నెత్తుటి బాకీ తీర్చుకున్నరు

‘నెత్తుటి బాకీ తీర్చుకుంటాం’ అని హెచ్చరించిన మావోయిస్టులు అన్నంతపనీ చేశారు. గత నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తిలో ఆంధ్రా గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, ఆ రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కేకేడబ్ల్యూ కమిటీకి చెందిన 9 మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నెత్తుటిబాకీ తీర్చుకుంటామని హెచ్చరించిన మావోయిస్టులు తమ దాడులను ఉధృతం చేశారు. అప్పటికప్పుడే గ్రేహౌండ్స్ ఆర్‌ఐ శివప్రసాద్ని హతమార్చారు. అనంతరం దండకారణ్య పరిధిలోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో పలు ఘటనలకు పాల్పడి 15 మంది పోలీసులను హతమార్చారు. ఇన్‌ఫార్మర్‌లన్న నెపంతో 10 మంది గ్రామీణులనూ హతమార్చారు. దండకారణ్యంలో దంతెవాడ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ గిరిజన నాయకుడు, సల్వాజుడుం సృష్టికర్త, ‘బస్తర్ టైగర్’గా పేరుపొందిన మహేంద్ర కర్మను లక్ష్యంగా చేసుకొని నిన్న జరిపిన దాడిలో దాదాపు 30 మందిని హత్య చేశారు.సీపీఐ నేతగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన మహేంద్ర కర్మ ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2000 నుంచి 2003 వరకూ అజిత్ జోగి ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా చేశారు. బస్తర్ నుంచి లోక్‌సభకు, దంతెవాడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2003-2008 మధ్య సీఎల్పి నేతగా, విపక్ష నేతగా ఉన్నారు. పేరుకు ప్రతిపక్ష నాయకుడైనప్పటికీ దండకారణ్యంలో ప్రభుత్వ పాలన ఆయన సూచనల మేరకే సాగేది. ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యం అపారమైన సహజవనురులకు నిలయం. గోండు, కోయ గిరిజన తెగల ప్రజల ఆవాసమైన ఆ ప్రాంతంలో చాలాకాలంగా నక్సల్స్ సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో 1991లో మహేంద్ర కర్మ నక్సల్స్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా జన్ జాగరణ్ అభియాన్ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో అది విఫలమైంది. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగింది. దండకారణ్యంలో గనుల తవ్వకాలం కోసం టాటా, ఎస్సార్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ సంస్థల కార్యక్రమాలకు అవాంతరం లేకుండా ఉండేందుకు నక్సల్స్‌ను ఏరివేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇదేఅదనుగా మహేంద్రకర్మ మరోసారి రంగంలోకి దిగారు. 2005లో బీజాపూర్‌లో నక్సల్స్‌కు వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు ప్రారంభించిన శాంతియాత్రను దంతెవాడ, ఇతర ప్రాంతాలకు విస్తరించారు. అదే ఆ తరువాత’సల్వాజుడుం’గా రూపం మార్చుకుంది. నక్సల్ వ్యతిరేక నిఘా బృందాలను ‘సల్వాజుడుం’ పేరిట ఏర్పాటు చేయడంలో కర్మ కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయన మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు.

గిరిజనులకు ఆధునిక మారణాయుధాలు ఇచ్చి వాటిని ఉపయోగించే శిక్షణను అందిస్తున్నారు. ఇందులో గిరిజనులే ప్రత్యేక పోలీసు అధికారులుగా వ్యవహరిస్తారు. వారిని కోయ కమాండోలు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం దాదాపు 4000 మంది ఎస్పీఓలు ఉన్నారని సమాచారం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో 23 సల్వాజుడుం శిబిరాలున్నాయి. ఇందులో 50 వేల మంది గిరిజనులకు ఆశ్రయం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ 20 వేల మందే ఉన్నారని తెలుస్తోంది. సల్వాజుడుంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఆయుధశిక్షణ ఇస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దంతెవాడ జిల్లాలోనే సల్వాజుడుంలో 12 వేల మంది బాలసైనికులు ఉన్నట్లు ఓ స్వచ్చంద సంస్థ వెల్లడించింది. గిరిజనులను బలవంతంగా ఎత్తుకెళ్లి శిబిరాలకు పంపిస్తున్నారన్నది మరో అభియోగం. 644 గిరిజన గ్రామాలను సల్వాజుడుం తగలబెట్టిందని, ఫలితంగా 3 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులయ్యారని స్వచ్చంద సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో 2011 జులై 6న సల్వాజుడుం అక్రమమని సుప్రీంకోర్టు ప్రకటించింది. సల్వాజుడుంను రద్దు చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సల్వాజుడుంను స్థాపించి తమకు ప్రధాన అడ్డంకిగా ఉన్న 66 ఏళ్ల కర్మను మట్టుబెట్టటానికి మావోయిస్టులు చాలాసార్లు దాడులు చేశారు. దాంతో ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన ఇంటి వద్ద ప్రత్యేక బెటాలియన్‌నే ఏర్పాటు చేశారు. ఆయనను అంతమొం దించేందుకు నక్సలైట్లు 2012 నవంబర్ 8న మందుపాతరతో దాడి చేశారు. బులెట్‌ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్న కారణంగా కర్మ తప్పించుకున్నారు. కర్మను అంతం చేయడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి పూవర్తి ఘటన తోడైంది. దాంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం వేచి ఉన్నారు.

సుక్మాలో జరిగిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు నిన్న సాయంత్రం కెష్లూర్ వైపు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బస్తర్ జిల్లాలోని దర్భాఘాట్ వద్ద మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. దారికి అడ్డంగా చెట్లు నరికి పడవేశారు. మందుపాతరను పేల్చారు. దాదాపు వంద మంది మావోయిస్టులు అకస్మాత్తుగా కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది చనిపోయారు. మహేంద్ర కర్మపై తొలుత గ్రేనేడ్ ప్రయోగించారు. తరువాత గుళ్ల వర్షం కురిపించారు. అప్పటికీ వారి కసి తీరలేదు. బండరాయితో మోది శరీరాన్ని ఛిద్రం చేశారు.. మావోయిస్టు పార్టీ దర్భా డివిజన్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో మహేంద్ర కర్మతోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉదయ ముదలియార్, మరో నేత గోపీచంద్ వాద్వానీ, కార్యకర్తలు, పోలీసులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్లను కిడ్నాప్ చేశారు. ఆ తరువాత వారిని కూడా హత్య చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.