై సీమాంధ్రకు హక్కులు కల్పించాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం వారు మొయిలీ, చిదంబరం తదితర జీవోఎం సభ్యులతో సమావేశమై, ఇదే విషయంపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ, విద్య ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్లు తదితర హక్కులపై ఆమోదయోగ్యమైన పరిష్కారాలకోసం సీమాంధ్ర మంత్రుల డిమాండ్లపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.